Thursday, 30 May 2013

నేను ఈరోజు

        మా ఊర్లో ప్రతి వైశాఖ మాసంలో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చవితి రోజు రథోత్సవం జరుగుతుంది. దాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వీలు చేసుకుని మరీ వెళ్తుంటాం. ఈ సారి కూడా నేను మా ఊరు వెళ్లివచ్చాను. 
         ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేసరికి ఇంటి పైన చాలా బెంగగా ఉంది. నేను హాస్టల్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇప్పటికి ఇంటికి వెళ్లి వస్తే చాలా బెంగ. చదువుకునే సమయంలో అయితే మన స్నేహితులు, మనం చదవాల్సిన పాఠాలు అని బోలెడు పనులు ఉంటాయి కాబట్టి బాధపడటానికి అంత  తీరిక ఉండదు. మరి ఇప్పుడో అలా కాదు, బోలెడంత సమయం కదా.. అందులోనూ చదువుకునే రోజుల్లో అయితే ఎంత బెంగ ఉన్నా దాని  ప్రభావం చదువు పైన పడకుండా జాగ్రత్త పడేవాళ్లం.              
                పిచ్చుక గూళ్ల లాంటి ఒక గదిలో ముగ్గురం ఉంటాం. వీలయితే మా కళ్లు టి.వి కి, లేదంటే మా లాప్టాప్ స్క్రీన్లకు అప్పగిస్తాం.మొదట్లో ఇలా ఉండాలని తెలియక నేనే చాలా కబుర్లు చెప్పెసేదాన్ని.. కానీ మా రూములో ఉన్న మిగతా ఇద్దరికీ అది నచ్చలేదు.ఇక అప్పట్నుంచి నేను కూడా పెద్దగా మాట్లాడటం మానేసాను.అయినా మనసుకి నచ్చాలి మాట్లాడాలంటే.. ఏదో మొహమాటానికి పెదవుల పైన వికారపు నవ్వు నవ్వుతూ ఎంతసేపని నన్ను నేను కష్టపెట్టుకోవటం అని మాట్లాడటమే తగ్గించేసాను. ఆఫీసు నుంచి రూముకి రాగానే వీలయితే టి.వి చూడాలి, లేదంటే లాప్టాప్. ఇంతకు మించి ఒక్క పని ఉండదు. ఆశ్చర్యమేమంటే నేను ఇంటికి లాప్టాప్ తీసుకెళ్ళినా ఒకసారి తెరవడానికి కూడా సమయం దొరకలేదు, అంత తీరిక కుడా లేదు.  
                   ఉన్న నాలుగు రోజుల్లో మొదటిరోజు ప్రయాణపు బడలికతో విశ్రాంతి తీసుకుంటే, తరువాతి రోజు మా అమ్మ కజ్జికాయలు చేసే ప్రోగ్రామ్ పెట్టేసింది. ఆ పనితో ఆ రోజు గడిచిపోయింది.తరువాతి రోజు బూజులు దులపాలి పండగ కదా అని ఆ పనికి పూనుకుంది. మరీ అమ్మ ఒక్కత్తే కష్టపడుతుంటే మనం చూస్తూ ఉండలేము కాబట్టి ఆరోజు అలా గడిచింది. చివరి రోజు అంటా పండగ హడావుడి. ఆరోజు మళ్లీ బబ్బట్లు చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాం.ఇలా నాలుగురోజులు తీరిక లేకుండా సెలవులు గడిచిపోయాయి.
               ప్రతిసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. కానీ తిరిగివచ్చే రోజు ఏదో తెలియని బెంగ,బాధ మనసులో ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మా,నాన్నలకు దూరంగా ఉండటం అని.ఉద్యోగం రాక మునుపు ఇంటి మీద బెంగ అన్నా కూడా ఇంట్లోవాళ్లు ఏమి కాదులేమ్మా!! బాగా చదువుకో అని చెప్పి కర్తవ్యo గుర్తుచేసేవారు. మ్మ్..ఇప్పుడు అంత బెంగగా అనిపిస్తే పంచుకోవడానికి దగ్గరి స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్లని మాటిమాటికి ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టాడానికి మనసు రాదు. ఇక నా గోడు ఎవరైనా వింటారు అంటే అది నా దిండు మాత్రమే..
                  ఇక్కడ ఐదు రోజులు పని చేసి, రెండు రోజులు పని లేకుండా హాస్టల్లో ఏమి చేయాలో తోచక.. అసలెందుకు రా ఈ ఒంటరి ప్రాణానికి ఈ సెలవులు అని విసుగొస్తుంది,పోని  రెండురోజులు సెలవులున్నాయి కదా ఇంటికెల్దామా అంటే 12 గంటల సుదీర్ఘ ప్రయాణం. అంత దూరం ప్రతి వారం ప్రయాణం చేయలేను. నాకైతే నిజం చెప్పాలంటే ఏ డిగ్రీయో ఇంటిపట్టునే ఉండి చదివి, ఎలాగోలా కష్టపడి ఒక టీచరు ఉద్యోగం సంపాదించేసి సంతోషంగా రోజు ఇంటి నుంచే వెళ్తే ఎంత బావుండేదో అని అప్పుడప్పుడు పగటికలలు కంటూ ఉంటాను. అయినా ఇప్పుడు వేలకు వేలు సంపాదించి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నిజంగా సంతోషంగా ఉన్నట్టా?? అసలు రోజు అమ్మ చేతి కమ్మని వంట తింటూ.. ఇంటి నుంచే ఉదయం పదింటికి బయలుదేరి సాయంత్రం ఆరింటికల్లా మళ్లీ ఇల్లు చేరుకునే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు నా దృష్టిలో గొప్ప అదృష్టవంతులు. నేను ఎవర్నైనా చూసి ఈర్ష్య పడుతాను అంటే అసలు హాస్టల్ మొహమే మేము ఎరుగము అని కొంతమంది చెప్పినప్పుడు..ఈ ఇంటి మీద బెంగ ఎప్పటికి తగ్గుతుందో నాకర్థమవట్లేదు.ఈరోజే మళ్లీ సెలవు ఎప్పుడు పెట్టి ఇంటికి వెళ్లాలా అని ప్లాను వేసుకున్నాను. :)
                                       

Wednesday, 22 May 2013

అనగనగా యువరాణి

                   మ్మ్ ఏంటో ఈ జీవితం చడి,చప్పుడు లేకుండా చప్పగా, అప్పుడప్పుడు కొన్ని కష్టాలతో.. అప్పుడప్పుడు జీవితం అంటే ఇంతేనా అని అనిపించే విధంగా సాగుతూ నిజం చెప్పాలంటే సాగుతూఊఊఊఊఊఊఊఊఉ ఉంది. ఏం చేస్తాం మనం కూడా దానితో పాటే సాగాలిగా...ఈ సాగింపు చర్య ఏంటీ అంటారా ?? మనం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాలి మరి..
     అనగనగా ఒక పేద్ద సాఫ్ట్వేర్ కంపెనీ.. అందులోకి ఒక బుల్లి యువరాణి..ఎవరా అని బుర్ర బద్దలుకొట్టుకోకండీ(నేనే మరి)..మరేమో నేను యువరాణి కదా అందుకని నాకు మొదట్నుంచి ఆటలో అరటికాయ టైపులో అందరు చిన్న చిన్న పనులు చెప్పి నా చేతులు కందకుండా గారాభంగా చూసుకున్నారు..ఇలా యువరాణి వారు రోజు ఆటవిడుపు కోసం ఆఫీసుకు రావడం నచ్చని మంత్రివర్యులు(మెనేజరు) వారు మెల్లిగా ఈ విషయాన్ని రాజా(డెలివరి మెనేజరు) వారి చెవిలో ఊదేసారు. పాపం కొంచెం ఘాట్టిగానే ఊదారేమో చెవి కందిపోయి దానికి వెంటనే చర్య తీసుకునేలా హుకూం జారీ చేసారు..

             మరి యువరాణి వారికి ఈ విషయం తెలియగానే ఎలా స్పందిస్తారో అని రాజా వారు తటపటాయించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, యువరాణి!! మీరు ఆడి,ఆడీ పాడు చేసినది చాలు మా శీఘ్రగణనయంత్రమును..మీరు వెరక చోటికి వెళ్లి ఆడుకొనుము..(గూడార్థము మీరింకొక ఉద్యోగమును వెతుక్కొనుము అని)..వెంటనే వూహించని ఈ పరిణామమునకు యువరాణి కనులలో నుంచి జాలువారు అశ్రువులను నియంత్రించుకుని, నన్ను ఒక జట్టుతో కలిపి చూడుడి, నా ప్రతిభను చూపించెదను అని మంగమ్మ శపతమును పూనిన వెంటనే.. మిక్కిలి ఆనంద భరితుడైన రాజా వారు నన్ను ఒక గుంపులో చేర్చిరి..(ఏ గుంపు అనా మీ అనుమానం, నా లాంటి అరటికాయలందరి గుంపులో :) ) మీరు ఇప్పుడు అందరి చేతా పరీక్షంచబడి ఒకరి చేత ఎన్నుకోబడతారు..అయితే ఒక నియమము అని ఒక రహస్యమును నా చెవిలో వేసినారు..అది ఏమనగా ఒక్క 30 రోజులు మాత్రమే ఈ అవకాశముండును, మీరు ఎవరి చేతా ఎన్నుకోబడని యెడల మీరు వేరోక రాజ్యానికి తరలి వెళ్ల్లవలే అని కటినముగా చెప్పినారు..

            మిక్కిలి దుఃఖముతో యువరాణి అయిన నేను అప్పటి దాకా ఆడిన ఆటలు, చేసిన సాహస కృత్యాలు ఒకసారి నెమరు వేసుకుని అదిగినా వారందరికి అవే సమాధానాలు చెప్పి చెప్పి నాకు కలలో కూడా అవి మాత్రమే వచ్చుచుండెడివి కొన్ని దినములు.. :D ఇందులో నేను ఎదుర్కొన్న సమస్య ఏమనగా అందరూ నువ్వు ఏ సమయమునైనా నీ తిండి,నిద్ర మాని మరీ ఆడుకొనెదవా అని అడుగుచుండేవారు :( నేనసలే యువరాణిని అలా నేను ఆడలేనని కొంతమంది గుంపులో చేరలేకపోయాను. నాకున్న పరిఙ్ఞానముతో నేను ఒక గుంపులో చేరుటకు చాలా ఉత్సాహమును చూపి ఉంటిని.. ఆ విషయము కూడా మరిచిపోయి ఉంటిని,కానీ ఒక గుంపు యొక్క ప్రతినిధి వచ్చి మీరు ఆరోజు మాకు మాట ఇచ్చితిరి మా గుంపులో చేరెదమని.. ఆడిన మాట తప్పరాదు యువరాణి అని చెప్పడంతో హతాశురాలై నాకు ఇంకొక్క అవకాశం ఇచ్చిన నేను ఇంతకన్నను మంచి గుంపులో చేరెదను అని మొహమాటము లేకుండా చెప్పితిని.అయినను ఆ ప్రతినిధి నన్ను బలవంతముగా తమ గుంపులో చేర్చుకొనినారు.అప్పటివరకు నేను ఒక గాజుగదిలో ఉండేదాన్ని(private restricted area).అలాంటి నన్ను తెచ్చి ఒక గుంపులో కలిపి అందరితో పాటు రెండు కుర్చీల మధ్యలో ఇరికించి నువ్వు ఇక్కడే కుర్చోవాలి అని మొదటి ఆఙ్ఞ జారీ చేసారు..నా చేతిలో ఏమీ లేకపోవడంతో అలాగే కూర్చుని ఆ పరిసరాలకి అలవాటుపడుతూ ఉండగా నన్ను ఇంతకు ముందు గుంపు ప్రతినిధి పిలిచి నువ్వు వేరొక గుంపులో చేరితివి, అయినను ఇచ్చటనే కూర్చుని కాలక్షేపము చేయుచున్నావు. వెంటనే నువ్వు నీ గణనయంత్రమును మాకు అప్పగించి మీ గుంపుతో కలిసి కూర్చొనవలెను అని ఆఙ్ఞాపించిరి:(  అది కూడా రెండు దినములలో..దీని కొరకై మా గుంపు ప్రతినిధికి ఒక 20 లేఖలు(mails) పంపిరి.ఇక గతిలేక నేను ఆ చోటు ఖాళి చేసి నిరాశ,నిస్పృహలతో ఆ చోటుని విడిచి నా ఆటవస్తువులని అన్నిటిని సర్దుకుని కొత్త ప్రదేశానికి తరలి వచ్చితిని. కొత్త చోటు మరీ ఇబ్బందికరంగా ద్వారము మొదట్లో ఉండటం మూలంగా అటు,ఇటు తిరిగే వాళ్లు నా గణన యంత్రము వైపు ఒకసారి పరికించి వెడుతున్నారు,చాలా ఇబ్బందికరముగానున్నది. అంతేకాకుండా నాతొటి ఆడి, ముచ్చట్లు చెప్పే చెలికత్తె నాకు దూరముగానున్నది.   
               I miss my friend,place and that restricted private area :(
          వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా నిజంగా యువరాణిలా ఉండాలని అనుకుంటున్నాను..
         
                 

Wednesday, 15 May 2013

మనసుల గారడీ(కథ)

                 పోద్దున్నే కళ్లు తెరవడానికి రావట్లేదు. రాత్రంతా ఏదో జరిగినదని తెలుస్తూనే ఉంది కానీ అది బుర్రలోకి వచ్చి అది కాస్తా కళ్లలోంచి సన్నటి నీటిధారగా బుగ్గల మీదుగా ఒలికిపోయింది
                     రాత్రి స్వప్నకు,వంశీకు మాట మాట పెరిగి ఇలా తను ఇంతలా బాధపడుతుంది అనుకుంటూ వంశీ అన్న మాటలకి జీవితం పైన విరక్తి కలిగి అప్పుడే బిల్డింగ్ పై నుంచి దూకో, ఫ్యాన్ కు ఉరేసుకునో చావాలనిపిస్తుంది. ఇదే శపథం రాత్రి వంశీ దగ్గర చేసినా తన నిస్సహాయతను, చేతకానితనాన్ని తలుచుకుని ఇంకా కృంగిపోయింది. చావాలనిపిస్తుంది కానీ అంత ధైర్యం లేదు. అలా అని రోజు ఈ మానసిక సంఘర్షణ అనుభవిస్తూ బతకాలని కూడా అనిపించట్లేదు. ఈ విషయం అమ్మ,నాన్నలతో చెప్పలేను, ఎందుకంటే వాళ్లకి అసలు వంశీ అంటే ఎవరో తెలియనే తెలియదు. ఇంక అక్కతో ఈ విషయం గురించి ఒకసారి చెప్పినా, నువ్వు ఏదైనా చేసేముందు నాకెందుకు చెప్పవూ అంది. ఎటు నుంచి చూసినా తప్పు నాదే స్పష్టంగా తెలుస్తుంది.
                     కళ్లు మూసుకుని ఒకసారి జరిగిన దాన్ని తలుచుకుంది. మార్చి  ఒకటో తేది..వంశీ పుట్టినరోజు, తను ఎంత బతిమిలాడినా వినకుండా నాకు ఇంట్లోనే పుట్టినరోజు చేసుకోవడం అలవాటు అని వెళ్లిపోయాడు, తన కోసం చేసిన గ్రీటింగ్ కార్డ్ కూడా తీసుకోకుండా నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను అని ట్రైన్లో నుంచి చేయి ఊపుతూ ఇంటికి వెళ్లిపోయాడు. మనసులో కొంచెం నిరాశగా అనిపించింది.మార్చి ఒకటో తేది అనుకోకుండా స్వప్న స్నేహితుడు వినయ్ ఏదో పని ఉండి స్వప్న ఆఫీసువైపు వచ్చి అలాగే తనని కలుస్తానని ఫోన్ చేసాడు.. వినయ్ అంటే చిన్నప్పటి తనతో పాటు కలిసి చదువుకున్న అబ్బాయి. ఈ మధ్య తను ఊరెళ్తే కనిపించి తను కూడా బెంగళూరులోనే ఉన్నానని చెప్పి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
              ఇక అనుకోకుండా వస్తానని చెప్పడం వల్ల తను నేరుగా ఆఫీసు దగ్గరికి వచ్చి కలవమంది. తను రాగానే విజిటరుగా వాళ్ల క్యాంటీను వరకు తీసుకెళ్లింది అంతకు మించి ఏం చేయాలో అర్థమవక. ఆ తర్వాత వినయ్ చొరవగా ఇక్కడ దగ్గర్లో ఏదైనా థియేటరు ఉంటే సినిమాకు వెళ్దామా అని అనగానే, స్వప్న సంశయిస్తూనే సరే అంది. అది జరిగిన తర్వాత వినయ్ తన మైలు ఐడి ఇచ్చి కొద్ది సేపు మాట్లాడమని అడిగాడు. వంశీ గురించి తను కలిసినప్పుడు వివరంగా చెప్పినా తనతో చాట్ చేసేటప్పుడు తనంటే ఇష్టమని వినయ్ చెప్పాడు. స్వప్నకు ఏం చేయాలో పాలుపోలేదు.  నాకు చిన్నపటి నుంచే ఇష్టం , కానీ ఆ విషయం అప్పుడు చెప్పడనికి అంత వయసు లేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నా అని చెప్పాడు.ఈ విషయం అంతటితో వదిలేసి వినయ్ తో మామాలుగా మాట్లాడింది.వంశీ ఊరి నుంచి రాగానే వినయ్ కలిసాడని చెప్పింది కానీ తనతో పాటు సినిమాకి వెళ్లానని చెప్పలేకపోయింది.
                  ఒకరోజు వంశీ ఫోన్లో తన ఐడి, పాస్స్వర్దుతో మైలులోకి లాగిన్ అవడానికి ప్రయత్నించింది, కానీ  అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడంతో లాగిన్ అవలేకపోయింది. వంశీ,తను ఆరోజు రాత్రి భోజనం చేసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. వంశీ ఇంటికి వెళ్లి తను మొబైలులో మైలు తెరవడానికి ప్రయత్నిస్తే స్వప్న మైలు తెరుచుకుంది, తెరుచుకోగానే ఏమున్నాయో అని చూసి, వెంటనే స్వప్నకు ఫోను చేసి వినయ్ ఎవరు? అని అడిగాడు, స్వప్న నువ్వు నా మైలు చూసావా అని అడిగింది?
                           వంశీ వెంటనే నీ లాగా ఎవరి బైకో ఎక్కి, వాళ్లతో సినిమాలు చూసే దాన్ని నేను పెళ్లిచేసుకోవాడానికి రెడీగా లేను అని ఆవేశంగా నేను ఇప్పుడే నీ మైలు, ఫోను నంబరు అన్ని బ్లాకు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి దాక నేను నాకు అమ్మాయిల పైన నమ్మకం లేదని చెప్పేవాడిని, కానీ ఇప్పుడు చెప్తున్న నీ పైన నమ్మకం లేదు.స్వప్న తనదే తప్పని తెలుసుకుని వంశీ వాళ్ల ఆఫీసు దగ్గరికి వెళ్లి ఉదయం, సాయంత్రం తన కోసం చూసేది ప్రతిరోజు. తను చేసిన తప్పుకు క్షమించమని కాళ్ల మీద పడి వేడుకుంది. అదే విషయం వంశీతో చెప్తే కాళ్లు పట్టుకోవడం పెద్ద విషయమేమి కాదు అని అన్నాడు.
      ఇంకొకరోజు వంశిని క్షమించమని  అడిగితే.. చూడు, నేను ఈరోజు మా ఆఫీసులో మా కోలీగ్లలో పదిమంది అమ్మాయిలని అడిగాను సినిమాకు వెళ్దామని, అందరూ ఎందుకు రావాలి నీతో అని అడిగారే కానీ నీలాగా అడిగిన వెంటనే ఎవరూ రాలేదు, అందరి అమ్మాయిలలోకి నీవే తేడా..ఆ విషయం ఇప్పటికైన తెలుసుకో అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత స్వప్నకు చాలా బాధగా అనిపించింది. తను తొందరపడి చేసిన తప్పుకు జీవితాంతం శిక్ష పడిందనుకుంది, తను చేసిన తప్పు వల్ల జీవితాంతం తనతోపాటు కలిసి ఉండాల్సిన వ్యక్తిని కోల్పోయింది అని అనుక్షణం కృంగిపోతోంది.
                            ఈ కథలో నిజంగా స్వప్న తప్పు చేసిందా? స్వప్న అనుభవించే శిక్ష సరైందా?
                
                             

Wednesday, 8 May 2013

సరదాగా---My Exam experience

                  జీవితం సాఫీగా,ఒకేరకమైన దినచర్యతో సాగిపోతుంటే ఏదో కోల్పోయామన్న భావం కలుగుతుంటుంది. అలా నేను కూడా రొటీన్ గా ఫీల్ అయ్యి మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి బదులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే మన జీవితానికి ఇక ఏ ఢోకా ఉండదనుకుని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ఏదో పిఓ ఉద్యోగాలకు ఒక పరీక్ష పెడుతున్నారని చివరాఖరి వారంలో తెలుసుకుని నేను తీరిగ్గా చివరి తేదికి ముందు దానికి అప్ప్లై చేశాను.
          అసలే మనం ఏం చేసినా దరిద్ర దేవత వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. సో నేను ఆన్ లైన్లో అప్ప్లై చేయగానే నాకు ఆ సైట్లో సమస్యుందని ఒక సందేశం నా కంప్యూటర్ పైన కనబడింది. అయినా మనకు ఇంక హాల్ టికెట్టు ఎలాగు రాదనుకుని ఊపిరి పీల్చుకున్నాను.. కొద్ది రోజుల తర్వాత నా బ్యాంకు అక్కౌంటులో డబ్బులు జమ కాకపోవడంతో ఏదో తేడా జరిగందనుకుని ఇంక ఆ విషయం అంతటితో మర్చిపోయాను.
           ఒక శనివారం మధ్యాహ్నం పని పాటా లేకుండా తీరిగ్గా ఏం చేయాలో తెలియక మా గది పైకప్పు వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా మొబైల్ వైబ్రేట్ అయితే ఏదో మెస్సేజ్ వస్తే ఏదో పిచ్చి మెస్సేజ్ అని డిలీట్ చేయబోయి..ఎందుకో చూస్తే ఏముంది?!ఎస్.బి.ఐ వారి నుంచి హాల్ టిక్కెట్టు పంపించామని సందేశం. రెండు వారాల ముందు ఈ విషయం తెలిసినందుకు నవ్వాలో,ఏడ్వాలో అర్థమవక ఆ నిముషంలో నవ్వుకుని పుస్తకాలు దుమ్ము దులిపి చదవడం ప్రారంభించాను.
           ఇక పరీక్షకు చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఒకటే కలలు.. పరీక్ష సెంటరుకి ఆలస్యంగా వెళ్లానని.
ఎందుకంటే ఉదయం ఎనిమిదింటికి అని ఒక భయం..రోజు బారెడు పొద్దెక్కినా కళ్లు తెరవని నాకు ఆ భయంతో రోజు అలాంటి కలలే వచ్చేవి..:( ఎందుకైనా మంచిదని మా అమ్మకు ముందే చెప్పి పెట్టాను, ఎలా అయినా లేపమని..పరీక్ష ముందురోజు రాత్రి ఎంతసేపటికి నిద్రపట్టదు,ఒక లాంటి ఆతృత ఎగ్జాం ఎలా వ్రాస్తానా అని.. అయినా ఏమి ప్రిపేర్ అవ్వకుండా వ్రాసే నాకే ఇలా ఉంటే ఇంకా దాని కోసం రాత్రి,పగలు కష్టపడే వాళ్ల గురించి తలుచుకుని నా హంగామాకు తెగ నవ్వుకున్నాను.ఉదయం నాలుగింటికే లేచి ఒకసారి అన్ని మననం చేసుకుని తయారయ్యి చూస్తే ఎంతసేపటికి నేను ఎక్కవలసిన బస్సు రావట్లేదు :( మా స్టాపులోనే ఒక 25 మంది ఎక్కారు. అయినా ఈ సాఫ్టువేరుల పైన జనాలాకి ఎంత నమ్మకముందో అప్పుడు అర్థమైంది. నిలబడడానికి చోటు లేదు..అలా చచ్చి చెడి ఎగ్జాం సెంటరుకి చేరుకున్నాను..
               నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు, రెండు వారాల ముందు చదివితే ఇలాగే ఉంటుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుని వెళ్లాను. పరీక్ష సెంటరు దగ్గర అందరూ తెగ పుస్తాకాలు చదువుతున్నారు, నాకు అప్పుడే పరీక్ష పేపర్ ఏమైనా లీక్ అయ్యిందేమోనని అనిపించింది. నేను కూడా నా పక్క అమ్మాయి పేపర్లోకి తీక్షణంగా చూసాను, ఆ అమ్మాయి సరే అని నా వైపు ఒక జాలి చూపు విసిరి నాకే ఆ కాగితం ఇచ్చి చదివేసి ఇచ్చేయ్ అంది.  నా నంబరు ఉన్న గదికి వెళ్లి చూస్తే ఒక నంబరు తప్పుగా వేసి బోర్డు పైన అందరిని హడలగొట్టారు.
                              పరీక్షకి వెళ్లి చూస్తే అప్పటికప్పుడు చదివిన వాటిలోంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. అయినా ప్రశ్నాపత్రం ఇంత సులభంగా వస్తే మనకు ఇంత పోటిలో వస్తుందా అనే అనుమానం ఇప్పుడు...17 లక్షల మంది పోటిపడితే అందులో ఒక 4500 మందిని మాత్రమే తీసుకుంటారు, అయినా కానీ మనిషి ఆశజీవి అని అనడానికి నేనే ఒక ఉదాహరణ:)లేకపోతే ఈ లోకంలో మన మనుగడ కష్టమవుతుందెమో ఇలాంటి ఆలోచనతత్త్వం లేకపోతే కొన్ని  సమయాల్లో:) కానీ ఇంకా బాగా వ్రాసుండాలి అని అనిపించింది. ఏం చేస్తాం ఆ బుద్ధి ముందుండాలి కదా!!!