Showing posts with label హాస్టల్ కబుర్లు. Show all posts
Showing posts with label హాస్టల్ కబుర్లు. Show all posts

Thursday, 29 November 2012

హాస్టల్ కబుర్లు-2(Doggie)

         నా ఇంటర్మీడియట్ కబుర్లు ఇంతకు ముందు ఒక టపాలో పెట్టాను. చదవనివాళ్లు  ఇక్కడ నొక్కి ఆనందించండి. వహ్వ.. నీ టపాలోనే నీ పాత టపాకు లింకు పెట్టి నీ బ్లాగ్ క్లిక్లు పెంచుదామనా??!! మీరలా అనుకోరని నాకు తెలుసుగా :P .. ఒకసారి అది కూడా చదివి దీన్ని దానికి కొనసాగింపుగా చదువుకోండి. అమ్మో!! దుర్మార్గురాలా!!! నీ కుట్ర మాకు తెలుసు.. అని మనసులో మీరసలు అనుకోవట్లేదు. అది నాకు తెలుసండి. అయినా గాయం సినిమా చూడకుండా గాయం-2 ఎలా చూస్తారు?? లాజిక్ పట్టేశారు. వెనక నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి..అసలు రెండూ చూడమంటారా!!!!.. మీకు అయితే భూత్ సినిమాని వేసి కుర్చీలో మిమ్మల్ని కదలకుండా కట్టేసి చూపించాల్సిందే.. మరి ఆర్జివి నా?మజాకా?
                           ఇంక అసలు విషయానికి వస్తే ఒక దుర్ముహుర్తమో,సుముహుర్తమో తెలియని సమయాన మా కాలేజీలోఅడుగుపెట్టాను.మొదటిరోజు మొదటి పంచ్ మా సుభాషిణి మేడం చేతిలో పడింది నాకు . ఒక చోట డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ మా అన్నయ్య వేసినందుకు "చదివేది మీరా?మీ చెల్లా?" :D అది అయిపోయిన తర్వాత  మా నాన్నగారు, వార్డెన్ ల మధ్య అప్పగింతల కార్యక్రమం యథావిధిగా నా కన్నీళ్ళతో ముగిసింది. మా వార్డెన్ అంటే ఆషామాషి వార్డెన్ కాదు. అందరిని హడలుగొట్టించే టైపు అన్నమాట. ఆమె పేరు రాజకుమారి. పేరుకు తగ్గట్టు పెళ్లి చేసుకోకుండా కుమారిగా ఉండిపోయింది. నల్లగా, 6 ఫీట్ ఉంటుంది, అరవం ఆమె(tamilian) . హాస్టల్లో నిజంగానే ఒక రాజకుమరిలా ఉన్న సదుపాయాలన్నీ ఉపయోగించుకునేది. ఈమె ముందు ఎవరూ కూర్చోకూడదు. వంగి వంగి దండాలెట్టాలి. అమ్మో!! ఇలాంటి వార్డెన్లు ఉన్నంత వరకు తమ పిల్లల్ని హాస్టల్లో చేర్పించిన కన్నవాళ్ళు సంతోషంగా నిద్రపోవచ్చు. ఈమెని వార్డెన్ అని మాత్రం అని ఎవరూ అనకూడదు. గౌరవంగా madam అని పిలవాలి.కాని ఈమెకి మేము పెట్టుకున్న ముద్దు పేరు డాగీ(doggie). ఎందుకంటే ఉదయాన్నే మేము కాలేజీకి వెళ్ళే ముందు, వచ్చే ముందు మా గేటు దగ్గర కుర్చీ వేసుకుని నిజమైన గ్రామ సింహంలా కాపలా కాసి ఆమెకు పెట్టిన పేరు సార్థకత చేసుకునేది.ఎవరైనా ఆలస్యంగా రావాలి, వాళ్ళను ఆ వాకిట్లోనే కంటనీరు పెట్టించేసి తెగ భయపేట్టేది. మా హాస్టల్లో ఉన్నన్ని నియమాలు(rules) ఇంకెక్కడా ఉండవు. ఈ కాలంలో కూడా మొబైల్ వాడటానికి అక్కడ అనుమతి ఉండదు. ఎవరూ కూడా డెస్క్టాపులు, లాప్టాప్లు ఉపయోగించడానికి వీల్లేదు. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే మా కళాశాల ఆవరణం మొత్తం wi-fi సౌలభ్యం ఉంటుంది. హాస్టల్ పిల్లలకు మాత్రం సదుపాయం ఉండి ఉపయోగించలేని నిస్సహాయత :((. 
               మాకు ఒక 5 పాడుబడ్డ ప్రాచీనకాలం నాటి కంప్యూటర్లు ఉండేవి,అవి హాస్టల్ యాజమాన్యం పెట్టినవి. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. కేవలం మేము programmes చేసుకోవడానికి కావాల్సిన software మాత్రం install చేయబడి ఉంటాయి. అది కూడా ఉచితంగా వాడుకోవడానికి లేదు. గంటకి 10 రూపాయలు. ఇంకా మా హాస్టల్లో వారానికొకసారి విధిగా బయటికి పంపే ఆచారాలు లేవు. మరి ఇంక ఆ పని జరగకపోతే చచ్చిపోతాము అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఒక గంట బయటకు వెళ్లి రావడానికి అనుమతించేది. మళ్లీ బయటకు వెళ్ళే ముందు వెళ్తాము అని, వెళ్లి వచ్చిన తర్వాత వచ్చేశామని చెప్పాలి. చెప్పలేదో.. అంతే సంగతులు.
                     ఇంకొక విచిత్రమైన నియమం ఏమంటే మేము ఏదైనా పెళ్లి అని అనుమతి తీసుకుంటే అప్పుడు మేము వెళ్తున్న పెళ్లి కార్డుతో పాటు ఒక లెటర్ వ్రాసి మా ఫైలులో పెట్టాలి. :) :). ఇంకా చెప్పాలంటే మాకొక టీవీ మాత్రం ఉండేది. దానికొక DTH కనెక్షన్. మా వార్డెన్ చూసేటప్పుడు ఎవరూ ధైర్యం చేసి చూసేవాళ్ళు కాదు. రోజు రాత్రి 10 వరకే చూడాలి. రాత్రి 10 తర్వాత ఎవరైనా చూసారో తోలు వలిచేది. 10 తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళుండాలి. అలా కాదని ఎవరైనా ఇంకొకరి రూంలో ఉంటే "పక్కన నిద్రపోయిన జనాలని చూపించి, వాళ్లకి మీరు ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత ఇబ్బంది " అని వాళ్ళు మేలుకోనేంత వరకు క్లాసు పీకేది. పది తర్వాత పక్క వాళ్ళ గదుల్లో ఉంటేనే ఓర్చుకోలేనిది ఇంకా 12 గంటలకి ఎవరి పుట్టినరోజులైనా చేయాలంటే ఇంకెన్ని తిప్పలో మాకు.
                       మాకు రెండు ల్యాండ్ ఫోన్లు, ఒక రెండు రూపాయిబిళ్లల ఫోన్లు ఉండేవి. ఒక ల్యాండ్ ఫోన్కి, ఆమె గదిలో ఉన్న ఫోన్ కి కనెక్షన్ ఉండేది. అందుకని చాలా వరకు మేమంతా దాంట్లో చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. కుక్క బారిన పడితే కనీసం కొరికి వదిలేస్తుంది. దీనికి దొరికామో నానా బీభత్సం చేస్తుంది. మళ్లీ ఈమెకు కాలేజీ లో కొంతమంది గూడాచారులు ఉండేవాళ్లు. ఒక హాస్టల్ అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినట్టు తెలిస్తే చాలు, తన స్టైల్లో మాటలతో కరిచి  %^%^&&#@ జీవితం మీద విరక్తి కలిగించేది. ఒకలాంటి అరవపు తెలుగు మాటలతో పిచ్చెక్కించేది. ఈమె అందరితో మాట్లాడదు. డబ్బు,దర్పం ప్రదర్శించే జనాలనే ఈ doggie పలకరించేది. ఇది అందరిని సమానంగా కరిచే doggie కాదు. ఒక అమ్మాయి హోదాని బట్టి ఆ అమ్మాయిని కొంచెం ఎక్కువ,తక్కువ సమానంగా చూసేది.ఈమెకు,నాకు జీవిత కాలానికి సరిపడా శత్రుత్వం ఉంది. దాన్ని ఇంకొక టపాలో వివరిస్తాను. 

Friday, 12 October 2012

హాస్టల్ కబుర్లు-1

                   హాస్టల్ అనగానే నాకు ముందు గుర్తొచ్చేది homesick. అంటే ఇంక సరదాగా గడిపిన సందర్భాలే లేవని కాదు, అవి కూడా ఉన్నాయి. అవన్నీ చెపుదామనే నా ఈ టపా. నాకు హాస్టల్ లో జరిగిన ఒక సంఘటన బాగా గుర్తు.
         నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంకి వచ్చేసరికి మా రూములో ఉన్న 7 మందికి ఇద్దరం మిగిలాము. కాబట్టి మేము ఇంకొకళ్ళ రూములోకి మారాల్సి వచ్చింది. మా రూములో నేను శిరీష బెస్ట్ ఫ్రెండ్స్ . మా రూంలో మా ఇద్దరిది ఒక జట్టైతే మిగతా అందరు ఇంకొక వైపు. మాకు కొన్ని రూల్స్ ఉండేవి. అవేంటంటే.. మేము పడుకున్నపుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అదే విధంగా మేం వాళ్లు పడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు.
         మా రూంలో శ్రీవల్లి అని ఒక అమ్మాయి ఉండేది. తను fasttrack batch. :) ఇదేదో వాచ్ కంపెనీపేరులా ఉందే అని అనుకుంటున్నారా? అదే మరి అక్కడే తప్పులో కాలేశారు. తీయండి ..నేను చెప్తా .. ఆ batch లోని వాళ్ళంతా అందరిలాగ మెల్లగా చదవకుండా fast గా superfast రైళ్ళలాగా వేగంగా ఒక సంవత్సరం syllabusను అర సంవత్సరంలోనే చదివేస్తారన్న మాట. శ్రీవల్లి తరగతి సమయాలు, studyhours వేళలు అన్నీ వేరు వేరు. మేము మధ్యాహ్నం వచ్చేసరికి తిని ఒక కునుకు తీసి తన పుస్తకాలు ముందేసుకుని కూర్చునేది. మేము మాట్లాడకూడదు.తనకు studyhours లో నిద్రొస్తే బాగా నిద్రపోయి ఇంకా ఉదయాన్నే 4 గంటలకు మొదలు పెట్టేది తన చదువు. ఇబ్బందిగా ఉంది మాకు నువ్వు రోజు లైట్ వేయడం వల్ల అంటే పెద్దగా పట్టించుకునేది కాదు. అందులోనూ తనేమో fasttrack. మేమేమో నార్మల్ బాచీ. ఇలా ఎంత చెప్పినా మా శ్రీవల్లి గారు పట్టించుకోవట్లేదని ఒకసారి తనని దెబ్బ తీయాలని మేము మంచి అవకాశం కోసం వేచి ఉన్నాము(ఎదురుచూసాము..ఈ పదప్రయోగం కొంచెం కొత్తగా అనిపించింది.)ఒక రోజు మేము మధ్యాహ్నం భోజనం చేసి సరదాగా నేను శిరీష మాట్లాడుతుంటే శ్రీవల్లి చిరాకుగా మొహం పెట్టి నాకు మీ మాటలు ఇబ్బంది కలిగిస్తున్నాయి..మీరు బయటికెళ్ళి మాట్లాడండి అని ఒక ఆర్డరు జారీ చేసింది. మాకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. మాటా మాట పెరిగి ఉన్న కొంచెం break అలా నిరుపయోగంగా అయిపోయింది. మనసు మొత్తం పాడు చేసుకుని మేము తీవ్రంగా క్లాసులో తనని ఎలా దెబ్బకొట్టాలా?!అని అలోచించి ..మా బుర్రలు చించుకుంటే ఒక అద్భుతమైన అవిడియా తట్టింది.
                   రాత్రి భోజనం చేసి మేము రూంకి వెళ్ళే ముందు మా పథకాన్ని అమలు చేయాలని తీర్మానించాం. మాకు ఫోన్ చేసుకోవడానికి బ్రేక్ సమయాలు చాలకపోవడంతో అందరం మేము చేసే outgoing calls కన్నా మాకు మేము ఊహించకుండా వచ్చే incomingcalls వచ్చింది అనే అరుపులు వింటే లక్కీ డ్రా లో కార్ గెలుచుకున్నంత ఆనందంగా feel అయ్యేవాళ్ళం..ఇంకా చెప్పాలంటే ఎంసెట్ లో మొదటి ర్యాంకు వచ్చినపుడు కూడా ఇంత సంతోషం కలగదు. అందులోనూ శ్రీవల్లి పేరెంట్స్ బెంగాల్లో ఉండటంవల్ల తానెప్పుడు వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే కాల్ కోసం ఎదురుచూసేది.మా పథకం ప్రకారం కింద నుంచి ఒక జూనియర్ అమ్మాయి చేత శ్రీవల్లి ఫోన్ అని అరిపించాము. మేము అరిస్తే తనకు అనుమానం వస్తుంది కదా..అందుకని :D ..మెట్లు ఎక్కుతుండగా మళ్లీ శిరీష "శ్రీవల్లి ఫోన్ వచ్చింది "అని అరిచి ఏమి తెలియనట్టు రూంకి వెళ్ళాము. తననేనా పిలిచింది అని మమ్మల్ని అడిగి నిర్ధారించుకుంది. నేను సీరియస్ గా నీకే అనుకుంటా ఫోన్ అని నవ్వుని లోపలే అణుచుకుని చెప్పాను. తను కిందకు వెళ్ళిన వెంటనే మేము పడి పడీ నవ్వుకున్నాము.     రాత్రి వచ్చి శిరీష శ్రీవల్లి ఫోన్ మాట్లాడావా అని అడిగింది. తను ఏడుపుమొహం పెట్టి నాకు ఫోన్ రాలేదంట అని చెప్పింది. పాపం తను మళ్లీ studyhours వెళ్ళకుండా ఫోన్ దగ్గరే 2 గంటలు కూర్చొని wait చేసిందంట. మమ్మల్ని మేము కూడా తనని ఏదో ఇబ్బందికి గురిచేసామని ఆ క్షణంలో ఉబ్బి తబ్బిబైపోయాను. నేను ఊరుకోకుండా శ్రీవల్లి కాదేమో శిరీష అని పిలిచారేమో అని అన్నాను. శిరీష వెంటనే ఏంటే శ్రీవల్లి! నీకు ఫోన్ రాకపోతే నాకు వచ్చిందేమో..నన్నెందుకు నువ్వు పిలవలేదు?కింద నుంచి మనిద్దరి పేర్లు ఒకేలాగా వినిపిస్తాయి కదా అని లేని బాధ నటించింది. శ్రీవల్లి బయటికి వెళ్ళిన తర్వాత మేం ఆడిన నాటకానికి,మా నటనని గుర్తు చేసుకుని పదే పదే నవ్వుకున్నాం. ఇప్పటికీ నేను,శిరీష కలిస్తే ఈ సంఘటన గుర్తుచేసుకుని నవ్వుకుంటాం. ఇప్పుడున్న ఇన్ని ఫోన్లు అప్పట్లో లేవు. వస్తే ఇంటి నుంచి ఉత్తరాలు రావాలి. లేదంటే ఇలా ఎండాకాలంలో వచ్చే వర్షపు చినుకుల్లా incoming calls రావాలి. హాస్టల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఒక్కొక్క ఫోన్ కాల్ విలువ ఎంతో!!!!!!!
p .s : ఈ సంఘటన జరిగినట్టు శ్రివల్లికి  గుర్తుండకపోవచ్చు .కానీ నాకు మాత్రం ఎప్పటికీ తలుచుకున్న వెంటనే పెదవులపై ఒక చిరునవ్వు
తెప్పిస్తుంది.

Friday, 21 September 2012

HOMESICK- 2

                   నిన్న homesick గురించి ఒక టపా రాసాను. అయినా మనసులో కలిగిన అలజడి ఇంకా తగ్గలేదు.
                  హాస్టల్లో ఉండటం ఏలాగు తప్పదని తెలిసి, ఇంక ధైర్యం చేసుకుని మా ఆఫీసుకి దగ్గర్లో వున్న హాస్టళ్లను చూడటానికి బయలుదేరాను. వాటిని చూసిన తర్వాత ఇంకొన్ని విషయాలు నన్ను అందోళనకు గురి చేసాయి.
                   ఒక హాస్టల్ చుడటానికి బావుందని లోపలికి వెళ్లి ఆఫీసు రూము ఎక్కడ? అంటే.. అక్కడ పని చేసే అబ్బాయి నా వైపు ఒక పిచ్చిచూపు విసిరి..వెనకాల అన్నం గిన్నెల ముందు అందరికి గరిటెతొ వడ్డిస్తున్న ముసలయానని చూపించాడు..అయనే ఆ హాస్టల్ యజమాని అని తెలుసుకుని కొంచెం ఆశ్చర్యపడ్డాను. నేను ఇంకా ఏమి అడగకముందే ఆయన ఇక్కడ ఖాళీలు లేవమ్మ అని చెప్పాడు. మనసులో ఇలాంటి హాస్టళ్లకు ఇంత గిరాకినా?! అని అనుకున్నాను.
                               తర్వాత ఇంకొక హాస్టళ్లొ విచారిస్తే అక్కడ వాళ్లు చెప్పిన వసతులు కొంచెం  నచ్చి ఒక గది చూస్తానని అడిగాను. ఆ గదిలో ఇద్దరు ఉత్తర భారత ప్రాంతపు వాళ్లనుకుంటాను..నేను గదిలొకి వెళ్లగానే  ఒక వెర్రి ప్రశ్నవేశారు..నాకు  దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.ఇంకా ఖాళీలు ఉన్నాయా అని అడిగి ఇంకొక గది చూసాను. అక్కడ అందరు అచ్చ తెలుగు ప్రజలు.
                              మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను ముందు నుంచి  కాలేజీ వాళ్ళ హాస్టల్లోనే ఉన్నాను. బయటి హాస్టళ్ళ సంగతి పెద్దగ తెలియదు. అక్కడ నేను చూసిన గది ఒక 3 bedroom flat. ఒక్కొక్క bedroom లో 3 beds ఇరికించారు.మొత్తానికి వాళ్ళు ఒక్కొక్కరి  నుంచి వసూలు చేసే పైకం అక్షరాల ఆరువేలు.మొత్తం మీద వాళ్ళకి 
ఒక flat కి వచ్చే నగదు 18వేల రూపాయలు.  అక్కడ నాకు నచ్చిన సదుపాయం మనకు కావాల్సింది మనమే వండుకోవచ్చు. కాని కూరలు,ఉప్పు ,కారము అన్ని మనమే తెచ్చుకోవాలి:(. ఇలాంటి హాస్టల్లో పార్కింగ్ఏరియా ని అన్నిటికి వాడుకుంటారు అంటే అదే dining room, washing area,kitchen... ALL IN ONE:(
         ఏ రాయి అయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అని..దాదాపు దాంట్లో చేరుదామని అనుకుంటున్నాను. అయినా ఇంకా తెలీని homesick నన్ను వెంటాడుతూనే ఉంది. Wish me good luck to enjoy crocodile's festival:D:D:D:)

Thursday, 20 September 2012

HOMESICK

                              ఈరోజు ఎందుకో చాలా బెంగగా వుంది. దానికి నేను కనుక్కున్న కారణాలు రెండు. ఒకటి ఇంటి మీద బెంగ, ఇంకోటేమో నేను కొత్తగా మళ్లీ హాస్టల్లో చేరాల్సి రావడం.
                  ఆలోచిస్తూ వుంటే నేను హాస్టల్ ఉన్నప్పటి జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. అనుకోకుండా నా కళ్ళల్లో కన్నీరు కారిపోయింది. పంచుకుంటే బాధలు తగ్గుతాయని ఇలా రాసుకుంటున్నాను.
                                                       నేను పుట్టి పెరిగింది అంతా ఒక సాధారణ చిన్న పట్నంలో. టెన్త్ క్లాసు తర్వాత మా వూళ్ళో చదివించడం ఇష్టం లేక మా వూరి నుండి నెల్లూరిలో వున్న  ఒక రెసిడెన్స్ కళాశాలలో చేర్పించారు. అప్పటి దాక నాకు సొంతంగా పనులు చేసుకోవడం తెలియదు. అయినా ఇంటి నుంచి మంచి ఉత్సాహంగానే బయలుదేరాము మా నాన్న,నేను. ముందు రోజు సాయంత్రం బయలుదేరితే నెల్లూరు చేరే సరికి ఉదయం అయ్యింది. ఉదయం పది గంటలకి కాలేజీ దగ్గరికి వెళ్లి ఫీ వివరాలన్నీ కనుక్కుని కట్టవల్సినవి కట్టి మళ్ళి తిరిగి మా లాడ్జి రూముకి బయలుదేరి నా లగేజి మొత్తం తీసుకుని హాస్టల్ దగ్గరకు బయలుదేరాము. హాస్టల్ వార్డెన్ నాకు ఒక గది చూపించి దీంట్లో నీ సామాను సద్దుకో. ఈరోజుకి ఎవరైనా వస్తే ఇక్కడ నీతో పాటు ఉంచుతాను అని చెప్పింది.
                            సామానంతా సర్దేసి కిందికి మళ్ళి  ఆఫీసు రూముకి వెళ్ళగానే పాకెట్ మనీ ఎంత కడుతున్నారు అని వార్డెను అడగగానే, మా నాన్నగారు డబ్బులిచ్చి ఎవరికో నా బాధ్యత అప్పజెప్పినట్లు అనిపించి చాలా ఏడుపొచ్చేసింది. మా నాన్న గారిని పట్టుకుని ఏడ్చేసాను. మా నాన్న కొంచెం సేపు నన్ను బయటికి తీస్కెళ్ళి  సముదాయించి నువ్వు బాగా చదువుకో. నీ కోసం నేను వచ్చే వారం వస్తానని చెప్పి వెళ్ళారు. మొదట్లో తిండి సహించేది కాదు. ఆ తర్వాత నేను ఇంగ్లీష్ మాధ్యమానికి కొత్త. లెక్కలు, రసాయనశాస్త్రం బాగానే అర్థమైనా physics మాత్రం చాల ఇబ్బంది పెట్టేది. నేను ఇంట్లో ఎప్పుడూ పది తర్వాత మేలుకుని వుండేదాన్ని కాదు. అలాంటిది రాత్రి పదకొండు గంటల వరకు స్టడీఅవర్స్ అంటే నిద్ర బాగా ముంచుకోచ్చేది. చేసేదేమీ లేక పుస్తకాన్ని ముందు పెట్టుకుని నిద్ర ఆపుకోలేక,నిద్రపోలేకా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఉదయం లేవగానే నిద్ర చాలక కొంచెం జ్వరం వచ్చినట్టు వుండేది మొదటి కొద్దిరోజులు.ఉదయం ఆరు గంటలకు మొదలైతే రాత్రి పదకొండు గంటల వరకు క్లాసులు,స్టడీ అవర్లు ఉండేవి. ఆదివారం ఇంకా పెద్ద బంపర్ ఆఫర్ 13 గంటలు స్టడీ అవర్సు. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించడానికి అంతలా కష్టపడాలా అని?
                            చిన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండేవంటే, మా స్కూలికి పక్కగా  మా తరగతి గది నుండి చూస్తే ఒక ఇంటి మేడ కనిపించేది. ఆ ఇంట్లో పైకి,కిందికి తిరిగే వాళ్ళని చూస్తే "మా ఇల్లు ఇక్కడే వుంటే స్కూల్లో ఉన్నంతసేపు ఇంటినే చూస్తూ వుండేదాన్ని కదా అని అనుకునేదాన్ని".అలా ఆలోచించినదాన్ని ఇంటికి దూరంగా చాలా బాధగా వుండేది. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలంటే మాకు లంచ్ బ్రేక్ కోసం ఇచ్చిన రెండు గంటల సమయం చాలేది కాదు. ఎందుకంటే అంత పెద్ద Queue ఉండేది. అలా queue లో నిలబడి కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకా బాధేసేది. బట్టలు మనమే వుతుక్కోవాలి. అన్నం తిన్నా,తినకపోయినా పట్టించుకుని అడగరు. మనకు జ్వరం వస్తే మనం వెళ్లి పర్మిషన్ తీసుకుని sickroom కి వెళ్లి పడుకోవాలి. ఇన్ని టెన్షన్లు ఉన్నా మనల్ని ఇక్కడ చేర్పించింది  చదువుకోడానికి అని నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మొదటి సంవత్సరం చాలా ఇబ్బంది పడినా రెండవ సంవత్సరానికి కొంచెం కోలుకున్నాను. అంటే నాకు నేను స్నేహితులతో కలిసి సెలవలకి ఇంటికి వెళ్ళడం, అమ్మ,నాన్నల్ని ప్రతి చిన్న విషయం చెప్పి ఏడవకపోవడం లాంటివి. 
                     ఇప్పుడు నాకు ఆలోచిస్తే అలాంటి కాలేజీల్లో వినోదం పూర్తిగా నిషేధం లాగా ఉంటుంది. చదవడానికి ఒక వార్తాపత్రిక కూడా ఉండదు. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టు అనిపించేది. మా చుట్టూ ఏo జరుగుతుందో కూడా తెలిసేది కాదు. కాలేజి కంపౌండ్ బయట ఏం  జరిగినా అస్సలు తెలిసేది కాదు. జైల్లో వున్న ఖైదీలకు ఇలా రెసిడెన్స్ కాలేజీల్లో చదివే పిల్లలకు పెద్ద తేడా ఉండదు. స్వతహాగా ఎవరికీ వారు తమకు నచ్చింది నచ్చినట్టు చేయడానికి కొంచెం సమయం అయినా వుండాలని నాకు అనిపిస్తుంది.
                                             ఇప్పుడు నాకు ఫోన్ కోసం queue లో నిలబడాల్సి రాకపోయినా మనం ఇంట్లో వుంటే మనకు నచ్చింది నచ్చినట్టు చేసుకోవచ్చు. అదే హాస్టల్లో ఉంటే ఏదో restricted గా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా హాస్టల్లో వుండాలంటే బాధగానే ఉంది.