Thursday, 27 September 2012

అమ్మ జ్ఞాపకాలు

                         నేను సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకొచ్చాను.  నేను పుట్టినపుడు మా తాతగారు మళ్లీ ఆడపిల్లేనా? అని మా అమ్మను కసురుకుని నన్ను నెల రోజుల వరకు చూడలేదు అని మా అమ్మ ఇప్పటికి చెప్తుంటుంది. అప్పటి మేమున్న పరిస్థితుల్లో ఆడపిల్లంటే పోషణభారం అని అనుకుని ఉంటారు. అప్పటి కాలానికి ఇంకా అమ్మాయిలు చదివి ఉద్యోగాలు చేసేంత లేదు సమాజ పరిస్థితి.అందులోనూ అమ్మాయిలకు కట్నకానుకలిచ్చి పెళ్లి చేయాలి అని సమాజం ఆలోచించేది.అందుకు తాతగారు మినహాయింపు కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మా ఇంటి రేషన్ కార్డులో రెండపేరు అబ్బాయిపేరు రాయించారు నేను పుట్టకముందే అబ్బాయే పుడతాడు అనుకుని. నేను ఈ విషయంలో ఇప్పటికి  మా అమ్మవాళ్ళతో గొడవచేస్తుంటాను.
                   నేను పుట్టే సమయానికి మేము దిగువమధ్యతరగతి వాళ్ళం. మా అమ్మవాళ్లు  ప్రసవం అయిన నెలరోజులకే ఇంటిపనులన్నీ చేసుకునవాళ్ళంట. మా అమ్మగారికి 3 సంవత్సరాల వయసులోనే మా
అమ్మమ్మగారు చనిపోయారు.మా అమ్మని జాగ్రత్తగా చూసుకునే మా మామయ్య నేను పుట్టిన 2 సంవత్సరాలకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను 5వతరగతి చదువుతున్నపుడు ఒకసారి మా ఊరికివచ్చారు. వచ్చినా తన విషయాలేవీ మాకు చెప్పలేదు. మా అమ్మ గారికి వున్న ఒక్క అక్క bonemarrow cancer తో చనిపోయింది. మా అమ్మ కుటుంబం తరపు మాకు ఎలాంటి ఆదరణలేదు. ఈ విషయాల్లో మా అమ్మగారు చాలా బాధపడుతుంటారు ఇప్పటికి.
                   మా అమ్మ ఆ కాలంలోనే SSLC చదివింది.తర్వాత మమ్మల్ని కూడా అంత బాగా చదివించింది.ఒక్క విషయం మాత్రం మాకు పదే పదే చెప్పేద ఎవరుఉన్న,లేకపోయి మనకు జీవితాంతం తోడుగాఉండి ఇంత అన్నంపెట్టేది చదువేనని,అది జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను.నేను చిన్నప్పుడు అంటే 3-4సంవత్సరాలవయసులో చుట్టాల ఇంటికి వెళ్ళినపుడు  నాకు తెలిసిన పద్యాలన్నీ చెప్తుంటే అందరూ పదేపదే బాగా చెప్పిందని మెచ్చుకున్నారుట.దాంతో నాకు బాగా దిష్టితగిలి 3 రోజులు జ్వరం వచ్చేసిందట. ఆ కాలంలో  పిల్లలు  ఏం చెప్పినా అద్భుతంగా ఉండేది. కానీ, ఇప్పుడో బడికిపోకముందే ఇంగ్లీష్మాట్లాడాలి,ఇంగ్లీష్లోనే ఏడవాలి,నవ్వాలి. ఇంకా చెప్పాలంటే 2వ సంవత్సరం నుంచే బడికి తోలి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేంత వరకు తోముతారు.
               ఇంకొక జ్ఞాపకం..పరీక్ష రోజున మేము వ్రాసిన సమాధానాలన్నీ ఇంటికి వచ్చి మా అమ్మకు అప్పజెప్పాలి. అమ్మకు అన్నిటికి సమాధానాలు ఎలా గుర్తుంటాయో అని తెగ ఆశ్చర్యపడేదాన్ని.కానీ మేము అప్పజెప్పే విధానాన్ని బట్టి మేము సరిగ్గా వ్రాశామో లేదో కనిపెట్టేసేది. : ) : ) ఇలా అడుగుతుందని వ్రాయని సమాధానాలు చూసి నేర్చుకునేవాళ్ళం. ఇవి తర్వాత వ్రాసే పరీక్షలకు ఉపయోగపడేవి. ఇప్పటికి కూడా నేను తప్పు వ్రాసిన సమాధానాలను వెంటనే refer చేసి నన్ను నేను update చేసుకుంటూ ఉంటాను.చిన్నపుడు నేను చదివిన సుమతీ,వేమన శతక పద్యాలు నాకు చాలా ఇష్టం. ఈ కాలం పిల్లలకి అవి ఏంటో కూడా తెలిసే అవకాశం లేదు. అందరూ  మేము వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో వెళ్ళామని చెప్తే నాకు కూడా అలా గడపాలని అనిపిస్తుండేది. కాని అంత అదృష్టం లేదు మాకు. ఇంట్లోనే మా అమ్మతోనే ఉండే వాళ్ళం. మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దింది కాబట్టి ఇలా ఈరోజు ఉన్నతంగా బతుకుతున్నాం. ఇంకా ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువ అవుతుంది.

Tuesday, 25 September 2012

కోల్పోతున్న అనుభూతులు

         ఈరోజేందుకు ఇంత హుషారుగా ఉన్నావ్? ఏంటి ఏదైనా విశేషమా?
         పొద్దున్నే సంతోషంగా గడిపేశాను, అందుకే ఈ హుషారు,ఉత్సాహం.
         ఓహ్ అంతేనా.. నేను ఇంకా ఏదో అనుకున్నానులే..
         నువ్వు ఏమనుకున్నావ్ ? మొదట నువ్వు చెప్పు నా  హుషారుకి కారణం ఏమిటో.. ఆ తర్వాత నేను చెప్తాను..
        ఉహూ..అలా ఏమి కాదు .. నువ్వు ముందు చెప్పు..
         నా హుషారుని కళ్ళతోనే గమనించింది నువ్వే కాబట్టి నువ్వే చెప్పు.. నాకు కూడా కుతూహలంగా వుంది నా గురుంచి నీ ఆలోచనలేమిటో అని ....
      చివరికి నీ మాటల గారడితో నా చేతే చెప్పిస్తున్నావన్న మాట.. అలాగే ఇంక నువ్వు ఇంత చెప్పిన తర్వాత నేను కాదనేదేముంది.. నేనే చెప్తాను..కాని చెప్పిన తర్వాత నన్ను ఏమి అనకూడదు..అనుకోకూడదు.
      అయినా నా మనసులో మాటలను నేను చెప్పక ముందే ఊహించి చెప్తున్న నీకు నేను నీ గురుంచి ఏమనుకున్నా తెల్సిపోతుందిలే.. బాధపడకు..
       నీకు ప్రమోషన్ వచ్చిందని నీ మేనేజర్ నీకు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పాడు.
       ఓసి నా పిచ్చిమొహమా! ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్టు నువ్వు మన ఆఫీసు చరిత్రలో కన్నావా?విన్నావా? పని చెప్పడానికే కాని,ఇలాంటి శుభవార్తలు ఫోన్లలో చెప్పే ఆచారం ఇంకా మన దాకా రాలేదు. వస్తే మొదట నీకే  చేసి చెప్తారు :).  
          ఇంతకు మించి నేను ఇంకా చెప్పానంటే నువ్వు ఇప్పుడు నాకొక పేద్ద క్లాసు తీసుకుంటావు కాని.. నువ్వు అనుభవించిన హుషారుకి కారణాలేంటో చెప్పు తొందరగా.. అవతల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి.
          హ.. నీ తొందర నాకు అర్థమైంది. అయితే దీన్ని మళ్లీ మనం తీరికగా మాట్లాడుకుందాం. ఇలా హడావుడిగా అయితే వద్దు.
          నీకు హడావుడి ఉండకూడదు అంటే మనం ఈరోజు సెలవు పెట్టి హాయిగా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవాలి.
          సరేలే  నువ్వు తీరికగా ఉన్నపుడు నువ్వు  నన్ను పిలువు.. అలా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం.
             అయినా నువ్వు భలే మాటకారివి, విషయం చెప్పకుండా దాటేస్తున్నావు .నీకు ఏది ఎక్కువ ఉషారుని ఇచ్చిందో తెలుసుకోలేకపోయాను. నీ మాటల కోసం తీరికగా వున్నప్పుడు వస్తాను.
                  *************************************************************
           అలా ఏదైనా రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందామా?
           రెస్టారెంట్లో వద్దు. అలా నడుస్తూ మాట్లాడుకుందాం.నేను ఈరోజు చాలా ఆనందంగా గడిపాను. నేను చాలా రోజుల తర్వాత కొత్త అనుభూతికిలోనయ్యాను . ఉదయాన్నే ఒక చక్కని కాఫీని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న పక్షుల కిలకిలారావాలు వింటూ, అప్పుడే పైకి వస్తున్న అరుణ వర్ణంలో ఉన్న సూర్యున్ని చూస్తూ ఇన్ని రోజుల నుంచి ఈ అనుభూతిని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నాను.
            ఎప్పుడూ లేనిది.. ఇవాళ గుడికి వెళ్లాలని అనిపించింది. ఉదయాన్నే సూర్యుని కిరణాలు గుడిలో ఉన్న మూలవిరాట్టు ఫై పడి మరింత శోభాయమానంగ ఉంది. గుడిలో పూజారి గారి లయబద్ధమైన మంత్రోచ్చారణ, గుడిలో నుండి వస్తున్న పాటలు. నిజంగా ఇవన్నీ నా చుట్టూనే ఉండి ఇన్ని రోజులు ఇంత మంచి అనుభూతుల్ని మిస్ అయినందుకు బాధపడ్డాను.
         ఉదయాన్నే కావడంవల్ల రహదారులన్నీ అంత రద్దీగాలేవు. రోజూ గంటపైనే పట్టే ఆఫీసు ప్రయాణం ఒక అరగంటలోనే అయిపొయింది. నేను తొందరగా రావడంవాళ్ళ కొంచెం కంగారుతగ్గి పని సాఫీగా జరిగిపోయింది..
        నీ అనుభవం విన్నతర్వాత మనం రోజు మన చుట్టూ జరిగే వాటిని కూడా వదిలేసి ఏదో అందని దానికోసం యాంత్రికంగా పరిగెడుతున్నామని అనిపిస్తుంది.మంచి అనుభూతిని పంచుకున్నావ్.
          ఒక కప్పు కాఫీ, సూర్యోదయం, చల్లని సాయంత్రాల్లో చల్ల గాలికి ఇంట్లో వాళ్లతో కబుర్లు చెపుతూ కాలాన్ని కూడా మర్చిపోయే సందర్భాలు...ఇవన్ని మనం రోజు కొని ఆనందిస్తున్న సినిమా టికెట్లలోనో, షాపింగ్ మాల్లలో వేలుపోసి కొంటున్న వస్తువుల్లోనో ఉందంటావా?!!! 
          హూ.. మనం మన దగ్గర ఉన్న సంతోషాన్ని వదిలేసి లేని దాని కోసం పాకులాడుతున్నాం. చివరికి మనం పోగుట్టుకున్నది తెలుసుకునేసరికి దాన్ని తిరిగి పొందలేము... 
     
          

Friday, 21 September 2012

HOMESICK- 2

                   నిన్న homesick గురించి ఒక టపా రాసాను. అయినా మనసులో కలిగిన అలజడి ఇంకా తగ్గలేదు.
                  హాస్టల్లో ఉండటం ఏలాగు తప్పదని తెలిసి, ఇంక ధైర్యం చేసుకుని మా ఆఫీసుకి దగ్గర్లో వున్న హాస్టళ్లను చూడటానికి బయలుదేరాను. వాటిని చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు నన్ను అందోళనకు గురి చేసాయి.
                   ఒక హాస్టల్ చుడటానికి బావుందని లోపలికి వెళ్లి ఆఫీసు రూము ఎక్కడ? అంటే.. అక్కడ పని చేసే అబ్బాయి నా వైపు ఒక పిచ్చిచూపు విసిరి..వెనకాల అన్నం గిన్నెల ముందు అందరికి గరిటెతొ వడ్డిస్తున్న ముసలయానని చూపించాడు..అయనే ఆ హాస్టల్ యజమాని అని తెలుసుకుని కొంచెం ఆశ్చర్యపడ్డాను. నేను ఇంకా ఏమి అడగకముందే ఆయన ఇక్కడ ఖాళీలు లేవమ్మ అని చెప్పాడు. మనసులో ఇలాంటి హాస్టళ్లకు ఇంత గిరాకినా?! అని అనుకున్నాను.
                               తర్వాత ఇంకొక హాస్టళ్లొ విచారిస్తే అక్కడ వాళ్లు చెప్పిన వసతులు కొంచెం  నచ్చి ఒక గది చూస్తానని అడిగాను. ఆ గదిలో ఇద్దరు ఉత్తర భారత ప్రాంతపు వాళ్లనుకుంటాను..నేను గదిలొకి వెళ్లగానే  ఒక వెర్రి ప్రశ్నవేశారు..నాకు  దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.ఇంకా ఖాళీలు ఉన్నాయా అని అడిగి ఇంకొక గది చూసాను. అక్కడ అందరు అచ్చ తెలుగు ప్రజలు.
                              మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ముందు నుంచి  కాలేజీ వాళ్ళ హాస్టల్లోనే ఉన్నాను. బయటి హాస్టళ్ళ సంగతి పెద్దగ తెలియదు. అక్కడ నేను చూసిన గది ఒక 3 bedroom flat. ఒక్కొక్క bedroom లో 3 beds ఇరికించారు.మొత్తానికి వాళ్ళు ఒక్కొక్కరి  నుంచి వసూలు చేసే పైకం అక్షరాల ఆరువేలు.మొత్తం మీద వాళ్ళకి 
ఒక flat కి వచ్చే నగదు 18వేల రూపాయలు.  అక్కడ నాకు నచ్చిన సదుపాయం మనకు కావాల్సింది మనమే వండుకోవచ్చు. కాని కూరలు,ఉప్పు ,కారము అన్ని మనమే తెచ్చుకోవాలి:(. ఇలాంటి హాస్టల్లో పార్కింగ్ఏరియా ని అన్నిటికి వాడుకుంటారు అంటే అదే dining room, washing area,kitchen... ALL IN ONE:(
         ఏ రాయి అయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అని..దాదాపు దాంట్లో చేరుదామని అనుకుంటున్నాను. అయినా ఇంకా తెలీని homesick నన్ను వెంటాడుతూనే ఉంది. Wish me good luck to enjoy crocodile's festival:D:D:D:)

Thursday, 20 September 2012

HOMESICK

                              ఈరోజు ఎందుకో చాలా బెంగగా వుంది. దానికి నేను కనుక్కున్న కారణాలు రెండు. ఒకటి ఇంటి మీద బెంగ, ఇంకోటేమో నేను కొత్తగా మళ్లీ హాస్టల్లో చేరాల్సి రావడం.
                  ఆలోచిస్తూ వుంటే నేను హాస్టల్ ఉన్నప్పటి జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. అనుకోకుండా నా కళ్ళల్లో కన్నీరు కారిపోయింది. పంచుకుంటే బాధలు తగ్గుతాయని ఇలా రాసుకుంటున్నాను.
                                                       నేను పుట్టి పెరిగింది అంతా ఒక సాధారణ చిన్న పట్నంలో. టెన్త్ క్లాసు తర్వాత మా వూళ్ళో చదివించడం ఇష్టం లేక మా వూరి నుండి నెల్లూరిలో వున్న  ఒక రెసిడెన్స్ కళాశాలలో చేర్పించారు. అప్పటి దాక నాకు సొంతంగా పనులు చేసుకోవడం తెలియదు. అయినా ఇంటి నుంచి మంచి ఉత్సాహంగానే బయలుదేరాము మా నాన్న,నేను. ముందు రోజు సాయంత్రం బయలుదేరితే నెల్లూరు చేరే సరికి ఉదయం అయ్యింది. ఉదయం పది గంటలకి కాలేజీ దగ్గరికి వెళ్లి ఫీ వివరాలన్నీ కనుక్కుని కట్టవల్సినవి కట్టి మళ్ళి తిరిగి మా లాడ్జి రూముకి బయలుదేరి నా లగేజి మొత్తం తీసుకుని హాస్టల్ దగ్గరకు బయలుదేరాము. హాస్టల్ వార్డెన్ నాకు ఒక గది చూపించి దీంట్లో నీ సామాను సద్దుకో. ఈరోజుకి ఎవరైనా వస్తే ఇక్కడ నీతో పాటు ఉంచుతాను అని చెప్పింది.
                            సామానంతా సర్దేసి కిందికి మళ్ళి  ఆఫీసు రూముకి వెళ్ళగానే పాకెట్ మనీ ఎంత కడుతున్నారు అని వార్డెను అడగగానే, మా నాన్నగారు డబ్బులిచ్చి ఎవరికో నా బాధ్యత అప్పజెప్పినట్లు అనిపించి చాలా ఏడుపొచ్చేసింది. మా నాన్న గారిని పట్టుకుని ఏడ్చేసాను. మా నాన్న కొంచెం సేపు నన్ను బయటికి తీస్కెళ్ళి  సముదాయించి నువ్వు బాగా చదువుకో. నీ కోసం నేను వచ్చే వారం వస్తానని చెప్పి వెళ్ళారు. మొదట్లో తిండి సహించేది కాదు. ఆ తర్వాత నేను ఇంగ్లీష్ మాధ్యమానికి కొత్త. లెక్కలు, రసాయనశాస్త్రం బాగానే అర్థమైనా physics మాత్రం చాల ఇబ్బంది పెట్టేది. నేను ఇంట్లో ఎప్పుడూ పది తర్వాత మేలుకుని వుండేదాన్ని కాదు. అలాంటిది రాత్రి పదకొండు గంటల వరకు స్టడీఅవర్స్ అంటే నిద్ర బాగా ముంచుకోచ్చేది. చేసేదేమీ లేక పుస్తకాన్ని ముందు పెట్టుకుని నిద్ర ఆపుకోలేక,నిద్రపోలేకా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఉదయం లేవగానే నిద్ర చాలక కొంచెం జ్వరం వచ్చినట్టు వుండేది మొదటి కొద్దిరోజులు.ఉదయం ఆరు గంటలకు మొదలైతే రాత్రి పదకొండు గంటల వరకు క్లాసులు,స్టడీ అవర్లు ఉండేవి. ఆదివారం ఇంకా పెద్ద బంపర్ ఆఫర్ 13 గంటలు స్టడీ అవర్సు. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించడానికి అంతలా కష్టపడాలా అని?
                            చిన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండేవంటే, మా స్కూలికి పక్కగా  మా తరగతి గది నుండి చూస్తే ఒక ఇంటి మేడ కనిపించేది. ఆ ఇంట్లో పైకి,కిందికి తిరిగే వాళ్ళని చూస్తే "మా ఇల్లు ఇక్కడే వుంటే స్కూల్లో ఉన్నంతసేపు ఇంటినే చూస్తూ వుండేదాన్ని కదా అని అనుకునేదాన్ని".అలా ఆలోచించినదాన్ని ఇంటికి దూరంగా చాలా బాధగా వుండేది. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలంటే మాకు లంచ్ బ్రేక్ కోసం ఇచ్చిన రెండు గంటల సమయం చాలేది కాదు. ఎందుకంటే అంత పెద్ద Queue ఉండేది. అలా queue లో నిలబడి కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకా బాధేసేది. బట్టలు మనమే వుతుక్కోవాలి. అన్నం తిన్నా,తినకపోయినా పట్టించుకుని అడగరు. మనకు జ్వరం వస్తే మనం వెళ్లి పర్మిషన్ తీసుకుని sickroom కి వెళ్లి పడుకోవాలి. ఇన్ని టెన్షన్లు ఉన్నా మనల్ని ఇక్కడ చేర్పించింది  చదువుకోడానికి అని నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మొదటి సంవత్సరం చాలా ఇబ్బంది పడినా రెండవ సంవత్సరానికి కొంచెం కోలుకున్నాను. అంటే నాకు నేను స్నేహితులతో కలిసి సెలవలకి ఇంటికి వెళ్ళడం, అమ్మ,నాన్నల్ని ప్రతి చిన్న విషయం చెప్పి ఏడవకపోవడం లాంటివి. 
                     ఇప్పుడు నాకు ఆలోచిస్తే అలాంటి కాలేజీల్లో వినోదం పూర్తిగా నిషేధం లాగా ఉంటుంది. చదవడానికి ఒక వార్తాపత్రిక కూడా ఉండదు. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టు అనిపించేది. మా చుట్టూ ఏo జరుగుతుందో కూడా తెలిసేది కాదు. కాలేజి కంపౌండ్ బయట ఏం  జరిగినా అస్సలు తెలిసేది కాదు. జైల్లో వున్న ఖైదీలకు ఇలా రెసిడెన్స్ కాలేజీల్లో చదివే పిల్లలకు పెద్ద తేడా ఉండదు. స్వతహాగా ఎవరికీ వారు తమకు నచ్చింది నచ్చినట్టు చేయడానికి కొంచెం సమయం అయినా వుండాలని నాకు అనిపిస్తుంది.
                                             ఇప్పుడు నాకు ఫోన్ కోసం queue లో నిలబడాల్సి రాకపోయినా మనం ఇంట్లో వుంటే మనకు నచ్చింది నచ్చినట్టు చేసుకోవచ్చు. అదే హాస్టల్లో ఉంటే ఏదో restricted గా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా హాస్టల్లో వుండాలంటే బాధగానే ఉంది.

Tuesday, 11 September 2012

టీ కప్పు

                టీ కప్పుతో మనం సాధారణంగా ఏం చేస్తాం? ఏంటి .. ఇంత పిచ్చి ప్రశ్న వేసినందుకు మీలో మీరే నవ్వుకుంటున్నారా? పర్లేదు నా ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే వెంటనే మీ మొబైల్' నుంచి 12345కు  మీ సమాధానం స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైపు చేసి ఈరోజు సాయంత్రం లోగా పంపించండి. కళ్ళు చెదిరే టపా చదివే అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి. ఏంటో నండి ఈ మధ్య కాలంలో ఏ కార్యక్రమం చూసినా ఇలాంటి smsలు చేయమని చెప్పిన anchor ల డైలాగులు విని వినీ అలా ఆవేశంలో నాలో వున్న anchor బయటికి తన్నుకోచ్చేసి ఈ డైలాగు చెప్పేసి మళ్లీ నాలో దూరిపోయింది. :D
                                       
            ఈరోజు మనం టీ కప్పు కథ విందాం . ఈ కథ వినాలంటే మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి. సరదాగా అలా టీ కప్పు కథ వినడానికి ఈ టీ బ్రేకు లో ఇంగ్లాండ్ వెళ్దాం పదండి  మరి. రెడీ నా ? ఇంకెందుకు ఆలస్యం మీ ఊహల్లో ఇంగ్లాండు లో లాండ్ అయ్యారా.. ఇంక చదివేయండి మరి..
             ఇంగ్లాండ్ లో ఒక అందమైన జంట (మనసులో అచ్చం మా లాగే అనుకుంటున్నారా ? ఏం పర్లేదు మీరలా దూసుకుపొండి) ఉండేదట. వాళ్ళకి అందమైన టీ కప్పులు సేకరంచిడం ఒక హాబి. అలా సరదాగా ఒకరోజు ఒక టీ కప్పులు అమ్మే షాపుకి వెళ్లి ఒక అందమైన కప్పుని చేతిలోకి తీసుకుని ఆవిడ తన భర్తతో ఏమండీ!ఈ టీ కప్పు చాలా అందంగా వుంది. ఇంత అందమైన దాన్ని మనం ఎన్నడు చూసి ఉండము,మనం దీన్ని ఇంటికి తీసుకెళ్దాం అని.
                అప్పుడు వెంటనే టీ కప్పు ఇలా అంది "మీకు నేను ఇలా ఎందుకు వున్నానో అర్థం కాదు." ఒకప్పుడు నేను ఎర్ర ముద్దలా, బంక మట్టిలా వుండేదాన్ని. నా యజమాని నన్ను నీళ్ళతో కలిపి బాగా తొక్కి గుండ్రంగా చట్రం పైన రౌండ్లు రౌండ్లుగా చాలా సార్లు తిప్పాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి..ఆపు!నన్ను వొంటరిగా వదిలేయ్ అని గట్టిగా అరిచాను. అప్పుడు మా యజమాని "అప్పుడే వదిలేయలేను" అని తలాడిస్తూ  చెప్పాడు.
                   నేను ఆ తర్వాత ఒక కొలిమిలో వేయబడ్డాను. నేను ఇంతకు ముందెన్నడూ అంతటి వేడిని ఎరుగను. నా యజమాని ఎందుకు నన్ను కొలిమిలో కాల్చాలనుకున్నాడో  నాకు అర్థమవలేదు. నేను కొలిమిలో నుండి గట్టిగా నన్ను బయటికి తీయి అని అరిచాను. ఆ మంటల మధ్య తన పెదవులు "అప్పుడే వదిలేయలేను"  అని అనడం గమనించాను.
                 తర్వాత చాలా సేపటికి నన్ను కోలిమిలోంచి తీసి బయట పెట్టాడు. ఇక్కడ నాకు చాలా బావుంది అని అనుకుంటుండగా నన్ను తన చేతిలోకి తీసుకుని రంగులు వేయడం మొదలు పెట్టాడు. ఆ రంగు వాసనలు చాలా భయంకరంగా వున్నాయి. వాటిని భరించలేక "ఆపు! ఆపు! ఆ రంగులు నా పైన చల్లకు!" అని అరిచాను. మళ్లీ అతను "అప్పుడే వదిలేయలేను" అని సమాధానం ఇచ్చాడు.
                రంగులు వేసాక నన్ను తిరిగి కొలిమిలో పెట్టాడు. ఇది ఇంతకు ముందు దాని అంత వేడిగా లేదు, దాని కంటే రెట్టింపు వేడిగా వుంది. నాకు చాలా ఉక్కగా వుంది అక్కడ. నేను తనని ప్రార్థించాను, ప్రాదేయపడ్డాను, ఏడ్చాను, అరిచాను బయటకు తీయమని. ఎప్పటిలాగే తన నుండి సమాధానం "అప్పుడే వదిలేయలేను" అని వచ్చింది.
               నేను ఆశలన్నిటిని వదిలేసికున్నాను. నేను ఇంక బయటపడలేనని నిశ్చయించుకున్నాను. అలాంటి సమయంలో నా యజమాని నన్ను బయటకు తీసి నన్ను ఒక అరలొ పెట్టాడు. ఒక గంట సమయం తర్వాత నాకు ఒక అద్దం ఇచ్చి నన్ను చూసుకోమన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను అద్దంలొ నా రూపాన్ని చూసుకుని నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను  "నేను చాలా అందంగా తయారు అయ్యాను మరి".
        నేను ఇక్కడ మా యజమాని నాకు చెప్పిన మాటల్ని చెప్పాలని అనుకుంటున్నాను..
నేను నిన్ను తొక్కాను, గుండ్రంగా తిప్పాను. నేను అలా చేయకపోతే నువ్వు ఒక మట్టిముద్దలా మిగిలి ఎండి పోయేదానివి . నేను నిన్ను కాల్చాను, నేను అలా చేయకపోతే నీకు ఇంత గట్టిదనం వచ్చేది కాదు, తాకితే పగిలిపోయే పదార్థంగా మిగిలిపోయేదానివి. నేను నీకు వేసిన రంగులు చెడు వాసనలని వెదజల్లి ఉండవచ్చు,కానీ నేను అలా చేయకపోతే నీ జీవితంలో రంగు లేకుండా అందవిహీనంగా కనపడేదానివి. నేను రెండోసారి నిన్ను కొలిమిలో ఎందుకు పెట్టానంటే నీకు  మరింత గట్టిదనాన్ని ఇవ్వడానికి. నువ్వు ఇప్పుడు ఒక అందమైన రూపానివి. మొదట నేను ఏదైతే నీలో చూసానో  ఇప్పుడు నిన్ను అలాగే తీర్చిదిద్దాను.
నీతి:
       భగవంతుడు మనకు కష్టాలు మనల్ని మరింత బలవంతంగా తయారుచేయడానికి ఇస్తాడు. అన్నిటిని ఎదుర్కొంటూ దైర్యంగా ముందుకు సాగిపోవాలి. 
కొసమెరుపు :
          బాసు మనల్ని OVERTIME  చేయమన్నా, సెలవు రోజు ఆఫీసుకు రమ్మన్నా మనకు ఒక రూపాన్ని ఇవ్వడానికే తప్ప అందులో వాళ్ళ తప్పు వెతకకూడదు. ఎందుకో నాకు కథ చదివిన వెంటనే ఇలా అనిపించింది :) :D 
             ఎలా వుంది టీ కప్పు కథ? వచ్చేయండి మరి తిరిగి మీ ఇంటికి. ఇంతటితో ఇంగ్లాండు పర్యటన సమాప్తం. తిరిగి ఇంకొక టపాలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం. :) (DD8 లో వార్తలు లాగా :):D ).         
గమనిక:
ఈ కథను కొత్తపల్లి పుస్తకంలో ప్రచురించారు నా కోరిక మేరకు. కొత్తపల్లి నారాయణశర్మ గారికి ధన్యవాదాలు. కథ లంకె     

Sunday, 9 September 2012

అక్షయతృతియ అగచాట్లు-2

ఇది చదివేముందు ఇంతకు ముందు వ్రాసిన టపా ఇక్కడ చదవండి.
          అదృష్టం మనల్ని వరించలేదే అని ఇలా బాధపడుతూ ..
    మేనేజరుతో నా సమావేశము ముగించుకుని పట్టు వదలని విక్రమార్కులిలాగ తిరిగి యుద్ధ భూమిలో విజయమో, వీరస్వర్గమో తేల్చుకుందామని ..అదేనండి బంగారం అమ్మబడు దుకాణనికి వీరావేశంతో బయలుదేరాం.
   సమయం రాత్రి 9.20 కు హైదరాబాదులో బంగారము ఎక్కువగా అమ్మే పంజగుట్టా ప్రాంతానికి చేరుకుని అక్కడ వున్న అన్ని షాపులు తిరిగాము..
   నా స్నెహితురాలు,నేను మొదట GRTలొ చూశాము కాని అందులో అంత చెప్పుకోదగ్గ మోడల్సు ఏమి కనిపంచకపొవడంతో దాని పక్కనే వున్న జోసాలుకాస్ వెళ్లి అబ్బే ఇక్కడ కుడా ఏమి నచ్చకపొవడంతో ఇంకో షాపులో  దూరాము. మధ్యాహ్నం ఏమి తినకపొవడం వల్ల ఒకపక్క శోష వచ్చి పడిపొయేటట్టు ఉంటే  నా స్నేహితురాలికి తన రూమ్మేట్టు మేము Khazanaలో వున్నాము. ఇక్కద మోడల్సు చాలా బావున్నాయి అని ఫొనులొ చెప్పింది. ఇంక ఆలస్యం చేయకుండా అక్కడ మాకు కావల్సినవి తీసుకుని బిల్లు వేయించుకుందామంటే  నేను సెలెక్టు చేసుకున్న  చెవి దిద్దుల బరువు దాని పైన వ్రాసి వున్న దానికి సరిపొలేదు.. మీరు కొంచెం ఎక్కువ పే చేసి తీసుకుంటారా? అని అడిగితే, అలాగే  కానిమ్మని నేను బిల్లు చెల్లించడానికి రెడి అయ్యాను. ఇంతలోపు లొపల నుంచి ఒక ఆయన వచ్చి నేను సెలెక్టు చేసుకున్నది బిల్లు వేయడానికి సమయం పడుతుందని చెప్పి రేపు వచ్చి తీసుకోండని సలహా ఇచ్చాడు.
      అప్పటికి సమయం 11 కావస్తోంది. మళ్లి ఇంటికి వచ్చి చేతులు కాల్చుకునే ఓపిక లేక కడుపు కాల్చుకుని పడుకున్నాము. అలా నన్ను అక్షయతృతియ రోజు అదృష్టం వరించకపొయినా తర్వాతి రోజు వెళ్లి నేను సెలెక్టు చేసుకున్నవి కొనుకున్నాను. నన్ను ఆశ్చర్యపరచిన విషయమేమంటే హైదరాబాదులో సగటు వ్యక్తికి చేతిలో డబ్బు  వుండి కూడా ఒక వస్తువు  కొనలేకపోయాడంటే డిమాండ్ తగ్గ supply లేదనుకోవాలో... జనాలు బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి అంత ఉత్సాహపడుతున్నారో నాకు అర్థం కాలేదు.


Thursday, 6 September 2012

అక్షయతృతియ అగచాట్లు

అక్షయతృతియ అనగానే మనందరికి గుర్తుకు వచ్చే విషయం బంగారం కొనడం. ఎందుకంటే నాకు తెలిసింది అదొక్క విషయమే ఈ పండగ గురుంచి.
     జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా చప్పగ సాగిపొతోంది.. నా జీవితంలొ కుడా అదృష్టం కలిసి వచ్చి మా మేనేజరు పోస్టుకో (ఇది అత్యాశ అయితే..)కనీసం మా టీం లీడ్ పోస్టుకో గండి కొట్టాలంటే నా దగ్గర సరైన అయుధం ఏమి కరువైందో అని  బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే నా స్నేహితురాలి దగ్గరి నుంచి ఫోను వచ్చింది..విషయం ఏంటంటే అక్షయతృతియ రోజు నువ్వు నాతో పాటు తోడుగా బంగారం కొనడానికి వస్తావా అని..ముందుగానే మీ బాసు గాడిని అడిగి permission తీసుకో అని ఫోను పెట్టేసింది. నేను బాసు గారి ముందు ఎలా నటించాలో, ఎలా తన చెవిలో పువ్వులు పెట్టాలో ఆలోచించుకుంటూ వుండగా మా బాసు గాడి దగ్గరి నుంచి mail.. నేను permission తీసుకోవాలి అనుకుంటున్న రోజున  సాయంత్రం 6.30-8.30 వరకు నీ work progress discuss చేద్దాము అంటూ.. నా పరిస్థితి మూలిగే నక్క పైన తాటికాయ పడ్డట్టు  అయిపోయింది. ఎంతో రిహార్సల్స్ చేస్తే అసలు నా నటనా కౌశలం (నా రిహార్సల్స్ గురించి చెప్పడానికి ఈ మాత్రం బరువున్న పదం అవసరమని వాడాను :)) ప్రదర్శించడానికి వీలు లేకుండా అంతా వృథా అయ్యిందని బాధపడుతూ mailకి జవాబు ఇచ్చాను ఇంక చెసేదేమి లేక..
ఇంటికెళ్లి అలోచిస్తే ఒక మెరుపు లాంటి idea వచ్చింది..lunch breakను  ఉపయోగించుకోవచ్చు అని,నా స్నేహితురాలికి ఫోను చేసి అసలు విషయం చెప్పి రేపు మనం lunch breakలో వెళ్దాం అని ఒప్పించాను.
              ఇంతకు ముందు ఎన్నడూ మా ఇద్దరికి బంగరం కొన్న అనుభవం లేదు. అయినా అలా కనపడకూడదు మనం అని:) బయలుదేరాము. మొదట మనకు బంగారం నా హక్కు అని నొక్కి వక్కాణించిన నాగార్జున పుణ్యమా అని కళ్యాణ్ జ్యువెలర్స్ కి వెళ్లాము. తలుపు తోసుకుని లోపలికి వెళితె ఒక అశ్చర్యం కౌంటర్ల దగ్గర చీమ కుడా దూరనంత జనం. మేము వచ్చింది చేపల మార్కెట్టుకి ఏమో అని అనుమానపడి ఒకసారి నన్ను నేను గిల్లుకుని చుసి బంగరాము అమ్మే షాపు అని confirm చేసుకుని.. మాకు చెవిదిద్దులు కావాలి ఏ కౌంటరుకి వెళ్లాలి అని అక్కడున్న అబ్బాయిని  అడిగితే.. మీరు పై అంతస్ఠుకి వెళ్లి అడగండి అని  మర్యదాగా సమాధానం చెప్పాడు. అక్కడ మాకు వెంటనే ఒక అనుమానం వచ్చింది. మనం కొనవలసింది 22 కారెట్ల లేదా 24 కారెట్లా అని? వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ఎవరికీ వినిపించనంత తగ్గు గొంతుతో ఏది కొనాలి? అని అడిగితే మా అమ్మ 22 కారెట్లు అని చెప్పింది. మా అమ్మ చెప్పకపోతే నేను ఖచ్చితంగా 24 కారెట్ల బంగారమే కొనేదాన్ని. ఏంటి అలా నవ్వుతున్నారు.. అంతేనండి !! మొదటిసారి బంగారం కొనాలనుకున్న అనుభవం:D :D
             పైకి వెళ్లి చూస్తే బోలెడు మంది జనం. ఇంకా మాకు కొంచెం సమయం మాత్రమే వుందని తెలుసుకుని counter దగ్గర మాకు కొంచెం చోటు సంపాదించి మొదటి విజయం సాధించాము.మాకు ఏవి కావాలో ఒక నాలుగు జతలు సెలెక్టు చేసుకుని sales boy కోసం చూస్తుంటే షాపులో అందరు sales boys ఒక్కొక్కరిగ జారుకుంటున్నారు..ఏంటి బాబు?అవి చూపించు అంటే, ఇప్పుడు lunch break అని చల్లగా సమాధానం చెప్పి మేము వేసె మరొక ప్రశ్న వినకుండా వెళ్లిపొయాడు. ఇంకొక 30 నిముషాల సమయం మ దగ్గర లేకపొవడంతో నిరాశగ వెనుదిరిగాము.

          మేము వెనుదిరిగి వస్తుండగా మా చెవిలో పడిన కొన్ని కామెంట్లు..నాగార్జున అలా advertisementలొ చెప్తే ఇలా వచ్చాము కాని..ఇక్కడ పట్టించుకునే నాధుడే లేడు. బంగారము నా హక్కు అంటే నాగార్జున హక్కు  మాత్రమెనేమో:)..అంతటి రేంజు వుంటే తప్ప వాళ్లు మనల్ని పట్టించుకోరని.. 
ఒక వేసవి మధ్యాహ్నం సూర్యుని ప్రతాపానికి మల మల మాడి అకలితో కడుపులోని పేగులు అరుస్తుండగా తిరిగి ఆఫేసులో వచ్చిపడ్డాను..
ఈ మధ్య FM లో ఒక ప్రకటన,"ఇప్పుడు నమ్మకానికి చిరునామా రెండు చోట్ల అని" అంటే అసక్తిగా వింటే ఆ ప్రకటన దీని గురుంచే అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు :) :)
P.S:  దీనిని ఎవరూ personalga తీసుకోకూడదని మనవి.వ్రాస్తూ వుంటే టపా పెద్దదయ్యిందనిపించి పార్టులుగ వ్రాద్దామని నిర్నయించుకున్నాను..