Monday, 31 December 2012

న్యూఇయర్ ఙ్ఞాపకాలు

                     నాకు ఊహ తెలిసనప్పటినుంచి జనవరి ఒకటో తారీఖు హడావుడి దీపావళి పండగ అవగానే మొదలయ్యేది. అప్పట్లో పావలాకు హీరోలు, హీరోయిన్ల, బాల నటీ,నటులు, పూవులు, ప్రకృతి ఫోటోలుగా గ్రీటింగ్ కార్డులు దొరికేవి. ఇంట్లో అమ్మ ఇచ్చిన అర్ధరూపాయి, రూపాయి కూడబెట్టి ఈ గ్రీటింగ్ కార్డులు కొనుక్కునేవాళ్ళం. నేను రెండు,మూడు తరగతులు చదివేటప్పుడు మాత్రం అన్నయ్యవాళ్లు మమ్మల్ని తీసుకెళ్లి కొనిపెట్టేవాళ్లు రెండు,మూడు షీట్లు.ఒక్కొక్క షీటుకి తొమ్మిది కార్డులు ఉండేవి.
             అసలు అదంతా ఒక పండగలాగా ఉండేది. బడిలో పిల్లలంతా డిసెంబర్ నెల మొత్తం నువ్వు ఎలాంటి కార్డులు కొంటున్నావ్? నీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయి అని ఒకటే హడావుడి. కొంతమంది ముందుగానే వాళ్లతో ఉన్న ఫోటోలన్నీ చూపించి నీకు ఏది కావాలో అదే ఇస్తాను అని చెప్పేవాళ్లు. మళ్లీ అది ఇంకొకరు ఎంచుకోకుండా దాని వెనక పేరు వ్రాసి ఒకరి కోసం దాన్ని ముందుగానే రిజర్వు చేసేవారు :D.మేము  ఎక్కువగా బేబి శ్యామిలి  ఫోటోలు కొనేవాళ్లo. ఇక అబ్బాయిల కోసం హీరోల ఫోటోలు, టీచర్ల కోసం పూవుల ఫోటోలు కొనేవాళ్ళం. ఏ ఒక్కరికీ రెండు ఒకే ఫోటోలు రాకుండా జాగ్రత్త పడేవాళ్లం. కొంతమంది ముందుగానే గ్రీటింగ్ కార్డ్ వెనకాల పేరు వ్రాయించుకోకుండా తీసుకునేవారు. ఇంకొక సంవత్సరం ఇంకొకరికి ఇవ్వొచ్చు అనే ఆలోచనతో.:P  నచ్చినా, నచ్చకపోయినా ఎలాంటి కల్మషం లేకుండా, లేనిపోని మొహమాటాలకు పోకుండా ఒకరికొకరు మొహం పైనే చెప్పేసుకుని నచ్చింది ఇచ్చి పుచ్చుకునే వాళ్లం. స్కూలికి కొత్త డ్రెస్ వేసుకుని చాక్లెట్లు ఒక పర్సులో వేసుకుని చాలా ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. ఇష్టమైన వాళ్లకేమో రెండు చాక్లెట్లు, అందరికీ ఒక్కొక్కటి.స్కూలికి ఎవరైనా రాకపోతే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాళ్ళం.
                డిసెంబర్ 31 వ తేది రాత్రి మా ఇంట్లో అందరి భోజనాలు తొమ్మిది గంటలకల్లా అయిపోయేవి. తొమ్మిది గంటలకే ఇంటి ముందు అమ్మ ముగ్గు మొదలుపెట్టేది . అంతకు ఒక వారం ముందు రోజుల నుంచి అమ్మ ఒక పెద్ద ముగ్గు బాగా సాధన చేసి తను ముగ్గుపిండితో ముగ్గు వేస్తే వాటికి రంగులు మేము నింపేవాళ్లం. ఎవరింటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంటే అంత గొప్ప. రంగులు నింపిన తర్వాత మళ్లీ అమ్మ ఇంకోసారి చుట్టూ బయట outline వేసేది. అంత చలిలో అందరూ స్వెట్టర్లు వేసుకుని ఏ  రంగులు ఎక్కడ నింపాలి అని గొడవపడుతూ, మధ్యలో అమ్మ నేను చెప్పిన రంగే వేయాలి అంటే అక్క వినట్లేదు అని విసిగిస్తుంటే అమ్మ మా అల్లరి భరించలేక కోప్పడుతూ.. భలే సందడిగా ఉండేది. రాత్రి 10 అయితే చాలు!!దుప్పట్లో  దూరి సందడి సద్దుమణిగిపోయే  మా ఊరు  ఆ రోజు మాత్రం 12 అయితే కానీ రాత్రి అయినట్టు కాదనేది.
                ఇక ఇంట్లో సందడి చెప్పకర్లేదు. నాన్నగారు తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే స్నేహితుల కోసం ముందుగానే కేకు తెప్పించేవారు. అమ్మ చేత అందరికి ఫలాహారం చేయించేవారు. వాటిని అందరికి వడ్డించే బాధ్యత నాది, మా అక్కది. వచ్చే జనాలతో ఇల్లంతా హడావుడిగా ఉండేది.
                ఈ సందడిని గత తొమ్మిది సంవత్సరాలుగా నేను కోల్పోతున్నాను.అందుకే నా newyear resolution ఏంటంటే ఈ సంవత్సరం అనవసరంగా ఎప్పుడుపడితే అప్పుడు సెలవలు తీసుకుని ఇంటికి వెళ్లకుండా ఒకేసారి క్రిస్మస్ పండగ నుంచి కొత్తసంవత్సరం రోజు వరకు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.మీకు కూడా నా ఆలోచన నచ్చిందా?? అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ ఐడియా ఏ మాత్రం బెడిసికొట్టినా నన్ను మాత్రం బాధ్యురాలిని చేయకండి. :P
                  ఈ సంవత్సరంలోనే నేను ఈ బ్లాగును మొదలుపెట్టాను.మొదలుపెట్టినప్పటి నుంచి నా ఆశ, శ్వాస ఇదేగా కాలాన్ని గడిపేస్తున్నాను. నాకు అప్పటికప్పుడు వచ్చిన దుఃఖాన్ని,సంతోషాన్ని అన్నిటినీ నాతో పంచుకుంటూ నన్నింతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు. చాలామంది స్నేహితులని ఈ బ్లాగువల్ల కలుసుకున్నాను. నాకొక కొత్త ప్రపంచాన్ని చూపిన మీ అందరికీ ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.మరీ అత్యాశ అంటారా!!! అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Thursday, 27 December 2012

నేటి ప్రేమ-పెళ్లి

ఈ టపాలోని మాటలు కేవలం నా అభిప్రాయాలు మాత్రమే.. ఎవ్వరిని నొప్పించడానికి వ్రాసినవి కావు. ఎవ్వరూ దీనిని పర్సనల్ గా తీసుకోకూడదని మనవి. ఎవ్వరినైనా నొప్పిస్తే క్షమించాలి.
                       ఈరోజుల్లో అందరికీ మంచి చదువు, ఉద్యోగాలు ఉండటంతో చాలా మంది తమ స్వంత అభిప్రాయాలకే ఓటు వేస్తున్నారు. ఇలా సొంత అభిప్రాయం అన్నది ఎక్కువగా పెళ్లి అనే విషయంలో చూపిస్తున్నారు.
                 ఈ పెళ్లి అనే విషయంలో అమ్మాయిలు అబ్బాయిలని ఎలా ఎంచుకుంటారు అంటే ఎక్కువగా వాళ్ల క్లాస్మేట్స్ అయ్యుంటారు. వాళ్లతో గౌరవంగా మాట్లాడేవారు, సౌమ్యులు అయిన వారినే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. అదే అబ్బాయిలు అయితే మొదట అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఇది నేను తప్పు అని
చెప్పను. ఎందుకంటే మొదటి చూపులోనే కంటికి కనిపించేది అందమే కాని మనసు కాదు కాబట్టి. అబ్బాయిలకి వాళ్ల క్లాసు అమ్మాయిలతో పాటు ఇంకా వాళ్ల కన్నా తక్కువ క్లాసు అమ్మాయిలని ఎంచుకునే అవకాశం ఉంటుంది.ఈ మధ్యకాలంలో కాలేజీలో చేరిన వెంటనే జూనియర్స్ కోసం సీనియర్స్ ఒక వెల్కం పార్టీ ఏర్పాటు చేస్తారు. ఇలాంటి వాటిలో ఎవరికి ఎవరు అని నిశ్చయం చేసుకుంటారు సీనియర్స్. వీటిలో కడదాకా మిగిలే బంధాలు కొన్నే ఉంటాయి. అప్పటికప్పుడు జీవితం గురించి ఎటువంటి అవగాహన, ప్రణాళికా లేకుండా వేసే మొదటి తప్పటడుగు. అన్నీ తప్పటడుగులే ఉండకపోవచ్చు.. ఏడడుగులు వేసే ప్రేమలు ఉండొచ్చు.
            అందరికి ఒక "అదర్ సైడ్" ఉంటుంది. ఇది పరిచయం మొదట్లో అంతగా బయటపడదు, కాబట్టి పరిచయంలో కొత్తగా ఇద్దరి వైపు నుంచి సర్దుకుపోయే తత్త్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. పరిచయం పెరిగిన తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి కనపడతాయి. ఇద్దరు ఎప్పుడూ వాటి గురించే గొడవ పడటం ప్రారంభమవుతుంది.  బొమ్మరిల్లు సినిమాలో లాగా ఇది వరకు మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు. ఇప్పుడు కేవలం తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు అని జెనిలియా బాధపడుతుంది. ఇద్దరి మధ్య పరిచయం పెరగడం వల్ల ఒకరి  లోపాలు ఇంకొకరికి తెలియడం వల్ల గొడవలు పెరుగుతాయా? తగ్గుతాయా?
                  ఈ మధ్యకాలంలో ప్రేమ అనే మాట అందరి నోళ్లలో నానుతోంది. కాలేజిలో ఈ ప్రేమ అనేది మొదలై అది జీవితాంతం తోడుగా ఉండే బంధంగా మారడానికి ఎన్నో అడ్డంకులు. చదువుకునేటప్పుడు దూరం తెలియకపోవడం వల్ల కొంతమంది ఉద్యోగాలు వచ్చి వేరు వేరు ఊర్లలో ఉండాల్సివస్తే ఆ ఉద్యోగం మానలేరు, అలా అని ఈ బంధాన్ని వదులుకోనూలేరు. ఇక్కడ వాళ్లు పడే మానసిక సంఘర్షణ అంత,ఇంతా కాదు. కొంతమందికి దానిని స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు సాగే మానసిక పరిణతి ఉండదు.     
                ఉద్యోగాల్లో చేరిన తర్వాత మళ్లీ కొత్త పరిచయాలు మొదలవుతాయి. ఇక అప్పుడు ఇప్పటిదాకా ఒకే కాలేజీ ప్రపంచంలో ఉన్నవాళ్లు రెండు రెండు వేర్వేరు ప్రపంచాల్లో ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది పని వల్ల ఒకరు ఇంకొకర్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని అనుకుంటారు.ఇంకొంతమంది అనుకుంటారు ఉద్యోగమే కదా ముఖ్యము ప్రేమ కన్నా అని. కాదని అనట్లేదు కానీ జీవితాంతం తోడుగా ఉండాలనుకున్న వ్యక్తితో  రోజుకు రెండు నిముషాలు కూడా ఖర్చు చేసేంత తీరిక లేకుండా ఉంటారా? అయినా అంతకు ముందు ఎన్నో నిముషాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుని ఉంటారు. ఒకరి పట్ల నిర్లక్ష్యధోరణి వహించకూడదు."take for granted" అని అనుకోవడం తగదు. పెళ్లికి ముందే ఇలాంటి ధోరణి అసలు పనికిరాదు. పెళ్లికి తర్వాత ఉండొచ్చా??అంటే అది వారి అవగాహన మీద ఆధారపడుతుంది. ప్రేమలో విఫలమైనా ఆ ఇద్దరి వ్యక్తులకి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ పెళ్లిలో విఫలమైతే అది జీవితాంతం ఒక మచ్చగా మిగిలిపోతుంది.ప్రేమ స్థానంలో నిర్లక్ష్యం కనిపిస్తుందంటే ఆ బంధం కడదాకా కొనసాగుతుందనేనా??
                     అన్ని అడ్డంకులలోకి మొదటిది, ఇద్దరిని సులభంగా వేరు చేసేది అహం(ఇగో). ఇది ఎక్కువగా ఉద్యోగం చేసే వాళ్లలో ఆడ,మగ అని తేడా లేకుండా ఉంటుంది. లోకజ్ఞానానికి అనులోమానుపాతంగా(proportional) ఈ అహం అనేది పెరుగుతుందేమో అని నా అభిప్రాయం. ఏమీ చదువుకోని ఒక పల్లెపడుచు తన మగనితో నీ చేత నేను మాటలు ఎందుకు పడాలి అని అనగలదా?? అహాన్నీ మనం అదుపు చేయలేమా? ప్రతిదానికి ఇంకొకరు మన పైనే ఆధారపడి బతుకుతున్నారు అనే భావన ఉండకూడదు. ఒకసారి ఎవరో ఒకరు సర్దుకుని మొదట రాజీకి వస్తే, ఇక జీవితాంతం తనే రాజీకొస్తారులే అని ఆలోచించకూడదు. ఏది జరిగినా అంతా నీ తప్పు వల్లే జరిగింది అంటూ ప్రతిసారీ పరనింద తగదు. అప్పుడప్పుడూ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోవాలి తప్పు మనవైపు ఉందా?లేదా? అని. ఆవేశంలో ఉన్నప్పుడు మాటలు మాట్లాడటం కన్నా మౌనం వహించడమే ఉత్తమం. మనకు ఒకరితో స్నేహమే ముఖ్యమైతే చొరవ తీసుకుని బంధం బీటలు వారకుండా చూసుకోవాలి.
                ఇద్దరూ కలిసి జీవించాలి అని అనుకున్నప్పుడు వాళ్ల కుటుంబం సహాయం లేకుండా పెళ్లి అనే
మధురఘట్టాన్ని చేరుకోవడానికి ఇప్పటి యువత సుముఖంగా లేదు. మొదట ఇక్కడ అడ్డంకి కులం. ఇప్పటికీ పల్లెటూర్లలో అగ్రకులాలవారు నిమ్నకులాలవారిని పెళ్లి చేసుకుంటే వాళ్లను వెలివేసి దూరంగా ఉంచుతారు.జీవితాంతం ఇద్దరు తోడుగా ఉండాలంటే కులమే ముఖ్యమా?ఒకవ్యక్తి తన కులంవాళ్లని పెళ్లిచేసుకుంటే తప్ప సంతోషంగా జీవించలేరా?? ఈ కట్టుబాట్లు అనేవి మనిషి మృగం రూపం దాల్చకుండా ఉండటానికి తప్ప జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడానికి కాదని  నా అభిప్రాయం. చాలామంది ఈ కులం బారినపడి విడిపోతున్నారు ఈ మధ్య కాలంలో.
                  అలా విడిపోయిన వారు జీవితాంతం తమ భాగస్వామితో ఎలాంటి అపరాధభావన లేకుండా ఉండగలరా? తరువాతి జీవితాన్ని సంతోషంగా గడపగలరా??
     

Sunday, 16 December 2012

నా ప్రేమకథ

      అసలు నువ్వు అంటే నాకెంత ఇష్టమో తెలుసా..? తన పైన ఉన్న ఇష్టాన్ని మీ అందరికి చెపుదామనే ఈ టపా..
       తన గురించి అందరు మాట్లాడుకుంటుంటే వినడమే తప్ప తనని దగ్గరగా చూసింది లేదు.. నాకు తెలిసినంత వరకు తనకు టెక్నికల్ విషయాలు బాగా తెలుసు..ఎందుకంటే అప్పుడప్పుడు తన సహాయం తీసుకున్నా కానీ అప్పటికప్పుడు తన సహాయానికి ఒక చిన్న థాంక్స్ చెప్పి నా పని నేను చూసుకుని మళ్లీ తనను అసలు చూసేదాన్నే కాదు. పరిచయం లేని కొత్తలో ఇంకొకరి ద్వారా తన నుంచి సహాయం అందేది.:)
         తను కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడుతాడేమో అని తనకి అస్సలు తెలుగు తెలియదేమో అని అనుకున్నాను.. కానీ తనకు తెలుగు కూడా తెలుసని నాకు తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపడి తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించాను, కానీ మనసులో చిన్న బెరుకు.. మొదట పొడి పొడి మాటలతో మా పరిచయం మొదలైంది. తనంటే నాకు చాలా ఇష్టం అని నాకు తెలుసు.. కానీ తనతో ఎలా చెప్పాలో తెలియని ఒక చిన్న గందరగోళం మనసులో.. కానీ తనేమో తనకి ఈ విషయమే పట్టనట్టు నాతో మాములుగానే ఉండేవాడు. కొద్దిరోజులు బానే ఉంది.. పరిచయంలో ఎలాంటి కలతలు లేవు..ప్రయాణం సాఫీగా సాగుతోందీ..
          కానీ నా మనసులో మాట చెప్పకుండా తన నుంచి తప్పించుకు తిరగలేక ఒకరోజు నేను చెప్పేసాను.. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం..ఇప్పట్నుంచి నా జీవితంలో నువ్వు కూడా ఒక భాగమేనని.. చెప్పిన వెంటనే  నా ప్రతిపాదనని ఒప్పుకోకపొయినా మరీ అంతగా నన్ను ఇబ్బంది పెట్టలేదు.. ఒక చిన్న ముద్దుపేరు పెట్టమని అడిగాడు..ఆ మాత్రానికే నేను తెగ సంబరపడి బాగా ముద్దుపేర్లు ఏముంటాయా అని చించి ఒక 10,20 పేర్లు చెపితే ఒకపేరు బావుందని అన్నాడు..హమ్మయ్యా!!సంతోషం అనుకుని ఇంక తన ప్రేమ గెలుచుకున్నందుకు ఏనుగు ఎక్కినంత సంబరపడ్డాను.
           అది మొదలు.. నాకు తెలిసిన ప్రతి విషయం తనతో చెప్పుకోవడం ఒక అలవాటు అయ్యింది.. మొదట్లో తనను రోజుకొకసారి కూడా చూడాలనిపించేది కాదు.. రాను, రానూ తనని రోజుకోక వంద సార్లు తలుచుకుంటున్నాను.. ఆఫీసులో ఎవరూ చూడకుండా తనని దొంగచాటుగా చూసేదాన్ని. తన నుంచి కూడా అలాంటి అభిమానమే కనిపించింది నాకు. ఒక్కొక్కసారి తనతో మాటల్లో మునిగితే అసలు సమయమే తెలిసేది కాదు.. అంతగా నాకు కబుర్లు చెప్తాడు..అందుకే ఎక్కువగా పని ఉన్నప్పుడు నేను తన దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా తప్పించుకు తిరుగుతాను:) మీరలా దుర్మార్గులారా అని నన్ను తిట్టేసుకోకూడదు..   తప్పదు మరి, ఇలాంటి విరహం అనుభవించాల్సిందే.. మీరే ఒప్పుకుంటారు నా మాటే సరైనదని నా మాటలు పూర్తిగా విన్న తర్వాత..:) ఇంకా తన వల్ల చాలా సార్లు ఆఫీసులో ఉండిపోవాల్సి వచ్చేది ఒక్కొక్కసారి తను చెప్పే ఊసులు వినడానికి.. తను కూడా నా మాటలన్నీ శ్రద్ధగా వినేవాడు.
తన గురించి ఒక కవిత (తవిక) మీ కోసం

నా ఏడుపుకి తను ఒక ఓదార్పు,
నా సంతోషానికి తను ఒక చిరునవ్వు,
నా భయానికి తను ఒక ధైర్యం,
నా విజయానికి తను ఒక కారణం,
నా అపజయంలో తను ఒక భరోసా..
నేనే తను.. తనే నేను...
             
                ఒక్కొక్కసారి నేను బస్సు కోసం స్టాపులో ఎదురు చూస్తున్నప్పుడు తనను పొరపాటున నా ఫోనులో పలకరిస్తే ఇంకా తన మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయేదాన్ని. అలా తనతో మాట్లాడుతూ ఒక్కొక్కసారి మూడుగంటల పైనే గడిపేసిన క్షణాలు ఉన్నాయి. తనతో రాత్రంతా కబుర్లు చెప్తూ ఆఫీసులో కునికిపాట్లు తీసిన సందర్భాలెన్నో..ఒక్కొక్కసారి దారిలో నడిచేటప్పుడు తన చెప్పిన ఒక అభినందనకరమైన ప్రశంసను ఫోనులో చూసుకుంటూ మురిసిపోయి ఏమరపాటుగా  ఏ వాహనానికో అడ్డుగా పోయి చివాట్లు పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా తనని వదిలిపెట్టలేనంతగా తనకి నేను అలవాటు పడిపోయాను. తన వల్ల నాకు ఇంకా మంచి మంచి స్నేహితులు దొరికారు. నాకంటూ ఉన్న ప్రపంచం నుంచి నాలో మరుగునపడిపోతున్న ఒక గొప్ప లక్షణాన్ని బయటికి తీసి నాకు నన్నే కొత్తగా పరిచయం చేశాడు. తన పరిచయం, తనతో పాటు వచ్చిన కొత్తప్రపంచం నాకు కొత్తగా, హాయిగా, సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు తన వ్యసనం నుంచి బయటపడాలని అనుకుంటున్నా కూడా.. అలా తన ప్రేమని వదిలి ఉండలేకపోతున్నాను. తను నా జీవితంలో భాగంగానే నాతో పాటు జీవన ప్రయాణం చేస్తున్నాడు. ఇంత  చెప్పిన తర్వాత మీకు తనని పరిచయం చేయకపోతే మీరు నన్ను తిట్టేసుకుంటారు.. నాకు తెలుసండి.. ఇంతగా నను మురిపించింది ఇంకెవరు?? ఇదే నా ప్రేమ (నా బ్లాగు )


Wednesday, 12 December 2012

ఈరోజు(12-12-12)

                           ఈరోజు తేదీ ఏంటో అందరికి తెలుసు, నేను కూడా ఆతృతుగా నిన్న ఉదయం 12 గంటల వరకు మేలుకుందామనుకున్నాను కానీ, బాగా అలసిపోయి తొందరగా నిద్రపోయాను. ఇందాకా మా కొలీగ్తో మాటల మధ్యలో 12-12-12 12:12 కొంచెం ప్రత్యేకం కదా.. అని అనుకున్నాం.
          మరి ఇంత ప్రత్యేకంగా ఉన్న క్షణాన ఏం చేసామో  గుర్తుంటే బావుంటుంది కదా అని ఒక ఐడియా తట్టింది.. నాకు తట్టిన ఐడియాకు మనసులో నాకు నేనే మురిసి మేఘాల్లో తేలుతూ ఇలా ఒక పోస్ట్ రాసుకుని నా గుర్తుగా ఉంచుకుంటున్నాను.. ఎందుకంటే ఇంత కన్న ఏం చేయాలో తోచలేదు మరి.. కాబట్టి నేను ఈ క్షణాన్ని ఇలా బందించేసుకుంటున్నాను అన్న మాట. విదేశాల్లో ఉన్న వాళ్లు అలా నన్ను చూసి నవ్వకూడదు, ఇది మన భారతదేశ కాలమానంలో వ్రాస్తున్నది.. సో చదివిన తర్వాత మీరు కూడా నాలాగా ఒక టపా వ్రాసుకుని ఆ క్షణాన్ని బందించుకోండీ..
          ఎందుకంటే ఇలాంటి రోజు మళ్లీ ఇప్పట్లొ వచ్చేటట్టు కనిపించట్లేదు..ఎందుకంటే 13-13-13 రావడానికి మనకో 13 నెల లేదు మరి..ఇంక 13-31 వరకు కూడా నెలలు లేవు కాబట్టి.. నాకు అలా అనిపించింది.. ఏంటో అమ్మాయి చాలా హడవుడి అంటారా..హ్హ్మ్మ్.. ఏమో ఈలోపల ప్రళయం వచ్చి అందరు దాంతోబాటు పోతే ఇంకేం చేస్తాం.. అయినా అదెలాగు జరగదంట మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం అమావాస్య కూడా ఇంక రాలేదు...సముద్రాలలో సుడిగుండాలు లాంటివి ఏర్పడే అవకాశాలు కూడా లేవని చెప్పారు..మనిషి ఆశాజీవి అంటారుగా మరి!! అలాగే నేను కూడా..ఇప్పుడప్పుడే ప్రళయం వచ్చే సూచనలు లేవని అన్నారు.. ఇదండీ సంగతి.. నీకు బాగా పిచ్చి ముదిరింది అంటారా!!! కానీయండీ..కొంతమందికి ధనం పిచ్చి,కొంతమందికి  పరువు పిచ్చి, ఇంకొంతమందికి పదవి పిచ్చి.. నీకు నీ మామ కూతురంటే పిచ్చి అని రజనీకాంత్(ఈ స్టారు పుట్టినరోజు  కూడా ఈరోజే) గారు ముత్తు సినిమాలో ఒక డైలాగు చెప్తారు:P అలాగే నా బ్లాగు పిచ్చి కూడా :D  అయినా నా పోస్ట్ పబ్లిష్ చేసిన సమయం 12:12:12 12:12:):) 

Saturday, 8 December 2012

ఆనంద హేల

            నిన్న రాత్రి పది గంటలకు అక్క ఫోన్ చేసింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పరీక్షాఫలితాలు వచ్చాయి. కొంచెం చూడు అని.. నేను సైట్ తెరిచి చూసాను ఏం పెట్టారో చూద్దాము అని.. 316 మంది హాల్ టికెట్ల నంబర్లు పెట్టారు. మాకు హాల్ టికెట్ నంబర్ తెలీదు. తనేమో ఎటూ తేల్చని నీట్ పరీక్ష వ్రాయడానికి బెంగళూరు వెళ్లింది. తన హాల్ టికెట్ ఏమో నేను నా ఆఫీస్ డెస్క్టాపు మీద సేవ్ చేసాను. ఇంక చేసేదేమీలేక రాత్రి అలాగే నిద్రపోయాను. ఉదయాన్నే లేవగానే తను ఫోన్ చేసింది. ఆఫీసుకు వెళ్ళావా అని.. నేను అప్పుడే కళ్లు నలుపుకుంటూ ఇప్పుడే లేచాను అని బద్ధకంగా చెప్పాను.
           ఫలితాలు వచ్చాయి కదా అని గుర్తు చేసింది. నాకు కూడా గుర్తుంది కానీ ప్రభుత్వఉద్యోగం అంటే ఎలాంటి అవకతవకలు లేకుండా జరిగి నిజంగా మెరిట్ చూపించిన వాళ్లకే ఇస్తారనే నమ్మకం నాకు లేకపోవడంతో నేను వెంటనే తొందరపడి చూడాలని అనుకోలేదు.ఈ వైద్యశాఖలో చాలా అవకతవకలు, మోసాలు జరుగుతాయని నాకు తెలుసు. దాని వల్ల ఎంతమంది విద్యార్థులు తమ జీవితాలను నష్టపోతున్నారో కూడా తెలుసు. ఎందుకంటే అక్క కూడా వాటి వల్ల నష్టపోయింది కాబట్టి. వాటి గురించి ఒక టపా వేద్దామనుకున్నాను కానీ మనం ఎంత గొంతు చించుకున్నా అవి పాలకుల చెవులకి ఎప్పటికీ వినిపించవు. హ్మ్మ్ ఇలా ఇన్ని ఆలోచనలు బుర్రలోకి వచ్చి ఇప్పుడు చూడటం అవసరమా అని అనిపించింది.
                 ఇంతలోపు ఇంకొకసారి తన నుంచి ఫోన్ "పోనీ, అమ్మని అడుగుదాము..తను చెప్తుంది కదా హాల్ టికెట్ నంబరు అని..". నేను వద్దు..ఇప్పుడు అంత హడావుడి ఏం చేయకు. నేనే ఆఫీస్ వెళ్లి చూస్తాను.ఒకవేళ రాకపోతే అమ్మవాళ్లు బాధపడతారు అని ఆఫీస్ కు వచ్చి చూసాను ఏమాత్రం తనకు ఉద్యోగం వచ్చిఉంటుంది అనే ఆశ లేకుండా.. హుర్రే!!! తనకి ఉద్యోగo  వచ్చింది.. తనకి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. ఇంక ఎక్కడో మెరిట్ మీదే ప్రభుత్వఉద్యోగాలు ఇస్తున్నారు  అని ఆనందపడిపోతున్నాను.
                     నిజంగా నా జీవితంలో ఇదొక సంతోషకరమైనవార్త. తనలో తాను బాధపడుతున్న అక్కకు ఒక పెద్ద ఊరట. తను పడ్డ శ్రమకు దొరికిన ఫలితం.ఈ ఆనంద హేల మీ అందరితో పంచుకోవాలని ఇలా వచ్చాను.. మా తరుపున మీకు కమ్మని పాయసం ఇదిగో...
                           

Wednesday, 5 December 2012

సి(చి)ల్లీ సంఘటన

                              సుజిత, సంకేత్ ఇద్దరూ భార్యభర్తలు. మధ్యతరగతి జీవితాలను అనుభవించి హైకులు,  ప్రమోషన్లతో  తమ కోర్కెల చిట్టాను నెరవేర్చుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఒక సగటు రైతు వర్షం కోసం ఆకాశం వైపు చూసినట్టు వీళ్లు కూడా అంతే ధైన్యంగా బతుకులు రెండు డెస్క్టాపులు, రెండు లాప్టాప్లతో వెళ్లదీస్తున్నారు. ఇంత కన్నా ఎక్కువగా సాఫ్ట్వేర్ జీవితాల్లో మీరు ఆశించకూడదు. నేను చెప్పకూడదు. :D :D 
                          పెళ్ళైనకొత్తలో ఒక పాట పాడు అని అడిగినందుకు సంకేత్ కు సుజిత సిగ్గుపడుతూ తల ఒంచుకుని "మరీ...మరీ.." అని నసుగుతున్న సుజిత వైపు eye మూలగా చూస్తూ "ఏం!పర్లేదు రా..నువ్వు ఏదైనా పాడు.."  "సంకీ..I dont have battery in my ipod.." సంకేత్ వైపు నుంచి ఏ సమాధానం లేకపోవడంతో తలెత్తి "రేపట్నుంచి నీ కోసం charge చేసి పెడతాను. నీకు ఏ పాటలు ఇష్టమో చెబితే అవి డౌన్లోడ్ చేస్తాను" అని ఇచ్చిన సమాధానం బుర్ర తిరిగిపోయేటట్టు చేసింది. అదేమీ బయటపడనీయకుండా "అబ్బే..అదేం లేదు..సరదాగా అడిగాను" అని ఒక వెర్రి నవ్వు నవ్వాడు. మనసులో దేవుడా.. జానకిలా పాటలు పాడే అమ్మాయిని ఇవ్వమంటే ఇలా పాటలు వినిపిస్తాననే ఆధునిక సంగీత గాయనిమణిని నన్ను భార్యగా అంటగడతావా??
                      ఇలా రోజులు సాగుతున్నాయి.. వాళ్లకి కూడా ఏదో తెలియని అసంతృప్తి.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఏ కోశానా అనిపించట్లేదు. అయినా అలాగే సా..గిస్తున్నారు తమ జీవన పోరాటాన్ని.. వాళ్ల జీవితంలో నుంచి ఒక చిన్న సంఘటన...
                       ఒకరోజు సుజిత ఆఫీసులో ఉండగా సుజిత చిన్న తమ్ముడు అక్కకు ఫోన్ చేసి ఒక చిన్న సహాయం చేయవా అని అడిగాడు. దానికి సుజిత "చెప్పు రా.. ఏం కావాలి" అని అడిగింది. అక్క మా కాలేజిలో ఒక ఇండస్ట్రీ కోసం resume తయారు చేసుకోమన్నారు. అది నువ్వు చేసిపెట్టవా?? హ్మ్మ్.. అలాగే లేరా!! నేను ఇంటికి వెళ్ళిన వెంటనే చేసి నీకు పంపిస్తాను. అక్కా.. సాయంత్రం 4 గంటల లోపల ఇవ్వమని చెప్పారు. అవునా!!!సరే చేసి పంపిస్తానులే!!
                    "రేయ్.. చిన్నా!! నాకు ఇక్కడి నుంచి మెయిల్స్ వెళ్ళవు కదరా.."కొంచెం ఇబ్బందేరా.. నీకు మెయిల్  చేర్చడం.."
                    అక్కా !! పోనీ బావను అడగమంటావా.. అబ్బ.. భలే గుర్తుచేసావు రా.. నేనే ఆయనకు చెప్తాలే..నేను నీకు పంపిన తర్వాత ఫోన్ చేస్తాను..
                    సుజిత బాగా అలోచించి తన స్నేహితురాలికి మెయిల్ సౌకర్యం ఉందని తెలిసి తనకి విషయం చెప్పి సహాయం చేయమంది.
                    అదేంటంటే..సుజీ నేను నీ జిమెయిల్కి అయితే పంపగలను. మళ్లీ భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా అది నీ పర్సనల్ మెయిల్ ఐడియే కాబట్టి నేను అంత ఇబ్బంది పడక్కర్లేదు అని. సుజిత సరేలే అని తన స్నేహితురాలు చెప్పింది కూడా కరెక్టే కదా అని తన మెయిల్ ఐడీకే పంపమంది. 
              సంకేత్ కు ఫోన్ చేస్తే మొదటిసారి తన కాల్ కు సమాధానం ఇవ్వలేదు. మళ్లీ ప్రయత్నించింది. సంకేత్ ఫోన్ ఎత్తి ఏంటి విషయం అని అడగ్గా ఇలా ఒక మెయిల్ పంపాలి అని చెప్పే లోపల.. ఎవరి దాన్నుంచి అని విసుగ్గా అడిగాడు. సుజిత నా దాన్నుండే.. అని ఇంకా ఏదొ వివరించే లోపల సరే..సరే.. నాకు నీ మెయిల్ ఐడీ పాస్వర్డ్ నా మొబైల్కు మెసేజ్ పెట్టు అన్ని వివరంగా అని సుజిత మాటల్ని మధ్యలోనే తుంచి అవతలి వైపు కాల్ పెట్టేశాడు.
                  సుజిత అన్ని వివరంగా సంకేత్కు మెసేజ్ చేసి అప్పటి దాకా పడిన టెన్షన్ నుంచి బయటపడదామని భోజనానికి వెళ్లింది. భోజనం చేసి వచ్చి మళ్లీ ఆఫీసు పనిలో పడింది. సాయంత్రం 4కి మీటింగ్ రిక్వెస్ట్ చూసి సమయం నాలుగు అయ్యిందని  ఒకసారి సంకేత్ ని విషయం కనుక్కుందామని మళ్లీ తనకి ఫోన్ కలిపింది. తనేమో ఫోన్ తీయట్లేదు. సరేలే అతను తన పనులతో తీరిక లేకుండా ఉన్నాడేమో అని ఇంకొక గంట వేచి చూసి ఫోన్ చేస్తే తన నుంచి ఏం సమాధానం లేదు. అరే!! ఈ మనిషికి నేనంటే ఎంత నిర్లక్ష్యం అని మనసులో అనుకుంది.రెండు సార్లు ప్రయత్నించి తన మీద ఆధారపడినందుకు తనని తనే నిందించుకుంటూ .. చీ..వెధవ జీవితం అనుకుంటూ ఈ తలనొప్పి తగ్గాలంటే ఒక కాఫీ తాగాలని కాంటీన్ వైపు అడుగులు వేసింది. స్నేహితులంతా కలిసి పిచ్చాపాటీ కబుర్లు చెప్పడంతో మళ్లీ కొంచెం మనసు తేలికపడి హాయిగా అనిపించింది.
                   కాంటీన్ నుంచి వస్తూ ఒకసారి మళ్లీ తన భర్తకు ఫోన్ కలిపింది. ఆశ్చర్యంగా ఈసారి ఫోన్ ఎత్తాడు.
ఆతురతగా పంపించారా ? నేను వివరంగా మెసేజ్ చేసాను కదా అని అడిగింది.
                   సంకేత్ కూల్ గా నాకు మెసేజ్ రాలేదు. నువ్వు ఇందాక నీ పాస్వర్డ్ ఫోనులో చెప్పలేదు కదా అని
చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ మాటకు సుజితకు కోపం తలకెక్కి బుర్ర నుంచి నోటికి అది వ్యాపించింది. కానీ అది నోటి మాటల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడింది.
                   నేను నీకు 2.30 కే మెసేజ్ పెట్టాను అని సుజిత అంది.
                   అది నాకు రాలేదు మరి అన్నాడు నిర్లక్ష్య ధోరణిలో.
                   నేను మళ్లీ పంపిస్తాను అని తనకి మెసేజ్ పెట్టి తను లిఫ్ట్ లో పైకి వెళ్లి మళ్లీ సంకేత్ కి ఫోన్ కలిపి
విషయం కనుక్కుంది.
                   ఇప్పుడు వచ్చిందిలే. జిమెయిల్ తెరిచాను.  పంపిస్తున్నాను.
                   నేను నీకు 4 సార్లు ఫోన్ చేసాను మధ్యలో పంపించావేమో కనుక్కుందామని అని సుజిత చెప్పింది.
                   నువ్వు మెయిల్ఐడీ చెప్పావు కానీ పాస్వర్డ్ చెప్పలేదు కదా!!!
                   ఇందాకా నేను పాస్వర్డ్ చెప్తానంటే మెసేజ్ పెట్టమన్నారు కదా..ఉన్న విషయం అడిగింది.
                   పెట్టినా నాకు రాలేదు అని అన్నాడు.
                   మీకు రాకపోతే నాకు మళ్లీ కాల్ చేసి అడగాల్సింది.ఇది చాలా అవసరం అని చిన్నా చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను అని అసలు కారణం వివరించింది.
                   అయినా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను అయినా ఏం చేయగలను అని విసుక్కున్నాడు.
                   ఇందాకా నేను చెప్పబోతే విసుక్కున్నారు. మెసేజ్ పెట్టమన్నారు. అయినా నేను కాల్ చేసినా మీరు తీయలేదు కొంచెం మొండిగా అదే విషయం చెప్పింది. ఇప్పుడేమో నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు అని ఆవేశంగా చెప్పింది.
                    హేయ్!! కూల్ అని వెర్రిగా అన్నాడు. ఆ గొంతులో కొంపలేమీ మునగలేదన్న అర్థం ధ్వనించింది.
                    అయినా నాకే మెయిల్ ఆక్సెస్ ఉంటే మిమ్మల్ని ఇంతలా వేడుకునేదాన్ని కాదు. ఒక రెండు నిముషాల పనే కదా అని మిమ్మల్ని అడిగాను. లేకపోతే నేనే ఇంటికి వెళ్లిన తర్వాత తీరికగా చేసుకునేదాన్ని. అయినా నేను ఫోన్ చేసినప్పుడు మీరు కొంచెమైనా శాంతంగా విన్నారా??
                    అంత ముఖ్యమైన పనే అయితే నువ్వే చేసుకోవాల్సింది.
                    సుజిత ఆశ్చర్యపోయింది అనుకోకుండా సంకేత్ విసిరిన మాటల తూటాకి...తన పట్ల తను చూపించిన నిర్లక్ష్యానికి..
                    నేనే నీ స్థానంలో ఉంటే నా పని నేను చేసుకుంటాను సుజిత, నీలాగా ఇంకొకరు చేస్తారని మాత్రం ఎదురుచూడను అని దురుసుగా సమాధానం చెప్పాడు.
                   ఇంకా మాటలు కొనసాగించడం ఇష్టం లేక సుజిత ఫోన్ పెట్టేసింది.
                  తన మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. ఇంత చిన్న విషయంలో తన సహాయం  అడగడం తప్పు అని సంకేత్ అనుకుంటున్నాడా??..నేను నా పని తనని చేయమని ఇక్కడ నిశ్చింతగా నిద్రపోతున్నానా?? అయినా resume నేనే తయారుచేశాను. దాన్ని చిన్నాకు పంపించమని అడిగినందుకు ఎందుకు నన్ను ఇంతగా విసుక్కుంటున్నాడు.తనకి ఇష్టమైన వంటలు వండి బాధ్యతగా తనకి  రోజు  నేను  పెడుతున్నా  కూడా  ఏరోజు  తను నా పైన ఆధారపడి జీవిస్తున్నాడు అని నేను అనుకోలేదు. ఈ  చిన్న  విషయానికే  తన  పైన  లేని  భారాన్ని ఊహించుకుని నా పైన ఇంతగా విసుగు చూపడం ఏంటో అని చాలా బాధపడింది.ఇంక ఇలాంటి తప్పు మళ్లీ చేయకూడదని ఒక ధృడనిర్ణయం తీసుకుంది. అంటే తనని ఏ విషయంలో సహాయం అడగకూడదు. తనని కావాల్సిన సౌకర్యాలు నేను తనకు ఇవ్వాలే తప్ప తను నాకోసం అది చేయాలి,ఇది చేయాలి అని తన నుంచి ఏమీ ఆశించకూడదు.
ఈ కథ పై నా అభిప్రాయం:
                 అమ్మాయిలకు ఆర్ధికస్వాత్యంత్రం మాత్రమే వచ్చింది. అనేక విషయాల్లో వాళ్ళు మగవారిపై ఆధారపడియున్న చదువుకున్న అబలలు అని.. అలా కాకుండా ఇంకొక కోణంలో చూస్తే ఆ అమ్మాయి విడాకులు
తీసుకోవచ్చు అంతగా సర్డుకుపోలేనప్పుడు.. అదే ముగింపు అయితే అసలు అలాంటి బంధాన్ని సుజిత తన జీవితంలోకి రానివ్వకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు తన జీవితంలో అలాంటి బంధం ఉంది కాబట్టి 
సర్దుకుపోవడమే..
 ( ఈ కథ కేవలం కల్పితం. ఎవ్వరిని ఉద్ద్యేశించి వ్రాసినది కాదు.)


                 
                 
                 
                 
                 
               
                      

Thursday, 29 November 2012

హాస్టల్ కబుర్లు-2(Doggie)

         నా ఇంటర్మీడియట్ కబుర్లు ఇంతకు ముందు ఒక టపాలో పెట్టాను. చదవనివాళ్లు  ఇక్కడ నొక్కి ఆనందించండి. వహ్వ.. నీ టపాలోనే నీ పాత టపాకు లింకు పెట్టి నీ బ్లాగ్ క్లిక్లు పెంచుదామనా??!! మీరలా అనుకోరని నాకు తెలుసుగా :P .. ఒకసారి అది కూడా చదివి దీన్ని దానికి కొనసాగింపుగా చదువుకోండి. అమ్మో!! దుర్మార్గురాలా!!! నీ కుట్ర మాకు తెలుసు.. అని మనసులో మీరసలు అనుకోవట్లేదు. అది నాకు తెలుసండి. అయినా గాయం సినిమా చూడకుండా గాయం-2 ఎలా చూస్తారు?? లాజిక్ పట్టేశారు. వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి..అసలు రెండూ చూడమంటారా!!!!.. మీకు అయితే భూత్ సినిమాని వేసి కుర్చీలో మిమ్మల్ని కదలకుండా కట్టేసి చూపించాల్సిందే.. మరి ఆర్జివి నా?మజాకా?
                           ఇంక అసలు విషయానికి వస్తే ఒక దుర్ముహుర్తమో,సుముహుర్తమో తెలియని సమయాన మా కాలేజీలోఅడుగుపెట్టాను.మొదటిరోజు మొదటి పంచ్ మా సుభాషిణి మేడం చేతిలో పడింది నాకు . ఒక చోట డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ మా అన్నయ్య వేసినందుకు "చదివేది మీరా?మీ చెల్లా?" :D అది అయిపోయిన తర్వాత  మా నాన్నగారు, వార్డెన్ ల మధ్య అప్పగింతల కార్యక్రమం యథావిధిగా నా కన్నీళ్ళతో ముగిసింది. మా వార్డెన్ అంటే ఆషామాషి వార్డెన్ కాదు. అందరిని హడలుగొట్టించే టైపు అన్నమాట. ఆమె పేరు రాజకుమారి. పేరుకు తగ్గట్టు పెళ్లి చేసుకోకుండా కుమారిగా ఉండిపోయింది. నల్లగా, 6 ఫీట్ ఉంటుంది, అరవం ఆమె(tamilian) . హాస్టల్లో నిజంగానే ఒక రాజకుమరిలా ఉన్న సదుపాయాలన్నీ ఉపయోగించుకునేది. ఈమె ముందు ఎవరూ కూర్చోకూడదు. వంగి వంగి దండాలెట్టాలి. అమ్మో!! ఇలాంటి వార్డెన్లు ఉన్నంత వరకు తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించిన కన్నవాళ్ళు సంతోషంగా నిద్రపోవచ్చు. ఈమెని వార్డెన్ అని మాత్రం అని ఎవరూ అనకూడదు. గౌరవంగా madam అని పిలవాలి.కాని ఈమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు డాగీ(doggie). ఎందుకంటే ఉదయాన్నే మేము కాలేజీకి వెళ్ళే ముందు, వచ్చే ముందు మా గేటు దగ్గర కుర్చీ వేసుకుని నిజమైన గ్రామ సింహంలా కాపలా కాసి ఆమెకు పెట్టిన పేరు సార్థకత చేసుకునేది.ఎవరైనా ఆలస్యంగా రావాలి, వాళ్ళను ఆ వాకిట్లోనే కంటనీరు పెట్టించేసి తెగ భయపేట్టేది. మా హాస్టల్లో ఉన్నన్ని నియమాలు(rules) ఇంకెక్కడా ఉండవు. ఈ కాలంలో కూడా మొబైల్ వాడటానికి అక్కడ అనుమతి ఉండదు. ఎవరూ కూడా డెస్క్టాపులు, లాప్టాప్లు ఉపయోగించడానికి వీల్లేదు. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా కళాశాల ఆవరణం మొత్తం wi-fi సౌలభ్యం ఉంటుంది. హాస్టల్ పిల్లలకు మాత్రం సదుపాయం ఉండి ఉపయోగించలేని నిస్సహాయత :((. 
               మాకు ఒక 5 పాడుబడ్డ ప్రాచీనకాలం నాటి కంప్యూటర్లు ఉండేవి,అవి హాస్టల్ యాజమాన్యం పెట్టినవి. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. కేవలం మేము programmes చేసుకోవడానికి కావాల్సిన software మాత్రం install చేయబడి ఉంటాయి. అది కూడా ఉచితంగా వాడుకోవడానికి లేదు. గంటకి 10 రూపాయలు. ఇంకా మా హాస్టల్లో వారానికొకసారి విధిగా బయటికి పంపే ఆచారాలు లేవు. మరి ఇంక ఆ పని జరగకపోతే చచ్చిపోతాము అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఒక గంట బయటకు వెళ్లి రావడానికి అనుమతించేది. మళ్లీ బయటకు వెళ్ళే ముందు వెళ్తాము అని, వెళ్లి వచ్చిన తర్వాత వచ్చేశామని చెప్పాలి. చెప్పలేదో.. అంతే సంగతులు.
                     ఇంకొక విచిత్రమైన నియమం ఏమంటే మేము ఏదైనా పెళ్లి అని అనుమతి తీసుకుంటే అప్పుడు మేము వెళ్తున్న పెళ్లి కార్డుతో పాటు ఒక లెటర్ వ్రాసి మా ఫైలులో పెట్టాలి. :) :). ఇంకా చెప్పాలంటే మాకొక టీవీ మాత్రం ఉండేది. దానికొక DTH కనెక్షన్. మా వార్డెన్ చూసేటప్పుడు ఎవరూ ధైర్యం చేసి చూసేవాళ్ళు కాదు. రోజు రాత్రి 10 వరకే చూడాలి. రాత్రి 10 తర్వాత ఎవరైనా చూసారో తోలు వలిచేది. 10 తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళుండాలి. అలా కాదని ఎవరైనా ఇంకొకరి రూంలో ఉంటే "పక్కన నిద్రపోయిన జనాలని చూపించి, వాళ్లకి మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత ఇబ్బంది " అని వాళ్ళు మేలుకోనేంత వరకు క్లాసు పీకేది. పది తర్వాత పక్క వాళ్ళ గదుల్లో ఉంటేనే ఓర్చుకోలేనిది ఇంకా 12 గంటలకి ఎవరి పుట్టినరోజులైనా చేయాలంటే ఇంకెన్ని తిప్పలో మాకు.
                       మాకు రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక రెండు రూపాయిబిళ్లల ఫోన్లు ఉండేవి. ఒక ల్యాండ్ ఫోన్కి, ఆమె గదిలో ఉన్న ఫోన్ కి కనెక్షన్ ఉండేది. అందుకని చాలా వరకు మేమంతా దాంట్లో చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. కుక్క బారిన పడితే కనీసం కొరికి వదిలేస్తుంది. దీనికి దొరికామో నానా బీభత్సం చేస్తుంది. మళ్లీ ఈమెకు కాలేజీ లో కొంతమంది గూడాచారులు ఉండేవాళ్లు. ఒక హాస్టల్ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినట్టు తెలిస్తే చాలు, తన స్టైల్లో మాటలతో కరిచి  %^%^&&#@ జీవితం మీద విరక్తి కలిగించేది. ఒకలాంటి అరవపు తెలుగు మాటలతో పిచ్చెక్కించేది. ఈమె అందరితో మాట్లాడదు. డబ్బు,దర్పం ప్రదర్శించే జనాలనే ఈ doggie పలకరించేది. ఇది అందరిని సమానంగా కరిచే doggie కాదు. ఒక అమ్మాయి హోదాని బట్టి ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ,తక్కువ సమానంగా చూసేది.ఈమెకు,నాకు జీవిత కాలానికి సరిపడా శత్రుత్వం ఉంది. దాన్ని ఇంకొక టపాలో వివరిస్తాను. 

Sunday, 25 November 2012

నాకీ జ్వరం వద్దు

                   గత సోమవారం రాత్రి నా స్నేహితురాలు పిలిచింది. తనతో మాట్లాడతూ బాగా అలసిపోయి ఉన్నందువల్ల లైట్ తీయకుండానే నిద్రపోయాను. రాత్రంతా సరిగా నిద్రపోలేదు. ఏదో తెలియని కల నన్ను మెలుకువలోకి తెస్తూ, దాన్నుంచి బయటపడి మళ్లీ నిద్రలోకి జారుకుంటూ ఉన్నాను. చాలా సార్లు మెలుకువ రావడం వల్ల నాకు తెలియకుండానే నేను ఎక్కువసేపు నిద్రపోయానేమోనని ఒక ఆందోళన మనసులో. ఇంత గందరగోళం మధ్య ఉదయం 7 గంటలకు లేచి ఓపిక చేసుకుని లైట్ కట్టేసి కాసేపు నిద్రపోయాను. ఇంత కలత నిద్ర పోయేసరికి నాకు జ్వరం వచ్చేసింది :((.
                ఈ మధ్య మా ఆఫీసు వాళ్ళు రవాణా విషయంలో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. మేము క్యాబ్ ముందుగానే రిజర్వు చేసుకుని కూడా ఆరోజు దాంట్లో వెళ్ళకపోతే నేరుగా మా మేనేజర్ గారికి ఒక మెయిల్ పంపుతారు. దానికి తగిన వివరణ ఇవ్వాలి తర్వాత. ఇదంతా ఒక కష్టతరమైన పని అని నేను దాదాపు మా ఆఫీసు రవాణాని ఉపయోగించుకోను. గోటితో పోయేదానికి కొరివి దాక తెచ్చుకోవడం ఎందుకు.?? నా దరిద్రం నా వెంటపడి నేను ఆరోజే క్యాబ్ రిజర్వు చేసుకున్నాను. నేనే దాని గురించి ఎక్కువ బుర్ర పాడు చేసుకుని ఒంట్లో ఓపిక లేకపోయినా వెళ్దామని బయలుదేరాను. అసలే  నాకు ఇలాంటి విషయాల్లో చాలా భయం. క్యాబ్ వచ్చే ఒక 20 నిముషాల ముందే నుంచే స్టాపులో ఉంటాను. ఆరోజు కూడా యథావిదిగా అలాగే వెళ్లాను. నిలబడటానికి ఒంట్లో ఓపిక లేదు. ఇంక ఒక రెస్టారెంట్ మెట్ల పైన కూర్చొని సరిగ్గా క్యాబ్ వచ్చే 5 నిముషాల ముందు లేచి స్టాప్ దగ్గర నిలబడ్డాను. ఈలోపు ఒక ఆటోవాడు వెనక్కి తన ఆటోని నా కాలి మీదగా నెట్టాడు. నిజంగా నాకు ఈ జ్వరం వద్దు!! ఆఫీస్ అంత కంటే వద్దని అనిపించింది. ఆ నొప్పికి కంట్లో నుంచి కన్నీళ్లు. 
             ఆఫీస్లో మందులు అడిగి తీసుకుని పైకి వెళ్లి పుచ్చకాయ ఒక ప్లేట్ తీసుకుని తిందామని ముందు పెట్టుకుంటే తినబుద్ది కావట్లేదు. చుట్టూ ఉన్నవాళ్ళను అందరిని చూస్తున్నా "ఒక్కళ్ళు కూడా నేను ఎందుకు తినట్లేదు, తిను " అని చెప్పట్లేదు. చెప్పలేనంత దుఃఖం. నేను ఇలా జ్వరంతో ఉంటే ఇంట్లో ఎంతగా ముద్దు చేసి చూసుకునేవాళ్ళు అని వస్తున్నకన్నీళ్లను బలవంతంగ ఆపుకుని తిని మందులు వేసుకున్నాను. సీట్ దగ్గరకు వెళ్లి మేనేజర్ని అనుమతి అడిగి వెళ్ళిపోదామని అనుకుంటే.. ఆయన ఒక గంట వరకు మీటింగ్లో ఉంటారని తెలిసింది. నా కంప్యూటర్ ముందు కూర్చుని ఆ ఒక్క గంట ఎప్పుడెప్పుడవుతుందా అని చూస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని నేను ఇప్పుడు వెళ్తాను అని అనుమతి అడిగితే, నీ మేనేజర్ ఇప్పుడు నేను కాదు, ఈరోజే మారారు. నువ్వు కొత్త మేనేజర్ ని అడుగు అని చెప్పారు. చాలా భాధగా అనిపించింది. అసలు ఓపికలేక,కూర్చోలేక..అలా అని నిద్రపోలేక నానా అవస్థలు పడుతుంటే ఇదొకటా? అని నా కంప్యూటర్ ని చూస్తూ ఎవరికీ కనిపించకుండా బాగా ఏడ్చేసి కొత్త మేనేజర్ స్టేటస్ చుస్తే అయానేమో offline. సరే అని లేని ఓపిక తెచ్చుకుని ఇంకొక గంట కూర్చున్న తర్వాత ఇంక నా ఒంట్లోని ఓపిక అంత అయిపోయేసరికి ఒక మెయిల్ పెట్టేసి బయలుదేరాను. ఒకపక్క జ్వరం బాధిస్తుంటే అరే!! ఎందుకు ఒకరి బాధని అసలు అర్థం చేసుకోరు అని బాధపడుతూ హాస్టల్ కి వచ్చేసాను. ఇంక వచ్చిన వెంటనే అక్క నుంచి ఫోన్, ఏమైంది? ఎలా ఉంది?అని ఒకపక్క నీరసం గొంతులో తెలుస్తుంటే, మనసులో వాళ్లతో లేనని బాధ కలిసి అసలు మాటలే రావట్లేదు. బలవంతంగా బావున్నాను అని బావురుమన్నాను. అయితే నేను ఈరోజు నీ దగ్గరికి బయలుదేరుతాను. నువ్వు బాధపడకు అని అంది. ఇంకా తను చూపించే ప్రేమకు నేను ఎక్కువ ఏడుస్తానని తన కాల్ మధ్యలోనే కట్ చేసి ఒక పది నిముషాల తర్వాత మళ్లీ నేనే తనకి ఫోన్ చేసి "ఏం వద్దు! నేను ఇప్పుడు పడుకుంటాను. సాయంత్రం మళ్లీ  చెప్తాను తగ్గకపోతే" అని చెప్పాను.  
                     మధ్యాహ్నం కూడా ఏమి తినకపోవడంవల్ల మళ్లీ పడుకుని లేచే సరికి నీరసం. మనం ఇంత నీరసంగ ఉంటే ఎవరైనా పట్టించుకుంటారా?? అంటే ఎవరి పనులతో వాళ్ళు తీరిక లేకుండా ఉన్నారు. ఒక పక్క నీరసం, ఒక పక్క బాధ, ఏడుపు నేను ఒంటరిగా జ్వరంతో ఉన్నానని. మరి ఏం తినకపోతే నీరసం వస్తుందని లేచి వెళ్లి హోటల్లో రెండు ఇడ్లీలు తీసుకుంటే ఒక్కటి తినడానికి చాలా కష్టపడ్డాను. గదికొచ్చి నిద్రపోదామనుకుని అనుకుంటుండగా అమ్మ నుంచి ఫోన్,
                  "ఎలా ఉంది ఇప్పుడు?"
                  "బానే ఉంది మా.."
                  "తిన్నావా?"
                  "మ్మ్..తిన్నాను మా"
                  "ఏం తిన్నావ్?"
                  "ఇడ్లీ "
                  " ఎన్ని తిన్నావ్?"
                  "రెండు " ( అబద్దం చెప్పాను.. అమ్మ బాధపడుతుందని)
                  "ఎన్ని తీసుకున్నావ్?"
                  "రెండు తీసుకున్నాను..రెండు తినేసాను మా.."(నమ్మించడానికి)
                  "allout పెట్టావా?"
                  "మ్మ్ "
                  " స్వెట్టర్ వేసుకున్నావా?"
                  "మ్మ్"
                  "మఫ్ఫ్లర్(తలకు చుట్టుకునేది) కట్టుకున్నావా?"
                  "లేదు మా, నా దగ్గర లేదుగా"
                  "ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లమంటే నువ్వు పట్టించుకోవు"
                  "మా..నా స్వెట్టర్కి క్యాప్ ఉంది."
                  "సరే.. అయినా చెవిలో దూది పెట్టుకో..చల్లగాలి దూరకుండా"
                  "నీళ్లు తెచ్చుకున్నావా? రాత్రి దాహమేస్తే కష్టమవుతుంది."
                  "తెచ్చుకున్నాను."
                  "సరే మరి.. మందు వేసుకున్నావ్ గా.."
                  "ఆ అమ్మా.. "
                  "వెంటనే తగ్గిపోతుందిలే.. నువ్వు బాగా నిద్రపో.."
                  "ఊ అమ్మా..ఉంటాను"
                  "మళ్లీ రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను.."
            నా కంటి నుంచి ధారగా కన్నీళ్ళు.. అమ్మ నువ్వు కావాలి అని.. అలా అని తనతో చెప్పి తనని బాధపెట్టలేను. అమ్మకి దగ్గరగా నేను లేకపోయినా తన ప్రేమ ఎప్పుడూ నన్ను ఎంతటి బాధ నుంచైనా కాపాడుతుంది. తనకి నేను బానే ఉన్నానని, ఉంటానని చెప్పాను. సో అలాగే ఉండాలి అని నిద్రపోయాను. అయినా ఇంత చిన్న జ్వరానికే ఇంతలా డీలా పడిపోతే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వస్తే నిజంగా తట్టుకోలేవా ? అని నా బుద్ధి నా మనసుని అడిగింది.
              నా మనసు నువ్వు ఎన్నైనా చెప్పు..జ్వరం వస్తే అమ్మ,నాన్న కావాలి..( ఇంకా చెప్పాలంటే కృష్ణవంశీ సినిమాల్లో ఉన్నంతమంది నా చుట్టూ ఉన్నప్పుడు)...వాళ్ళతో ఉన్నప్పుడు ఏది వచ్చిన నేను తట్టుకుంటాను అని బుద్ధికి బాగా గడ్డి పెట్టింది. :) ఇంకొక చిలిపి ఊహ ఏంటంటే ఇప్పుడు మా అమ్మ ప్రేమను నేను ఎంతగా పొందుతున్నానో.. నాకు పిల్లలు పుట్టిన తరువాత.. "ఆమ్మా.. దాస్తావెందుకు అని.." (krack cream) ప్రకటనలోలాగా నేను చెప్పకుండానే వాళ్లే వచ్చి నాకు cream రాయాలి. ఏంటి?? అదోలా చూస్తున్నారు.. అంటే ఎప్పుడూ నేను సేవ చేయించుకోవడమేనా?? నేను చేసేదుందా!!! అనా!!! :D :D 

     
               
                   

Friday, 23 November 2012

హేమంత ఋతువు


ఈ నిశి రాతిరి వేళలో
అమ్మ వెచ్చని ఆత్మీయస్పర్శపు ఆలింగనంలో,
నాన్న ప్రేమానురాగాల తీయని కౌగిలింతతో మురిసిపోతూ..
అలసిపోయి,ఆదమరచి నిదురించిన  నా కనుపాప
ఇలాంటి హేమదృతువు మళ్లి మళ్ళి నా కోసమే రావాలని..
మురిసిన నా మురిపెం కలలా కరిగిపోయి,
ఈ క్షణం వాటిని ఆనాటి స్మృతులని చూపిస్తూ..
ఆ గతస్మృతుల ఒడిలోకి జారువాలకుండ,
నిస్సహాయంగ విడిచిన నా నిట్టూర్పుల వేడినే
హేమదృతు రక్షణగా మిగిల్చిన కాలమా!!
నా కంటి కనుపాప నిదురపోకుండా జార్చిన అశ్రువు సాక్షిగా
నీ ఉనికి నేనెరుగని చోటుకి...
హేమమా!! మరళి పో!!!

Monday, 19 November 2012

అన్నయ్యలు-పరీక్షలు

         నాకు అంతగా ఊహ తెలియనపుడే మా అన్నయ్యవాళ్లు ఏడవ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాశారు. ఆ కథలు మా అమ్మ చెప్పగా ఇప్పుడు గుర్తున్నాయి. ప్రతి రోజు వీళ్లు వ్రాసే పరీక్ష పేపరు లీక్ అయ్యిందని ఈనాడులో వచ్చేవంటా. అయినా కూడా అప్పుడు ఎవ్వరూ దాన్ని పట్టించుకుకోకపోవడంలో వీళ్లకి అవే పేపర్లతో పరీక్షలు జరిగిపోయాయంట. ఇంతగా లీక్ అయిన పేపర్లలో కూడా మ అన్నయ్య వాళ్లు బాగా చించి ఒకరు 65%, ఇంకొకరు 75% మార్కులు తెచ్చుకుని కాలర్లు ఎగరేసుకున్నారు. ఈ మార్కులు కూడా మా అమ్మ ఈనాడు పేపరులో ఉన్న ప్రశ్నలు చూసి వాటికి సమాధానాలు నేర్పించి పంపిస్తే వచ్చినవి. లేదంటే మా అన్నయ్యలకి అవి కూడా వచ్చేవి కాదనుకోండీ. :-o
question paper తెలిసినా కూడా ఇదే  expression!!
                
        అయినా వాళ్ల ప్రిపరేషన్ మాత్రం ఆహో, ఓహో లెవల్లో ఉండేది. వీళ్లు మొదటి నుంచి వాళ్ల స్కూల్లోనే నిద్రపోయేవారు. పరీక్షలు ఉన్న రోజుల్లో మాత్రమే కాదు, పరీక్షలు ఉన్నా, లేకపోయినా ఈ జీవులకి మాత్రం పవళింపుసేవ అక్కడే జరిగేది. పాపం పిల్లలు ఇంతగా కష్టపడుతున్నారని ఇంట్లో అందరు ఒక పిచ్చి భ్రమలో ఉండేవాళ్లు. వీళ్ళు స్కూల్లో పడుకోవడం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువ కనిపించి మా ఇంట్లో కూడా ఏమనేవారు కాదు. వాళ్లు ఇచ్చే buildup అలాంటిది మరి.
                తర్వాత మా అన్నయ్యలు చెప్పగా తెలిసిన విషయమేంటంటే, వీళ్ళ స్కూల్లో ఆ కాలానికే ఒక కంప్యూటర్ ఉండేది. వీళ్లకి క్వశ్చన్ పేపర్లు దాన్ని నుంచి ప్రింట్ తీసేవారంట. వీళ్లు సందు దొరికితే దూరిపోయే రకం. అందుకనే వాళ్ల మేనేజ్మెంట్ కూడా ఈ కంప్యూటర్ రూంలోకి ఎవరూ దూరకుండా తాళంచెవి వాళ్ల క్లర్క్ కి ఇచ్చి జాగ్రత్త చేయమని చేసేది. అయినా పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాల అవతల ఒంటి స్తంభంలోని చిలుకలో ఉన్నట్టు మనకు తెలియనంత వరకే కథ రసవత్తరంగా ఉంటుంది. తెలిసిన తర్వాతేముందండి? అంతే!! మన తోట రాముడు దాన్ని సంపాదించడం, మాంత్రికుని సంహారం, తోటరాముడి, ఇందుమతిల కల్యాణం. ఇలా మా తోటరాముళ్లకు కూడా వాళ్ల question papers ఉన్న గది తాళం చెవి క్లర్క్ ప్యాంటు జేబులో ఉంటాయని తెలిసిన తర్వాత వీళ్లు పరీక్షకి ఇంకా ఎక్కువ సమయం చదువుకునే వారు. మరి క్లర్క్ నిద్రపోవాలి కదా వీళ్ల పథకం పండాలంటే. ఆయన నిద్రపోయాడని బాగా confirm చేసుకుని ఆయన గదిలోకి వెళ్లి చడీ చప్పుడూ లేకుండా ఆ తాళాలు తీసుకుని వెళ్లి ఆ కంప్యూటర్ గది తెరిచి అందులో printouts తీసిన కార్బన్ కాగితం మీద ఉన్న అక్షరాలని బట్టి అవి ఏ ప్రశ్నలో తెలుసుకుని ఎక్కడివక్కడే సర్దేసి మళ్లీ యథాస్థానంలో పెట్టేసి గప్ చుప్ సాంబార్ బుడ్డీ!!
                   ఇంకా ఉదయాన్నే వాళ్ల claasmate ఒక అమ్మాయి వచ్చేది ఇంటికి వీళ్లు స్కూల్ నుంచి రాగానే, "ఏమైనా ప్రశ్నలు తెలుసా"? అని. అసలే మా అన్నయ్య వాళ్లు మహా తెలివిమంతులు. "కొన్నే తెలుసమ్మా!!" అని కొన్ని ప్రశ్నలే చెప్పి పంపించేవాళ్లు. ఎందుకలా అంటే వీళ్లకంటే ఆ అమ్మాయికు ఎక్కువ మార్కులు రాకూడదని.
                  వీళ్లకు question paper ముందు రోజే తెలిసినా వీళ్లు అవి కొన్నైనా చదివి చించుతారా?? అంటే 
ఉహూ!! వీళ్లు పరీక్షకి వెళ్లి ఆన్సర్ పేపర్లో కొన్నిటికి మాత్రమే సమాధానం వ్రాసి మిగిలిన వాటికి ఏ ప్రశ్నకి ఎంత 
స్పేస్ వదలాలో అంత వదిలేసి వచ్చేవారంట. మళ్లీ రాత్రికి ఆ answer papers ఉన్న గది తాళాలు  తీసుకుని,  అది తెరిచి అవి పుస్తకాలు చూసి వ్రాసేవారంట. ఇది మా అన్నయ్యల బద్ధకం. పరీక్షరోజుల్లో  మాత్రమే స్కూల్ దగ్గర పడుకుంటే పాపం వాళ్లపైన అనుమానం వస్తుందని ఇలా కష్టపడి చదివినట్టు నటించి పరీక్షల్ని బాగా చూసి వ్రాసి 
మా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మాత్రం.. బాగా కష్టపడిపోతున్నారు అనే ఇమేజ్ సంపాదించారు. వీళ్లు చేసిన సాహసకృత్యాలు తెలిసి ఇంట్లో బాగా నవ్వుకునేవాళ్లం.ఇవన్నీ వాళ్లకి ఉద్యోగాలొచ్చిన తర్వాతే బయటపడ్డాయనుకోండీ..
p.s: దీన్ని నేను ఇంకొకరు కూడా ఇలాగే చేసి తప్పుడు మార్గంలో నడవమని మాత్రం చెప్పట్లేదు. 
  

Thursday, 15 November 2012

బరువైన ఙ్ఞాపకం

               నేను హైదరాబాదులో ఒక సంస్థలో ప్రాజెక్టు చేసుకుంటున్న రోజులు. మా అక్క తన post graduation  కోసం బాగా కష్టపడి చదువుతోంది. ఇంక తన కష్టానికి పరీక్ష పెట్టే రోజు దగ్గరైంది. మా అన్నయ్య పరీక్ష రోజున ఏదో ముఖ్యమైన పని ఉండి వేరే ఊరు వెళ్ళవలిసి వచ్చింది. తను మాతో పాటే ఉండుంటే ఇంత బరువైన ఙ్ఞాపకం మాకు మిగిలి ఉండేది కాదు.
               మా అక్కకు పరీక్షలంటే చాలా భయం. తనకు అంతకు ముందు రోజు అస్సలు నిద్ర పట్టదు. ప్రతి సారీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ విషయంలో మాత్రం తను ఏం చేయలేకపోతుంది. పరీక్ష రోజు  ఉదయాన్నే లేచి పూజ చేసి ఇద్దరికీ ఫలాహారం చేసి 10 గంటలకి పరీక్ష మొదలవుతుందంటే ఇంటి నుంచి 7 గంటలకే బయల్దేరేలాగా ప్లాన్ చేసుకున్నాం. మేము బయల్దేరే లోపల మా పనిమనిషి వచ్చింది. తన పని అయ్యేంత వరకు ఆగేంత సమయం మాకు లేదు. మేము తనకి పని చేసి ఇంటి తాళాలు ఓనర్ వాళ్ళ ఇంట్లో ఇవ్వమని చెప్తే, వాళ్ళు పెళ్ళికి వెళుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం 2 పైనే అవుతుంది. మరి మీరు ఎన్నింటికి వస్తారని అడిగింది. మేము వచ్చేసరికి  కూడా అదే టైం అవుతుంది అని చెప్తే, తను మీరు వచ్చే సమయానికి వాళ్ళు రాకపోతే అనవసరంగా మీరు బయట ఉండాల్సి వస్తుంది అని లేని పోనీ అనుమానం రేపింది . ఇంకేం చేయాలో తెలియక సరేలే  ఆంటీ, మీరు పని అయిన తర్వాత తాళాలు కిటికీ తలుపులో పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాము.
                 మేము 8.45 కంతా పరీక్షా హాలు దగ్గరకి వెళ్ళిపోయాము. మా అక్క 9.15కి లోపలికి  వెళ్ళిపోయింది. నేను బయట ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక అలా రోడ్డు మీదకి వెళ్లి ఈనాడు పేపర్ తీసుకుని వచ్చి దాన్ని నములుతూ ఎప్పుడెప్పుడు ఒంటి గంట అవుతుందా అని అనుకుంటున్నాను. అలా అనుకున్నా అయ్యో! అక్క లోపల exam వ్రాస్తోంది కదా!! తొందరగా గడవకూడదు.. తను అన్ని నిదానంగా అలోచించి జవాబులు వ్రాసేంత వరకు టైం అవ్వకుడదని వెంటనే అనుకున్నాను. ఏంటో చాదస్తం కదా!!! మొత్తానికి తను వచ్చేసింది 1 గంటకి బయటికి. exam ఏంటో? ఎలా వ్రాసానో ? అర్థం అవ్వట్లేదు అని. నేను ఇంక వదిలేయ్! వచ్చే result ఎలాగు వస్తుంది. ఈలోపు మనం టెన్షన్ పడినంత మాత్రాన ఏం జరగదు అని నాకు తోచిన మాటలు చెప్పి బయటికి నడిచాము. మా అక్క స్నేహితులు వస్తే వాళ్ళని పలకరించి ఇంక ఇంటికి వెళ్లి మళ్లీ భోజనానికి ఏం వండుతాములే..ఇప్పటికే బాగా అలసిపోయామనుకుని బయటే చికెన్ బిరియానీ, ఒక 1 లీటర్ పెప్సీ బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్లి తిని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని బయలుదేరాము ఇంటికి.
                    అసలే ఎండాకాలం. మంచి మిట్ట మద్యాహ్నం .ఇంటికి వచ్చేసరికి 2.30 అయ్యింది. కిటికీ తలుపులో తాళంచెవి  వుంది కదా అని చేయి పెడితే అక్కడ తాళంచెవి కనిపించలేదు. కింద ఓనర్స్ కూడా వచ్చేసినట్టున్నారు వాళ్లతో ఏమైనా ఉన్నాయేమో అని అడిగితే అక్కడ కూడా లేవు. పోనీ ఆంటీ కింద షాప్ లో ఏమైనా ఇచ్చారేమో అని అడిగితే ఉహూ ..అక్కడ కూడా ఇవ్వలేదంట . అప్పటికే అంత ఎండలో వచ్చేసరికి మాకు గొంతు తడారిపోయింది. ఇంక ఏం చేయాలో తెలియకపోతే ఓనర్ అంకుల్ వాళ్ళ డ్రైవర్ని  పని మనిషి వాళ్ళింటికి పంపించి ఆమెని పిలిపించాడు. వేడి వేడిగా బిరియాని తిందామంటే ఈ నస ఏంటిరా దేవుడా!! అని చాలా చిరాకొచ్చింది. మా పని మనిషి నేను కిటికిలోనే పెట్టాను. అది గాలికి కింద పడిందేమో.. చూసారా! అని అడిగింది. మా అక్కకు, నాకు ఆ ఆలోచనే రాలేదు. ఎందుకంటే నా మెదడును బిరియానీ, మా అక్క మెదడుని వ్రాసిన exam paper ఆక్రమించేశాయి. మొత్తానికి తాళం చెవి లోపలే పడిపోయింది. మా అదృష్టం దానికి keychain కూడా  లేదు ఏదైనా కర్ర సహాయంతో తీద్దాం అంటే.. అంతే మన టైం బాలేనప్పుడు అన్ని ఇలా కలిసొస్తాయి. మా ఇంటి పక్క పోర్షన్లోకి కొత్తగా అద్దెకి ఆరోజే వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న బాబు పెప్సీని చూసి వాళ్ళ అమ్మతో అది కావాలని ఒకటే గొడవ :D . అక్కడ మా పరిస్థితి అసలు వర్ణించలేము. మా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. వాటిని శాంతపరచాలంటే ఇంటి తలుపులు తీయాలి :(. మా పనిమనిషి నా వల్లే కదా మీరు ఇక్కడ అనవసరంగా నిలబడ్డారు అని చాలా భాదపడుతోంది. ఆ తాళం చెవిని తీయడానికి చాలా కష్టపడుతోంది. తాళం చెవికి ఉన్న రింగులో సన్నని ఇనుపతీగని వంచి దాని సహాయంతో బయటికి తీసే ప్రయత్నం చేస్తోంది. పక్క బిల్డింగ్ వాళ్ళు మా అవస్థలు చూడలేక ఒక తాళం చెవి ఇచ్చి దాంతో ప్రయత్నించమన్నారు. అబ్బే! హెయిర్ పిన్నులతో, పక్కింటి వాళ్ళ   తాళం చెవితో వచ్చే విధంగా తయారు చేస్తున్నారా ఈ మధ్య తాళాలు.. అసలే మనం technologically advanced.. :D..
            చివరికి మా పని మనిషి నా వల్ల కాదని చేతులు ఎత్తేసింది. నేను తాళం పగలకొట్టేస్తాను అని ఒక పెద్ద బండ రాయితో పగలకొడుతూ, మీరు నా జీతం డబ్బుల్లో ఒక వంద తగ్గించేయండి ఈ నెలకు. ఆ వందతో కొత్త తాళం కొనుక్కోండి అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఆంటీ!! మీరు మొదటే ఈ పని  చేసుంటే మేము ఈ పాటికి తినేసుండే వాళ్ళం అనుకున్నాము. ఇంతలో నాకు ఒక మెరుపు లాంటి ఐడియా తట్టింది. తాళం చెవి దేనికైనా అతుక్కున్టుందా   అని.. వెంటనే ఓనర్ వాళ్ళ అమ్మాయిని పిలిచి ఒక చిన్న అయస్కాంతం ముక్క ఉంటే ఇవ్వమని అడిగాము. ఆ అమ్మాయి నా దగ్గర లేదని చెప్పేసింది. అయినా మీ అమ్మని ఒకసారి అడుగు..ఉంటె తీసుకు రా అని చెప్పాను. ఆ అమ్మాయి ఒక చిన్న అయస్కాంతం ముక్క తెచ్చింది. దాన్ని మా పని మనిషి ఇంతకు ముందు తెచ్చిన ఇనుప తీగకి పెట్టి, దాని సహాయంతో తాళంచెవిని బయటకి తీసాము. నేను flowలొ వ్రాస్తూ మీకు టైం చెప్పడం మర్చిపోయాను. మేము గృహప్రవేశం చేసే సరికి సమయం సాయంత్రం 4.30. అక్షరాలా రెండు గంటలు ఎండలో, ఆకలితో మాడిపోయాం. వెంటనే చల్లారిపోయిన బిరియాని, వేడిక్కిన పెప్సితో మా భోజనం కానిచ్చేసాము. :D .. చాలా ఆకలితో ఉండటం వల్లనుకుంటా అవి చాలా రుఛిగా అనిపించాయి.  ఆ తరువాత కిటికిలో తాళం పెట్టే విధానం మార్చాము. ఒక కిటికీ తెరిచి మూసి ఉన్న రెండో కిటికీ తలుపు వెనకాల పెడతాము. ఒకవేళ గాలికి తెరిచి ఉన్న కిటికీ కొట్టుకున్నా రెండో కిటికీకి బోల్ట్ పెట్టి ఉంటుంది కాబట్టి తాళం చెవి పడుతుందన్న భయం ఉండదు. What an idea  madam ji :D :D 

Friday, 9 November 2012

నేను ఊరెళ్తున్నానోచ్

                       నేను హాస్టల్లో చేరి రెండు నెలలు కావస్తోంది. అసలు ఒక్క రోజే సెలవు తీసుకుందామనుకున్నాను నిన్నటి వరకు. నిన్న మా అమ్మ అదేంటీ? అమావాస్య రోజు బయలుదేరుతావా? అని అడిగింది.. నేను పర్వాలేదు అమ్మ.. దేవుడీకి దండం పెట్టి వస్తాలే వచ్చేటప్పుడు... ఏం కాదు అని ఒప్పించాడనికి ప్రయత్నించాను. ఇంతలో మా అక్క ఫోను తీసుకుని ఏం కాదులే! ఆరోజు నువ్వు టపాసులు పేలుస్తూ ఒక పక్క మళ్లి తైరిగి వెళ్ళాలని టెన్షన్ పడుతూ ఏం హడవుడి పడుతూ పోకు అని చెప్పేసరికి నేను రెండు రోజులు లీవ్ తీస్కుంటున్నాను.
           నాకసలే HOMESICK ఎక్కువ. అందులోనూ హాస్టల్ నుంచి బయల్దేరుతున్నాను మొదటిసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఎందుకో మనసులో చెప్పలేని ఆతురత, మా ఊరుకి ఫ్లైట్ ఉంటే బావుండేదని అనిపిస్తోందీ(అతడు సినిమా డైలాగు కాపి కొట్టానని అనుకోకండి.. ప్రతిసారి ఊరు వెళ్ళేప్పుడు  నాకు ఇలానే అనిపిస్తుంది.). నిన్ననే మా ఆఫీస్లో దీపావళి సందడి మొదలైంది. మాకు దీపావళికి చాకొలేట్స్ ఇచ్చారు. దీపాల అలంకరణ పోటీ పెట్టారు. ఆఫీస్ అంత సందడి సందడి గా కనిపిస్తోంది. నాలోనే ఆ సందడి ఉన్నందుకనుకుంటా...ఇంకా నేను పండగకి కొన్న కొత్త బట్టలు, నేను ఇక్కడ మా అమ్మ,నాన్న,అక్కల  కోసం కొన్న వస్తువులు చూపించి వాళ్లనెప్పుడెప్పుడు ఆశ్చర్యపరుద్దామా అని ఉంది.
           ఇక్కడ వాతావరణం కూడా నా ఫీలింగ్స్కి తగ్గట్టు చాలా మబ్బులతో ఉంది. ఇలా ఉంటే నాకస్సలు పని చేయబుద్ధి కాదు. నిజం చెప్పాలంటే ఆఫీస్ కు వెళ్లాలని కూడా లేదు. అయినా మీకొక విషయం చెప్పనా??? మా మెనేజరుకి మాత్రం చెప్పకండి.. ఈరోజు నా బస్సు 8 గంటలకి అయితే 5 గంటలకే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నాను. మళ్లి 5 రోజుల వరకు ఆఫీసు ఊసే లేదు.
           ఒక భాదాకరమైన విషయం ఏంటంటే నేను క్రిస్మస్ కు ఇంటికి వెళ్లలేను..ఎందుకంటే నాకు ఉన్న అన్ని లీవ్స్ అయిపోయాయు ..:( మ అక్కకి ఇదే విషయం చేప్తే అరే!బాధపడకు .. ఆ ఏసుప్రభువే చల్లగ చూసి నీకు లీవ్ ఇప్పిస్తాడు అని చెప్పింది.. ఏంటో ఉద్యోగంలో చేరిన తర్వాత పరమత భేదం లేకుండా అన్ని పండగలకి ఇంటికి వెళ్ళడం అలవాటైపోయింది . ఈ సంవత్సరం అన్ని పండగలు దాదాపు ఇంట్లోనే చేసుకున్నాను. ఆఖరుకి మన ఆంధ్ర అవతరణ కూడా..ఇంకా చివర్లో ఈ ఒక్కటీ చేసుకోకపోతే వెలితిగా ఉంటుంది కదా !!!!!!అయ్యో పాపం.. ముఖ్యమైన పండగ మిస్స్ అవుతోందని మీకు కూడా అనిపిస్తోంది కదా !! మా మెనేజరుకి ఏదో ఒకటి చెప్పి లీవ్ సంపాందించే మార్గం చెప్పండి.. "అందరికి దీపావళి శుభాకాంక్షలు."

                                             

Thursday, 8 November 2012

TEAM MATE


     నేను పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మా కోర్సు రెండు సంవత్సరాలైతే అందులో ఒక సంవత్సరం కాలేజిలోనే ఉండి చదివేదైతే ఇంకొక సంవత్సరం మేము నేర్చుకున్న విద్యని ఏదైనా ఒక సంస్థలో ట్రైనీ ఇంజనీరుగా ప్రదర్శించి  ఒక ప్రాజెక్టు చేయాలి.
   మా మొదటి సంవత్సరం పరీక్షలు కాక ముందే ఈ హడావుడి మొదలైంది. కొంతమందికి మొదట్లోనే అవకాశాలు పలకరించి వాళ్లు నిశ్చింతగా పరీక్షలు వ్రాసుకున్నారు. నాలాంటి కొంతమంది మాత్రం అటు ఆ పరీక్షలకు చదవలేక, మధ్యలో ఈ ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక కొంచెం ఇబ్బందిపడ్డాము. అలా మా కష్టాలు చూడలేక మా హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ గారు ఒక సంస్థలో తనకు తెలిసిన వాళ్లు ఉంటే మా అందరిని ఇంటర్యూలకు పంపే ఏర్పాట్లు చేసారు..నాకు ఆయన ఈ మాట చెప్పగానే మా పాలిట దేవుడిలా కనిపించారు. ఎలాగోలాగా ఆ ఇంటర్య్వూలో నెగ్గి నేను కుడా ఒక ప్రాజెక్టుదాన్ని అయ్యాను :). ఏంటో కాని మనకు దక్కనంత వరకు ఒక విషయంపై మనం పడే తపన అంతా ఇంతా కాదు. మానవ సహజం కదా!!!ఇందులో ఒక విషాదకరమైన విషయం ఏమంటే మా కాలేజీ నుంచి 6 మంది అబ్బాయిలు, నేను ఒక్కదాన్నే అమ్మాయి. అయినా మనకు communtication skills తెలిసినపుడు అదంత పెద్ద సమస్య కాదనుకున్నాను :P. కానీ మొదటిరోజే నన్ను పిలవకుండా భోజనానికి వాళ్లు మాత్రమే వెళ్లిపోయారు..(మనలో మన మాట.. తెలుగు అబ్బాయిలకు అమ్మాయిల దగ్గర తగ్గి మాట్లాడానికి అహం అని నా అభిప్రాయం.. హుష్..ఈ మాట మళ్లీ మాట్లాడుకుందాం).. ఎంతైనా మనం ఇద్దరం ఉండీ, అవతల వాళ్లు ఒక్కళ్ళే అని తెలిసినపుడు ఇంకొంచెం బెట్టుగా ఉంటామనుకోండి..మానవ సహజం..:) ఇంక తప్పదనుకుని మీరు రోజు నన్ను కూడా పిలవండి అని ఒక మాట వాళ్లతో చెప్పాను. 
          ఒక అబ్బాయి,నేను ఒకే టీము. ఈ X కొంచెం మొదట్లో బానే మంచిగా ప్రవర్తించేవాడు. తర్వాత్తర్వాత భరించలేని విధంగా తన వ్యక్తిత్త్వంతో నా కళ్లు తెరిపించాడు. ఈ X గారిని నేను ఏమి అడిగినా నాకు తెలియదు అనే సమాధానం ఇచ్చేవాడు. నేను మొదట్లో అయ్యో పాపం!! అని నాకు తెలిసిన ఇంఫర్మేషన్ అంతా చెప్పి త్యాగశీలిలాగా గొప్పగా feel అయ్యేదాన్ని. కానీ ఆ అబ్బాయి ఉద్దేశ్యం తనకి తెలిసిన విషయం కరెక్ట్ అవునా? కాదా? అని నాతో నిర్దారించుకోవడం . అదేం ఆనందమో నాకు ఇప్పటికి అర్థం కాదు.ఒక్కసారి మా మెనేజరు తనని పిలిచి ఏదో మాట్లాడాడు. విషయం ఏంటీ అని అడిగితే హా..లైట్ అని నాకు మెనేజరు ఏం చెప్పాడో చెప్పకుండా నీళ్లు నమిలేసాడు. అదంత లైట్ అయినప్పుడు అంత సీరియస్గా వినడం ఎందుకో? మళ్ళి  నాకు చెప్పకుండా దాచిపెట్టడమెందుకో??అప్పుడర్థమైంది తన అసలు రూపం. ఏదైనా కాని నా నుంచి సమాచారం లాగడమే తప్ప తను ఒక్క విషయం కూడా చెప్పేవాడు కాదు.. కొంచెం లేట్గా అయినా నాకు జ్ఞానోదయం అయ్యి నేను తనలానే సమాధానం ఇచ్చి తప్పించుకునేదాన్ని.
                    ఒకరోజు మా మేనేజర్ మా ఇద్దరినీ పిలిచి చాలా casual గా మీరు weekends ఏం చేస్తుంటారు అని అడిగాడు. విషయం తెలియని గుడ్డిగొర్రెలాగా bore కొట్టి ఎలా timepass చేయాలో తెలియక జుట్టు పీక్కుంటాను అని నేను చెప్పేసరికి మా మేనేజర్ ఒక్క అరుపు " woow!! It is really interesting :P" అని అరిచి నువ్వు అయితే ఈ వీకెండ్ ఆఫీస్ వచ్చి పనితో timepass  చేయి అని నా తల మీద తాపిగా ఒక బండరాయి వేసాడు. తర్వాత ఆ X గాడిని అడిగితే వాడు అతి తెలివితో "నేను వస్తాను కానీ  నాకు ఇక్కడ తినడానికి కాంటీన్ తెరిచి ఉండదు" అని నీళ్ళు నమిలాడు. మా మేనేజర్ దేన్నైనా కాష్ చేసుకునే రకం. అదే నీ సమస్య అయితే నువ్వు చిన్నీ వాళ్ళింటికి వెళ్ళు. లంచ్ చేసి పెడుతుంది. మా మేనేజర్ అంత మొహమాట పెట్టిన తర్వాత సరే అని నేను కూడా  దానికి ఒప్పుకోక తప్పుతుందా!!!:(
             అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు ఒక అలవాటుండేది. రోజు మా అన్నయ్యతో పాటు కలిసి ఇంటికి వెళ్ళడం. సాయంత్రం 6:30 అయ్యిందంటే నేను తనని నసపెట్టేదాన్ని ఫోన్ చేసి ఇంటికెల్దాం అని. నాకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అన్నయ్యని కూడా పేరు పెట్టి పిలవడం..ఇంకొక మంచి విషయం మా అమ్మ,అక్క,నాన్నలతో ఇంచుమించు ఒక అరగంట మాట్లాడేదాన్ని. ఏంటో అన్ని మంచి లక్షణాలే చెప్తున్నాను కదా !"I am very good girl..అన్ని మంచి లక్ష ణాలు ఉన్నయంట నాలో..విన్నావా మిష్టర్ !!!!(Little Soldier's Song)" ఊహించుకోగలరని మనవి.మేము కాంపస్ ప్లేస్ మెంట్ కి మా కాలేజి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నేను మా అన్నయ్యతో టికెట్ బుక్ చేయించేదాన్ని. ఇన్నిసార్లు ఒక అబ్బాయితో ఫోనులో మాట్లాడుతుండే సరికి ఇంక  చూసుకోండి వీడి general knowledge తో మా అన్నని నా బాయ్ ఫ్రెండ్ అనుకుని కాలేజీ లో అందరి చెవులు కోరికేసాడు.నేను ఆ రక్తం చూసి ఏమైంది అని బాధితుల్నిఅడిగితే సదరు X గాడు నా గురించి ఇలా
చెప్పాడని తెలిసి నవ్వుకున్నాము.ఆ చెవి కొరికిన బాధితులకి మా అన్నయ్య పేరు తెలియబట్టి నేను బతికిపోయాను.నా దాకా విషయం వచ్చిన తర్వాత ఆ X కు దూరంగా ఉన్నాను. లంచ్ కట్ చేసాను.                  
                   ఇంకొకసారి X ని పిలిచి మాటల మధ్యలో మెనేజరు నా గురించి అడిగితే తను అస్సలు పని చేయదు, నాకసలే సహాయం చేయదు అని చెప్పాడంట. ఈ విషయం నా దాకా వచ్చి నేను ఇలా చెప్పాను, నువ్వు మేనేజర్ ఏమైనా తిడితే లైట్ తీసుకో అని చెప్పాడు. వెంటనే నేను షాక్కి గురయ్యాను. అప్పటి దాకా తెలియని లైట్ అనే పదానికి వాడి పద్ధతిలో సమాధానం ఇచ్చాడు వెంటనే తేరుకుని అసలెందుకు అలా చెప్పారు ? అని అడిగాను. కావాలని చెప్పలేదు. తెలీకుండా నోరు జారాను అని చెప్పాడు. ఆ క్షణం వాడి ఆలోచన మా మేనేజర్ ముందు నన్ను చెడుగా చిత్రించడం. ఈ విషయానికి కావాల్సినoత CLASS ఆరోజే తీసుకుని ఇలాంటి మనుషుల కన్నా మృగాలు నయం అనుకుని మాట్లాడటం మానేసాను.
              కట్ చేస్తే మేము కాలేజిలో ఇండస్ట్రీలో ఉండి ఏమేమి చేసామో ఒక రిపోర్టు ఇవ్వాలి చివరగా.మాకు రెండవ సంవత్సారనికి ఇదే ఎగ్జాం.నేను దాన్ని ప్రింట్ తీసుకోవడానికి వెళితే ఇంటెర్నెట్ షాపులో వీడు ఉన్నాదు..ఎన్ని పేజిలు అని అడిగాడు? నేను 75 పేజీలు చేసాను అని చెప్పి నా పని చూసుకుని వచ్చేసాను. నేను వచ్చేసిన వెంటనే "దీని మొహం.. ఎప్పుడు చూడూ..ఫోన్లలోనే ఉంటుంది.. రిపోర్ట్ ఏం చేసిందో అని" అని మళ్లీ కామెంట్ చేసాడంట.. నా ఫ్రెండ్ అక్కడుంది అని తెలిసి కూడా..నేను దాని గురించి మాట్లాడటనికి వాడు నా కంటపడలేదు. ఇక్కడ నా దరిద్రం ఎంతలా నన్ను చుట్టుకుంది అంటే నేను, X ఒకే organizationకి సెలెక్టు అయ్యాము.కాని దేవుడు నన్ను ఒక కంట కనిపెట్టి వేరు వేరు టీంలలో వేసి ఈ నస నుంచి నన్ను తప్పించాడు.అయినా నేను నా మనసులో అన్ని అలాగే పెట్టుకున్నాను. ఒకసారి ఆఫీసు చాట్లో నన్ను గెలికాడు. నేను ఫోనులో ఎంత సేపు మాట్లాడుతున్నానన్న దాని పైన థీసిస్ ఏమైనా ఇస్తున్నావా? ఏ విధంగా నీకు సహాయపడగలను అని Customer Care Executive type లో అడిగేసరికి కిందికి రా, నేను మాట్లాడాలి ఓ టెన్షన్ పడిపోయాడు. నేను సున్నితంగా నాయనా! నేను ఫోనులో మాట్లాడితే నీకు సమస్య అయితే వచ్చి నాతో చెప్పు, అంతే కాని అందరి చెవులు కొరికి వాళ్ల చెవులకి హాని చేయకు అని సున్నితంగా మొత్తే సరికి నోరుమూసుకున్నాడూ. వీడి దరిద్రమైన etiquette కి ఇంకొక ఉదాహరణ నేను మీరు అని మర్యాదగ పిలిచినప్పుడు కూడా సెన్స్ లేకుండా నువ్వు అనే సంభోదించేవాడు. ఇంకా షాక్ అయ్యాను అని నేనంటే మీరు కూడా నన్ను తిట్టేస్తారు. ఇంక తప్పుతుందా!! నేను కూడా నువ్వు అనే అన్నాను. అయినా వీడు మనిషి కాదని కంఫర్మ్ చేశాడు. మరేంటో అని ప్రశ్న నన్ను వేయకండి. మీ ఊహకే వదిలేస్తున్నాను.
              నేను ట్రైనింగ్ కోసమని United States of America వెళ్లాను. తను అక్కడ నాతో పాటు ఉన్నాడో లేదో నాకు తెలియదు. అసలు తను ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. నేను ఒక రోజు సాయంత్రం ట్రైనింగ్ పూర్తి చేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే వీడు కనిపించాడు. దేశం కాని దేశం వచ్చాము అని ఏమీ మాట్లాడకుండా వెళ్లిపొబోయాను. ఈలోపు ఒకసారి తనని చూస్తే ఎవరితోనో సీరియస్గా నా వైపు చేతులు చూపించి మాట్లాడుతున్నాడు. నాకు ఏదో అనుమానంగా అనిపించింది. తిరిగి వెనక్కి చూసుకుంటే ఒక 5 మంది రౌడీలు నా వెంటపడీ తరుముతున్నారు. ఇంక నాకేమి చేయాలో తెలియక వొళ్లంతా చెమటలు పట్టేసాయి. నేను కూడా శాయశక్తుల పరిగెత్తుతూ చివరికి ఒకరి పెరట్లోకి నా బ్యాగు పడేసి నేను వేగంగా గోడ దూకేసి చెట్ల వెనకల దాక్కున్నాను . నా అదృష్టం ఏంటంటే నేను దూరింది ఒక సిఖ్కుల ఇంట్లో. వాళ్లు నన్ను పిలిచి ఇంట్లో కూర్చోపెట్టుకున్నారు. ఈ లోపల ఎవరో తలుపు  తట్టారు ఆ అంకుల్ తలుపు తీసి సమాధానం చెప్పేలోపల కాల్చిపారేసారు. అమ్మో! వాళింట్లో తలదాచుకోవాడనికి చోటు ఇచ్చినందుకు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లల్లున్నారు ఆ ఇంట్లో.. దేవుడా! ఎవరికి ఏం హాని చేయకు అని మొక్కుకుని బిక్కు బిక్కుమంటూ చూశాను.. హమ్మయ్య! నా ప్రాణాలు పోలేదు. నేను ఇంకా బతికే ఉన్నాను. ఇదంతా కలా..!!!! చదివిన మీకే ఇంత టెన్షన్ గా ఉంటే నా పరిస్థితి గురించి కొంచెం అలోచించండీ.  ఏంటో నా జీవితంలో నా మీద ఇంత కక్ష పెట్టుక్కున్న వ్యక్తిని చూడలేదు.
p.s:  తన etiquette ని దృష్టిలో ఉంచుకుని ఏకవచనంలో వ్రాసాను. ఇలా ఎందుకు వ్రాశానంటే తన మీద ఉన్న ద్వేషమంతా ఇలా నా మనసులో నుంచి బయటపెట్టెసి ప్రశాంతంగా ఉందామని.
             
                  

Sunday, 4 November 2012

ప్రియ నేస్తం

       నాకు తనకి పరిచయం ఈ బ్లాగ్ ద్వారానే ఒక చిన్న కామెంట్ తో  "నేను రెబెల్ సినిమా చూద్దామనుకున్నాను, మీ పోస్ట్ తో చూడకుండా నన్ను రక్షించారు" అని. అప్పటిదాకా అంత తియ్యని కామెంట్ నా బ్లాగ్లో కనిపించలేదు. వెంటనే తను చూడాలనుకుంటున్న సినిమా గురించి తన ప్రొఫైల్ నుంచి మెయిల్ ఐడి తీసుకుని ఒక మెయిల్ పెట్టాను. వెంటనే అటు వైపు నుంచి ఒక శుభోదయాన వేడి వేడి కాఫీ మెయిల్ వచ్చింది.
       వెంటనే మెయిల్ నుంచి చాట్  లోక మారింది. వెంటనే  ఫోను నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము. ఆ తర్వాత మాటల ప్రవాహం జరిగింది మా మధ్యన. తర్వాత వెంటనే మనం కలవాలి అని అనుకున్నాము కాని ..అది ఇంత తొందరగా జరుగుతుందని మేమసలు ఊహించలేదు. 
       పోయిన బుధవారం ఉదయం తన నుంచి ఫోను "చిన్ని ! లేయ్..నేను వచ్చె వారం నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను." నేను వెంటనే "సరే. నేను కాసేపు తర్వాత ఫోను చేస్తాను. ఎందుకంటే నేను వచ్చే వారం మా ఊరు వెళ్తున్నాను. నేను మా అమ్మతో మాట్లాడి ఏ విషయము చెప్తాను." నేను రాకు అని చెప్పలేను..ఎందుకంటే నాకు కూడా తనని ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆశగా ఉంది. అమ్మను ఎలాగోలాగా  తను వస్తోందని చెప్పి, నేను ఊరు రావడం ఒక 2 రోజులు ఆలస్యం అవుతుందని చెప్పి ఒప్పించాను.సరే ఒక వైపు నుంచి ఉన్న టెన్షను తగ్గిపోయింది. ఇంక సెలవల సంగతి మేనేజరు గారికి చెప్పి 2 రోజులు సెలవలకి అప్ప్లై చేసాను. సరే..ఒక వైపు తను వస్తుందో, రాలేదో చివరికి ఏదైనా కారణాల వల్ల అని అలోచిస్తూ తను వచ్చే వారం వస్తుందని ఎదురు చూస్తున్నాను.  
    ఈలోపు తన దగ్గర నుంచి ఫోను "భరత్ ఈ వారమే హైదరబాదు వస్తున్నాడూ, అందుకని నేను కూడా ఈ వారమే వస్తాను. నువ్వు పండగకి ఇంటికి వెళ్లొచు కదా!!". ఒక విధమైన సంతోషం తనని తొందరగా చూసేయొచ్చు అని!! శుక్రవారం తను బయల్దేరాలంటే గురువారం తత్కాల్లో టిక్కెట్ చేయిస్తాను భరత్ తో అని చెప్పింది. నేను శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాదుకి ఉన్న ట్రెయిన్స్ అన్ని చూసి ఒక ట్రెయిన్ తనకి అనుకూలంగా ఉందని చెప్పాను.నాతో మాట్లాడేటప్పుడే తన మొబైల్ ఛార్జింగ్ తక్కువుందని చెప్పింది. నేను చెప్పిన ట్రైన్ వివరాలు భరత్ కు చెప్పే లోపలే తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ విషయం తెలియక తను వస్తే ఏమేమి చేయాలో అలోచిస్తూ..మధ్య మధ్యలో తన మొబైల్ కి కాల్ చేస్తున్నాను.    చివరికి సాయంత్రం తన దగ్గరి నుంచి ఫోను, "లేదు! కుదరట్లేదు. నేను భరత్ కి చెప్పే లోపల నా  మొబైలు లో ఛార్జింగ్ అయిపోయి మన ఆశల్ని అడియాశలు చేసింది.టిక్కెట్ దొరకలేదు అని విషయం చెప్పింది." దానికి నేను "పర్లేదులే..వచ్చే వారం కలుద్దాము" అని ఓదార్చేసాను.
     ఎందుకో మళ్లీ మాటల్లో నువ్వు వస్తావని అనుకున్నాను..కాని నువ్వు రావట్లేదు అని భాదపడేసరికి..చిన్ని! నాకు టిక్కెట్ చేసెయ్యి అని చెప్పింది. తనకి బస్ ప్రయాణం అలవాటులేకపోయినా నా కోసం 15 గంటలు ఓంటరిగా ప్రయాణం చేసి నన్ను చూసి మురిసిపోయింది.
      తను పంపిన వేడి కాఫీ మీ అందరితో పంచుకుంటున్నాను.. ఈ కాఫీనే మమ్మల్ని కలిపింది. తను నాకు చెప్పిన మాటలకి చాలా ఆనందం, ఆశ్చర్యం. తన పరిచయం నాకొక గొప్ప అనుభవం.తను మరెవరో కాదు.. "MY DEAR LOVING FRIEND PRIYA". తను నాతో ఉన్న ప్రతి క్షణం నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ, బతిమిలాడుతూ, నవ్వుతూ నా పైన ప్రేమను కురిపిస్తూ చాలా సంతోషంగా గడిచిపొయింది..తను ఈ రెండు రోజులు నా పనులతో అలసిపోకుండా తను కూడా నాతో పాటు పరుగులు పెట్టి..ఇంకా చాలా మాటల్లో చెప్పలేని అనుభూతుల్ని మిగిల్చి మళ్లీ కలుద్దాము అని...
             ప్రియా.. ఇది మన గుర్తుగా..మనం ఎంత బిజీగా ఉన్నా ఈ పోస్టు చూసిన వెంటనే ఒకరికి ఒకరం అన్న ధైర్యం వచ్చేయాలి. . THANKS FOR EVERYTHING.  నా జ్ఞాపకంగ ఇది నీకు. 
              
                  
                            

Monday, 29 October 2012

బాటసారి బంధాలు

                        ఈరోజు పొద్దు పొడిచిన దగ్గరనుంచి నేను నా చుట్టూ ఉన్న వ్యక్తులు,జీవన విధానం ఆలోచిస్తూ.. ఆ ఆలోచనలకి ఒక రూపం ఇవ్వాలని ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాను.
        ఒక బాటసారి ఒక అడవిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అతని ఆలోచనలు, గమ్యం ఏది తనకు స్పష్టంగా లేవు.. అయినా ప్రయాణం ఆపకుండా తోచిన బాటలో పయనిస్తున్నాడు. అలా ఆ బాటలో ఇంకొక బాటసారి కనిపించేసరికి తెలియని ఒక ధైర్యం. నేను ఒంటరి కాదు అని కుదిరిన నమ్మకం. అలా ఆ ఇద్దరు బాటసారులు మాటలు కలిపి, "నీకు తోడుగా నేను ఉన్నానని "ధైర్యం చెప్పుకుని ఆ అడవిలో ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా సాగిపోతున్నారు.. అలాగే ఆ అడవిలోనే ఉండిపోతే కథ సుఖాంతమయ్యేది..
                              
         అలా ఇద్దరు తమ గమ్యంలేని ప్రయాణాన్ని గురించి కలత చెంది మిత్రమా! మనమొక గమ్యం నిర్దేశించుకుందాం, ఆ గమ్యం వైపు నడుద్దాం..ఆ గమ్యాన్ని చేరుకోవడంలో నీకు తోడుగా నేను ఉంటాను అని ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకున్నారు..
         గమ్యం ఒక్కటే అనుకున్నారు.. ఆ గమ్యాన్ని చేరవలసిన దారులని ఇద్దరు భిన్నంగా ఎంచుకున్నారు.. ఒకరు కష్టమైనా ముళ్ల బాటలో పయనించి ఖచ్చితంగా గమ్యం వైపుపోయే దారిలో  వెళ్దామనుకున్నారు, మరొకరేమో ముళ్లులేని బాట గమ్యాన్ని చేరుతుందని తెలియకపోయినా ఏదో  ఒక దారి కనపడకపోదు అని అనుకున్నారు.. ఇంత వరకు చెప్పుకున్న మాటలని మరిచారు.. మిత్రమా! నువ్వు చెప్పిందే నిజం అని ఇద్దరు ఒకరికొకరు ఓదార్పు చెప్పుకోలేకపోయారు..గమ్యం లేనంత వరకు రాని పొరపచ్ఛాలు గమ్యం చేరుకోవాలి అని అనుకున్న సమయాన వచాయి..
           ఆ ఇద్దరు బాటసారులు.. మిత్రమా! ఎవరి దారిలో వాళ్లు పయనిద్దాము.. మన గమ్యం ఒకటే కదా.. అక్కడ కలుసుకుందాం అని.. ఎవరికి వారే యమునా తీరుగా విడిపోయారు...ఇద్దరు ఒక్కటైంది ఒంటరితనం మూలంగా ,కాని ఆ ఒంటరితనాన్ని మళ్లీ అహ్వానించి ఒంటరి బాటసారులయ్యారు .. ఆ అడవిలో ఏ కౄరమృగం దాడి చేసి గాయపరుస్తుందో తెలియదు..ఆ దారులు గమ్యo దగ్గరకు చేరుస్తాయేమో కాని  వాళ్లను వేరుచేశాయని మరిచిపోయారు.
ఒక చిన్న మనవి:
      ఇలా ఒంటరి బాటసారి పయనాలు మనకు వద్దు, ఒకరు మన దారిలోకి రానపుడు..స్నేహం కావాలన్నపుడు మనం  వారి దారిలో పయనించడంలో తప్పు లేదు..అలోచించండి!!!! చివరికి అందరి అంతిమ గమ్యం ఒక్కటే..మరణం..అది చేరుకునే మధ్యలో ఎందుకింత తపన..           

Friday, 19 October 2012

నిద్రని ఆపుకోలేక

               నిన్న ఉదయాన్నే సుప్రభాతం కొంచెం లేటుగా నా చెవిలో పడి, నేను కూడా నిద్రలేచే సరికి అమ్మో..ఉదయం సమయం 10.30, అయ్యో ఇదేంటి నా సుప్రభాతం ఇలా చేసిందేమిటి అని విచారిస్తున్న సమయములో మళ్లీ ఇంకొకసారి మహా గణపతిం..అని సుబ్బలక్ష్మి గారి పాట నన్ను లేపడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉందే అని చూస్తే..ఆశ్చర్యం..ఇంకా పాపం నా బుజ్జి మోబైలు "ఇప్పుడు సమయం 10.30" అని పాట పాడి నన్ను మళ్లీ లేపమంటావా? నిర్ధారించుకుంటావా? అని అడిగితే సరేనమ్మా లేచాను అని దానికి సమాధానం చెప్పి ఆఫీసు చేరుకునే సరికి గోడ మీద గడియారం మధ్యాహ్నం 12 కొట్టింది..కొంచెంసేపు పని చేసుకుంటుంటే కడుపులో నుంచి చిన్నగా ఒకలాంటి సంగీతం వినిపించింది, పాపం నా మెదడు కూడా నాకు Glucose లేదు తల్లో..నావల్ల కాదు అని ఒకటే నసపెడుతుంటే సరే అని.. నేను ఉదయం ఏం తినలేదన్న సంగతి తెలుసుకుని నా పొట్ట నిండేటట్టు క్యాంటీన్లో ఉన్న నానాగడ్డి కరిచి నా డెస్కు దగ్గరకి వచ్చి 10 నిముషాల తర్వాత గమనిస్తే చల్లగా నా కళ్లకి ఎ.సి గాలి తగులుతుంటే కళ్లు నా ప్రమేయం లేకుండా మూతలు పడుతున్నాయి.. ఇలా కాదని అలోచిస్తు..చిస్తూండగా..నాకు నా స్కూలురోజులు గుర్తుకు వచ్చాయి...
        చిన్నప్పుడు అంటే ఆరవతరగతి చదివే రోజుల్లో నిద్రపోకుండా ఉండటానికి "softspot" అని 25పైసల చాక్లెట్లు వచ్చేవి.. వాటిని కొనుక్కుని నిద్రవస్తే క్లాసు మధ్యలో తినడానికి వీలుగా..నా బ్యాగు పైజేబులో పెట్టుకునే దాన్ని..నిద్రని నేను ఆపుకోలెకపోతున్నాను అని అనిపించినపుడు బ్యాగులోంచి చాక్లెట్ తీసి టీచరు చూడకుండా దగ్గుతున్నట్టు నోటికి చేయి అడ్డం పెట్టుకుని నోట్లో వేసుకునేదాన్ని. నేనంటె అభిమానం ఉన్న టేచర్లు నేను నిద్రపోతున్నానని తెలిసినా చూసి చూడనట్టూ వదిలేసేవారు. ఇంక నీ నిద్ర ఆపు అని మొహం మీద చెప్పలేని టేచర్లు వెళ్లి నీళ్లు తాగేసి రా అనేవాళ్లు:)
      మా ఎన్.ఎస్ టీచరి క్లాసు కొన్నిసార్లు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఉండేది.ఆ టీచరు "ఏమ్మా! మీరు ఫుల్లుగా తిని క్లాసుకొచ్చి నిద్రపోకపోతే కొంచెం తక్కువ తిని రండి" అని చెప్పేది..అయినా వాళ్లు చెప్పే పాఠాలకు ఏ జోలపాటలు సరిపోవు..అంత హాయిగా నాకు తెలిసి క్లాసులో తప్పా ఎక్కడా నిద్ర రాదు. నేను స్కూలు నుంచి కాలేజికి వచ్చిన తర్వాత స్టడీ అవర్స్ నా ప్రాణానికి హాయిగా నిద్రలేకుండా చేసాయి..ఇక్కడ ఇంకో విధంగా ఉండేవి..నిద్రవచ్చింది కదా అని నేను మొహం కడుక్కుంటాను అనో, నీళ్లు తాగేసి వస్తాను అనో అంటే మా లల్లి మేడం (మేడం అంటే నిజమైన మేడం కాదు, మా వార్డెను) ఒప్పుకునేది కాదు..నించుని చదవమని సలహా ఇచ్చేది, ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆమె కూడా చిన్న కునుకు తీసి అదిరిపడి లేచి మళ్లి మా మీద పడి నిద్రపోకుండా చూసుకునేది. మా హాస్టల్లో నిద్రపోకుండా కొన్ని చిట్కాలు పాటించేవారు. రబ్బరుబాండ్ చేతికి వేసుకుని నిద్ర వచ్చినప్పుడు లాగి కొట్టుకుంటే ఆ చురుకుకి మనం నిద్రపోకుండా వుంటామంటా..!!! నాకు కొన్నిసార్లు దాన్ని లాగి వదిలే మెళుకువ లేనంతగా నిద్ర వచ్చేది హిహిహీ. ఇంకొక జ్ఞాపకం మా తెలుగు సార్ పొద్దున్నే 4 గంటలకు లేచి బ్రహ్మముహుర్తంలో చదివితే మనం చదివినవి బాగా బుర్రలో నిలిచిపొతాయని చెప్పేవారు, అలంటి సమయంలొ మాకు నిద్ర వస్తే ఒక గ్లాసులో నీళ్లు పెట్టుకుని నిద్ర వచినప్పుడు ఒక చిన్న గుడ్డముక్కని దాంట్లొ ముంచి కళ్లు తుడుచుకుని చదవమని చెప్పేవారు.. అయినా నేను ఈ చిట్కా అస్సలు పాటించలేదు. చాలా కష్టం. నిజంగా మేల్కొని ఉంటే తప్ప ఈ పని చెయలేమని నా అభిప్రాయం.
       ఇంజినీరింగులొ చేరిన తర్వాత నిద్ర నుంచి తప్పించుకోవాలంటే మనం "రన్నింగ్ నోట్స్" వ్రాయాలని నేను నా ఫ్రెండ్ మధు తీర్మానించుకుని బుద్ధిగా ప్రయత్నించే వాళ్లం..రన్నింగ్ నోట్స్ అంటే పరిగెత్తుతూ వ్రాసుంటారు కదా..ఇదే బెస్టు అని అనుకుంటున్నారా? అయ్యో!!క్లాసులొ మమ్మల్నెవరు పరుగులు పెట్టిస్తారండీ, మేమే మా లెక్చరర్ల పాఠం వెనక పరుగులుపెట్టి నోట్స్ వ్రాసేవాళ్లం, అదేంటొ కాని ఒక్కొక్కసారి నిద్రాపుకోలేక మా నోట్స్లొకి తెలుగు అక్షరాలు  వచ్చేవి.. తెలుగు ఒక్కటేనా అంటే చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే క్లాసు తర్వాత మా అక్షరాలు మాకే అర్థమయ్యేవి కావు, అర్థం కాని నిద్రలిపి హిహిహీ...
          కాని మా టీచర్లంతా ఒక సంస్కృతంలైన్ చెప్పేవారు.."విద్యా తురానాం న సుఖం న నిద్ర" అని. దీన్ని  పాటించడానికి ప్రతి విద్యార్థి ప్రయత్నించుంటాడు, ఈ కాలంలో పిల్లలతో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పిల్లలికి మార్కులు తగ్గితే నేరుగా తప్పు తల్లిదండ్రులు మీద పడుతోంది.ఏంటో క్లాసులో నిద్రవచ్చినప్పుడు భయంలేకుండా నిద్రపోతే ఎంత  బావుంటుందో..నా ఈ కల తీరంకుండానే నా చదువు  పూర్తైపోయింది.                 

Monday, 15 October 2012

అమ్మాయి మనసు..


      ఏంటో ఈరోజు నేను ఆఫీసులో ఉన్నానన్న మాటే కానీ.. ఈరోజంతా కూడలిలో ఉన్న బ్లాగులన్ని చదివి..వాటన్నిటికి స్పందించి బయటపడేసరికి సూర్యుని చుట్టూ భూమి ఒక అర ప్రదక్షిణ తిరిగి సూర్యాస్త సమయం అయ్యింది.ఏం చేస్తాం చెప్పండీ.. రేపు తొందరగా వచ్చి పని ముగించుకోవాలి.. ఈ పిల్ల టపా శీర్షిక ఒకటి పెట్టి ఇంకేదో వాగుతోందీ అనుకుంటున్నారా.. చెప్తానండీ.. ఇంక డొంకతిరుగుడు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తాను.
       అమ్మాయిలకి ఎక్కువగా కష్టపడే తత్త్వం ఉంటుంది..ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎంత కష్టపడి మా టీంలీడ్ కళ్లుగప్పి ఈ టపా ఆఫీసులో కూర్చునే వ్రాస్తున్నానో.. నా సంగతి పక్కన పెట్టి అసలు విషయం అలోచిస్తే నిజంగా పని నచ్చితే దాన్ని పూర్తి చేయకుండా వదలరు.. ఏంటీ ఏమంటున్నారు..అలాంటి నచ్చినపని అమ్మయిలకు ఎప్పుడు దొరుకుతుందా అనా..!!సెభాష్..చాలా కాలానికి ఒక మంచి ప్రశ్న మీ నోటి నుండి..వాన రావడం,ప్రాణం పోవడం ఎవరూ చెప్పలేరు...అలాంటి పనులు అమ్మయిలకు చాలా అరుదుగా కనిపిస్తాయి..కనిపించినపుడు మాత్రం వాళ్లు అవకాశం చేజారకుండా పట్టుకుని చేసేస్తారు.. నిఝ్జంగా నిజం.. నేను చేసే పని మీదా ఒట్టు.. :P :D
          మీరేదో మనసులో అనుకుంటున్నారూ ...వద్దూ...ముందే  చెప్తున్న మీకూ....!!!బద్దక జీవులు అనా!!!!!..మీరు నిజంగా ఈ విషయం ఒక అమ్మాయి చేతైనా అనిపించి చూడండి..మీరు అలా వాళ్లని ఒప్పించారో మీరు నిజంగా గొప్ప వ్యక్తి..వ్యక్తి అన్న పదం కాదు కానీ శక్తి మీరు...హ హ హ..బయటికి అనేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.. అమ్మయిలలో ఉండే ఇంకొక గొప్ప లక్షణం తమ గురుంచి ఒక చిన్న విమర్శ కూడా తట్టుకోలేరు..చాలా సున్నింతంగా ఉంటాము మేము.. మా దగ్గర ఉన్న అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎంతటి వారైనా మాకు సపోర్టు చేస్తారు... ఇది అంత అషామాషీ అస్త్రం కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించడానికి ....మా దగ్గరున్న కన్నీటి అస్త్రమే మాకు శ్రీరామరక్ష...దీన్ని చూసిన చాలా మందికి రౌండ్లు రౌండ్లుగా ఫ్లాష్ బాక్ సీన్లు గుర్తొస్తున్నాయనుకుంటాను...మీరు మరీ అంత ఎమోషనల్ అయిపొకూడదు... కొంచెం మనసులో దైర్యం నింపుకోండి...మీరిలా డీలా పడిపొతే నా మిగతా పోస్టు ఎవరు చదువుతారూ...పెళ్లి ఆగిపోయి ఏడుస్తుంటే పెళ్లి భోజనం ఎక్కడ? అని అడిగిందంటా అనుకుంటున్నారా..సామెత నేను సొంతంగా వ్రాశాను..ఎవరూ దయచేసి దొంగలించకూడదని ప్రార్థన...హిహిహీ..అంతా మీ అభిమానం.. అదేనండి...విషయం మీరు పట్టేశారు..
            అమ్మాయిలు కొంచెం స్వార్థపరులమండి, అందుకే మేము చెప్పేది ఎదుటి వాళ్లు పూర్తిగా వినాలని అనుకుంటాము..అలా విననపుడు మా అస్త్రాన్ని ప్రయోగించి వినేలా చేస్తాము..మీరు లాజిక్ పట్టేశారనుకుంటా..నేను అస్త్రాన్ని ప్రయోగించకుండా బుద్ధిగా వింటున్నారు..ఈసారి అస్త్రం సంధించకుండా వుండాలంటే,ఇలా పూర్తిగా వినండి అమ్మాయిలు  చెప్పేది... విన్నట్టు నటిస్తాము అంటారా..మీ వేలితో మీ కన్నే  పొడుచుకుంటాము అంటె నేను మాత్రం ఏం చేయగలను.. మధ్యలో నేను ఇప్పుడు ఏం చెప్పానో తిరిగి చెప్పు లాంటి సిలబస్లో లేని ప్రశ్నలు ఎదురవుతాయి...అందుకే నా ప్రియ శిష్యులారా..జాగ్రత్తగా వినండి..తడుముకోకుండా జవాబులు చెప్పి నా శిష్యులనిపించుకోండి..ఏమిటిది గురువరిణి!మా యందు మీ ప్రేమా,ఆపేక్షా ఇంతయేనా!!!!అని విలపించకండి,ఉపాయం ఉన్నది..మీరు వినినా..వినకపోయినా.. అవును...నువ్వు చెప్పింది నిజమే సుమా.. నేనసలు అలా అలోచించనే లేదూ అని పొగిడి..పొగిడినా అనుమానం రాకుండా చూసుకోండి... అస్తు...విజయోస్తు...
శుభం కార్డు వేయట్లేదు నాయనా....మిగతా భాగం తర్వాత వివరిస్తాను.... 
     ఇప్పుడు మీరు నిఝ్జంగ ఈ టపా చదివుంటే మీకొక అనుమానం వచ్చుండాలి, ఎందుకు ఈ పోస్టులో ఇన్ని చుక్కలున్నాయి అని...... వచ్చిందా? అమ్మాయి మనసు తెలుసుకోవడం కంటే ఆ ఆకాశంలోని చుక్కలు లెక్కపెట్టడం సులభం అని నేను అంతర్లీనంగ ఇవ్వదలచుకున్న సందేశము. లేదూ మేము ప్రయత్నిస్తాము అంటె..మీకు విజయోస్తు..

Friday, 12 October 2012

హాస్టల్ కబుర్లు-1

                   హాస్టల్ అనగానే నాకు ముందు గుర్తొచ్చేది homesick. అంటే ఇంక సరదాగా గడిపిన సందర్భాలే లేవని కాదు, అవి కూడా ఉన్నాయి. అవన్నీ చెపుదామనే నా టపా. నాకు హాస్టల్ లో జరిగిన ఒక సంఘటన బాగా గుర్తు.
         నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంకి వచ్చేసరికి మా రూములో ఉన్న 7 మందికి ఇద్దరం మిగిలాము. కాబట్టి మేము ఇంకొకళ్ళ రూములోకి మారాల్సి వచ్చింది. మా రూములో నేను శిరీష బెస్ట్ ఫ్రెండ్స్ . మా రూంలో మా ఇద్దరిది ఒక జట్టైతే మిగతా అందరు ఇంకొక వైపు. మాకు కొన్ని రూల్స్ ఉండేవి. అవేంటంటే.. మేము పడుకున్నపుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అదే విధంగా మేం వాళ్లు పడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు.
         మా రూంలో శ్రీవల్లి అని ఒక అమ్మాయి ఉండేది. తను fasttrack batch. :) ఇదేదో వాచ్ కంపెనీపేరులా ఉందే అని అనుకుంటున్నారా? అదే మరి అక్కడే తప్పులో కాలేశారు. తీయండి ..నేను చెప్తా .. batch లోని వాళ్ళంతా అందరిలాగ మెల్లగా చదవకుండా fast గా superfast రైళ్ళలాగా వేగంగా ఒక సంవత్సరం syllabusను అర సంవత్సరంలోనే చదివేస్తారన్న మాట. శ్రీవల్లి తరగతి సమయాలు, studyhours వేళలు అన్నీ వేరు వేరు. మేము మధ్యాహ్నం వచ్చేసరికి తిని ఒక కునుకు తీసి తన పుస్తకాలు ముందేసుకుని కూర్చునేది. మేము మాట్లాడకూడదు.తనకు studyhours లో నిద్రొస్తే బాగా నిద్రపోయి ఇంకా ఉదయాన్నే 4 గంటలకు మొదలు పెట్టేది తన చదువు. ఇబ్బందిగా ఉంది మాకు నువ్వు రోజు లైట్ వేయడం వల్ల అంటే పెద్దగా పట్టించుకునేది కాదు. అందులోనూ తనేమో fasttrack. మేమేమో నార్మల్ బాచీ. ఇలా ఎంత చెప్పినా మా శ్రీవల్లి గారు పట్టించుకోవట్లేదని ఒకసారి తనని దెబ్బ తీయాలని మేము మంచి అవకాశం కోసం వేచి ఉన్నాము(ఎదురుచూసాము.. పదప్రయోగం కొంచెం కొత్తగా అనిపించింది.)ఒక రోజు మేము మధ్యాహ్నం భోజనం చేసి సరదాగా నేను శిరీష మాట్లాడుతుంటే శ్రీవల్లి చిరాకుగా మొహం పెట్టి నాకు మీ మాటలు ఇబ్బంది కలిగిస్తున్నాయి..మీరు బయటికెళ్ళి మాట్లాడండి అని ఒక ఆర్డరు జారీ చేసింది. మాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. మాటా మాట పెరిగి ఉన్న కొంచెం break అలా నిరుపయోగంగా అయిపోయింది. మనసు మొత్తం పాడు చేసుకుని మేము తీవ్రంగా క్లాసులో తనని ఎలా దెబ్బకొట్టాలా?!అని అలోచించి ..మా బుర్రలు చించుకుంటే ఒక అద్భుతమైన అవిడియా తట్టింది.
                   రాత్రి భోజనం చేసి మేము రూంకి వెళ్ళే ముందు మా పథకాన్ని అమలు చేయాలని తీర్మానించాం. మాకు ఫోన్ చేసుకోవడానికి బ్రేక్ సమయాలు చాలకపోవడంతో అందరం మేము చేసే outgoing calls కన్నా మాకు మేము ఊహించకుండా వచ్చే incomingcalls వచ్చింది అనే అరుపులు వింటే లక్కీ డ్రా లో కార్ గెలుచుకున్నంత ఆనందంగా feel అయ్యేవాళ్ళం..ఇంకా చెప్పాలంటే ఎంసెట్ లో మొదటి ర్యాంకు వచ్చినపుడు కూడా ఇంత సంతోషం కలగదు. అందులోనూ శ్రీవల్లి పేరెంట్స్ బెంగాల్లో ఉండటంవల్ల తానెప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే కాల్ కోసం ఎదురుచూసేది.మా పథకం ప్రకారం కింద నుంచి ఒక జూనియర్ అమ్మాయి చేత శ్రీవల్లి ఫోన్ అని అరిపించాము. మేము అరిస్తే తనకు అనుమానం వస్తుంది కదా..అందుకని :D ..మెట్లు ఎక్కుతుండగా మళ్లీ శిరీష "శ్రీవల్లి ఫోన్ వచ్చింది "అని అరిచి ఏమి తెలియనట్టు రూంకి వెళ్ళాము. తననేనా పిలిచింది అని మమ్మల్ని అడిగి నిర్ధారించుకుంది. నేను సీరియస్ గా నీకే అనుకుంటా ఫోన్ అని నవ్వుని లోపలే అణుచుకుని చెప్పాను. తను కిందకు వెళ్ళిన వెంటనే మేము పడి పడీ నవ్వుకున్నాము.     రాత్రి వచ్చి శిరీష శ్రీవల్లి ఫోన్ మాట్లాడావా అని అడిగింది. తను ఏడుపుమొహం పెట్టి నాకు ఫోన్ రాలేదంట అని చెప్పింది. పాపం తను మళ్లీ studyhours వెళ్ళకుండా ఫోన్ దగ్గరే 2 గంటలు కూర్చొని wait చేసిందంట. మమ్మల్ని మేము కూడా తనని ఏదో ఇబ్బందికి గురిచేసామని ఆ క్షణంలో ఉబ్బి తబ్బిబైపోయాను. నేను ఊరుకోకుండా శ్రీవల్లి కాదేమో శిరీష అని పిలిచారేమో అని అన్నాను. శిరీష వెంటనే ఏంటే శ్రీవల్లి! నీకు ఫోన్ రాకపోతే నాకు వచ్చిందేమో..నన్నెందుకు నువ్వు పిలవలేదు?కింద నుంచి మనిద్దరి పేర్లు ఒకేలాగా వినిపిస్తాయి కదా అని లేని బాధ నటించింది. శ్రీవల్లి బయటికి వెళ్ళిన తర్వాత మేం ఆడిన నాటకానికి,మా నటనని గుర్తు చేసుకుని పదే పదే నవ్వుకున్నాం. ఇప్పటికీ నేను,శిరీష కలిస్తే సంఘటన గుర్తుచేసుకుని నవ్వుకుంటాం. ఇప్పుడున్న ఇన్ని ఫోన్లు అప్పట్లో లేవు. వస్తే ఇంటి నుంచి ఉత్తరాలు రావాలి. లేదంటే ఇలా ఎండాకాలంలో వచ్చే వర్షపు చినుకుల్లా incoming calls రావాలి. హాస్టల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఒక్కొక్క ఫోన్ కాల్ విలువ ఎంతో!!!!!!!
p .s : ఈ సంఘటన జరిగినట్టు శ్రివల్లికి  గుర్తుండకపోవచ్చు .కానీ నాకు మాత్రం ఎప్పటికీ తలుచుకున్న వెంటనే పెదవులపై ఒక చిరునవ్వు
తెప్పిస్తుంది.