Thursday, 20 September 2012

HOMESICK

                              ఈరోజు ఎందుకో చాలా బెంగగా వుంది. దానికి నేను కనుక్కున్న కారణాలు రెండు. ఒకటి ఇంటి మీద బెంగ, ఇంకోటేమో నేను కొత్తగా మళ్లీ హాస్టల్లో చేరాల్సి రావడం.
                  ఆలోచిస్తూ వుంటే నేను హాస్టల్ ఉన్నప్పటి జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి. అనుకోకుండా నా కళ్ళల్లో కన్నీరు కారిపోయింది. పంచుకుంటే బాధలు తగ్గుతాయని ఇలా రాసుకుంటున్నాను.
                                                       నేను పుట్టి పెరిగింది అంతా ఒక సాధారణ చిన్న పట్నంలో. టెన్త్ క్లాసు తర్వాత మా వూళ్ళో చదివించడం ఇష్టం లేక మా వూరి నుండి నెల్లూరిలో వున్న  ఒక రెసిడెన్స్ కళాశాలలో చేర్పించారు. అప్పటి దాక నాకు సొంతంగా పనులు చేసుకోవడం తెలియదు. అయినా ఇంటి నుంచి మంచి ఉత్సాహంగానే బయలుదేరాము మా నాన్న,నేను. ముందు రోజు సాయంత్రం బయలుదేరితే నెల్లూరు చేరే సరికి ఉదయం అయ్యింది. ఉదయం పది గంటలకి కాలేజీ దగ్గరికి వెళ్లి ఫీ వివరాలన్నీ కనుక్కుని కట్టవల్సినవి కట్టి మళ్ళి తిరిగి మా లాడ్జి రూముకి బయలుదేరి నా లగేజి మొత్తం తీసుకుని హాస్టల్ దగ్గరకు బయలుదేరాము. హాస్టల్ వార్డెన్ నాకు ఒక గది చూపించి దీంట్లో నీ సామాను సద్దుకో. ఈరోజుకి ఎవరైనా వస్తే ఇక్కడ నీతో పాటు ఉంచుతాను అని చెప్పింది.
                            సామానంతా సర్దేసి కిందికి మళ్ళి  ఆఫీసు రూముకి వెళ్ళగానే పాకెట్ మనీ ఎంత కడుతున్నారు అని వార్డెను అడగగానే, మా నాన్నగారు డబ్బులిచ్చి ఎవరికో నా బాధ్యత అప్పజెప్పినట్లు అనిపించి చాలా ఏడుపొచ్చేసింది. మా నాన్న గారిని పట్టుకుని ఏడ్చేసాను. మా నాన్న కొంచెం సేపు నన్ను బయటికి తీస్కెళ్ళి  సముదాయించి నువ్వు బాగా చదువుకో. నీ కోసం నేను వచ్చే వారం వస్తానని చెప్పి వెళ్ళారు. మొదట్లో తిండి సహించేది కాదు. ఆ తర్వాత నేను ఇంగ్లీష్ మాధ్యమానికి కొత్త. లెక్కలు, రసాయనశాస్త్రం బాగానే అర్థమైనా physics మాత్రం చాల ఇబ్బంది పెట్టేది. నేను ఇంట్లో ఎప్పుడూ పది తర్వాత మేలుకుని వుండేదాన్ని కాదు. అలాంటిది రాత్రి పదకొండు గంటల వరకు స్టడీఅవర్స్ అంటే నిద్ర బాగా ముంచుకోచ్చేది. చేసేదేమీ లేక పుస్తకాన్ని ముందు పెట్టుకుని నిద్ర ఆపుకోలేక,నిద్రపోలేకా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఉదయం లేవగానే నిద్ర చాలక కొంచెం జ్వరం వచ్చినట్టు వుండేది మొదటి కొద్దిరోజులు.ఉదయం ఆరు గంటలకు మొదలైతే రాత్రి పదకొండు గంటల వరకు క్లాసులు,స్టడీ అవర్లు ఉండేవి. ఆదివారం ఇంకా పెద్ద బంపర్ ఆఫర్ 13 గంటలు స్టడీ అవర్సు. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించడానికి అంతలా కష్టపడాలా అని?
                            చిన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉండేవంటే, మా స్కూలికి పక్కగా  మా తరగతి గది నుండి చూస్తే ఒక ఇంటి మేడ కనిపించేది. ఆ ఇంట్లో పైకి,కిందికి తిరిగే వాళ్ళని చూస్తే "మా ఇల్లు ఇక్కడే వుంటే స్కూల్లో ఉన్నంతసేపు ఇంటినే చూస్తూ వుండేదాన్ని కదా అని అనుకునేదాన్ని".అలా ఆలోచించినదాన్ని ఇంటికి దూరంగా చాలా బాధగా వుండేది. ఇంట్లో వాళ్లతో మాట్లాడాలంటే మాకు లంచ్ బ్రేక్ కోసం ఇచ్చిన రెండు గంటల సమయం చాలేది కాదు. ఎందుకంటే అంత పెద్ద Queue ఉండేది. అలా queue లో నిలబడి కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకా బాధేసేది. బట్టలు మనమే వుతుక్కోవాలి. అన్నం తిన్నా,తినకపోయినా పట్టించుకుని అడగరు. మనకు జ్వరం వస్తే మనం వెళ్లి పర్మిషన్ తీసుకుని sickroom కి వెళ్లి పడుకోవాలి. ఇన్ని టెన్షన్లు ఉన్నా మనల్ని ఇక్కడ చేర్పించింది  చదువుకోడానికి అని నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని. మొదటి సంవత్సరం చాలా ఇబ్బంది పడినా రెండవ సంవత్సరానికి కొంచెం కోలుకున్నాను. అంటే నాకు నేను స్నేహితులతో కలిసి సెలవలకి ఇంటికి వెళ్ళడం, అమ్మ,నాన్నల్ని ప్రతి చిన్న విషయం చెప్పి ఏడవకపోవడం లాంటివి. 
                     ఇప్పుడు నాకు ఆలోచిస్తే అలాంటి కాలేజీల్లో వినోదం పూర్తిగా నిషేధం లాగా ఉంటుంది. చదవడానికి ఒక వార్తాపత్రిక కూడా ఉండదు. బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టు అనిపించేది. మా చుట్టూ ఏo జరుగుతుందో కూడా తెలిసేది కాదు. కాలేజి కంపౌండ్ బయట ఏం  జరిగినా అస్సలు తెలిసేది కాదు. జైల్లో వున్న ఖైదీలకు ఇలా రెసిడెన్స్ కాలేజీల్లో చదివే పిల్లలకు పెద్ద తేడా ఉండదు. స్వతహాగా ఎవరికీ వారు తమకు నచ్చింది నచ్చినట్టు చేయడానికి కొంచెం సమయం అయినా వుండాలని నాకు అనిపిస్తుంది.
                                             ఇప్పుడు నాకు ఫోన్ కోసం queue లో నిలబడాల్సి రాకపోయినా మనం ఇంట్లో వుంటే మనకు నచ్చింది నచ్చినట్టు చేసుకోవచ్చు. అదే హాస్టల్లో ఉంటే ఏదో restricted గా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా హాస్టల్లో వుండాలంటే బాధగానే ఉంది.

10 comments:

 1. మనలోనుంచి ఎవరో బయటకి వచ్చి మన ఫీలింగ్స్ అన్నీ చెపుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది మీ టపా చదువుతూ ఉంటే. బహుశా హాస్టల్స్ లో ఉన్నవారందరికీ సుమారుగా ఒకేలాంటి అనుభవాలూ, ఉద్వేగాలు ఉంటాయేమో. కాకపోతే అందరూ బయటకి చెప్పకపోవచ్చు. ముందు ఒకటి రెండు లైన్స్ కోట్ చేద్దామనుకున్నా...కానీ టపా మొత్తం కోట్ చెయ్యల్సి ఉంటుందని అర్ధమైంది.
  మీరన్నది నిజమే ఇంజనీరింగ్ చదవటానికి అంత శ్రమపడాల్సిన అవసరం లేదు, కేవలం చదువు చెప్పటం చేతకాని కొందరు, బిజినెస్ కోసం మొత్తం ఆంద్రప్రదేశ్ విద్యావ్యవస్తని బలిపెట్టారు. నాశనమఔతుంది మాత్రం పిల్లలు, వాళ్ళకున్న ఒకే ఒక్క జీవితం. :(

  ReplyDelete
 2. థ్యాంక్స్ శరత్ గారు, నా టపాలోని భావన అర్థమైనందుకు.

  ReplyDelete
 3. Thanks for your understanding Padmarpita gaaru.Really those experiences are very sad:(

  ReplyDelete
 4. నా హాస్టల్ డేస్ గుర్తొచ్చాయ్ చిన్ని గారు.....ఇప్పుడు గుర్తుచేసుకుంటే అంత చిన్న విషయాలకి ఏడ్చామా(అప్పుడు అమ్మ కూడా అనేది ఇంత చిన్న వాటికి ఏడుస్తారా ఎవరైనా ?? అని) అనిపిస్తుంది కానీ....ఆ age కి అవి చాలా పెద్ద కష్టాలే!!!

  ReplyDelete
  Replies
  1. అంజలి గారు..ఇప్పటికి నాకు హాస్టల్ అంటే బెంగగానే ఉంటుంది. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

   Delete
 5. నీ టపా చూసాక హాస్టల్లో ఉన్న మా పాప ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అర్థమైందమ్మా, చాలా దాంక్స్.

  ReplyDelete
 6. ధన్యవాదాలు నరసింహరావు గారు,పిల్లలు ఎవరూ బయటపడకపోయినా ఇలాగే feel అవుతుంటారు.

  ReplyDelete
 7. ఈ తరహా విద్యావిధానమే తప్పండీ. కేవలం పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రశ్నలకి జవాబులు బట్టీ పటించడం, పోనీ ఆ పాఠ్యపుస్తకమైనా పూర్తిగా కాదు. కేవలం సెలెక్టివ్ క్వశ్చన్స్ బట్టీ వేయించడం లాంటివి. ఈ విధానం వల్ల బయట ప్రపంచం సంగతి దేవుడెరుగు, కనీసం వాళ్ళు చదువుకుంటున్నది ఏమిటో కూడా పిల్లలకి సరైన అవగాహన ఉండడం లేదు. చదువంటే ఆలోచన. చదువంటే అవగాహన. చదువంటే విశ్లేషణ. ఇవన్నీ లోపిస్తున్నాయి ఇప్పటి విద్యావిధానంలో.

  ReplyDelete
 8. అయినా పిల్లలు,తల్లిదండ్రులు అదే చట్రంలొ ఇరుక్కుపోతున్నారు. శిశిర గారు...ధన్యవాదాలు

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.