Thursday, 30 May 2013

నేను ఈరోజు

        మా ఊర్లో ప్రతి వైశాఖ మాసంలో వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చవితి రోజు రథోత్సవం జరుగుతుంది. దాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వీలు చేసుకుని మరీ వెళ్తుంటాం. ఈ సారి కూడా నేను మా ఊరు వెళ్లివచ్చాను. 
         ఇంటి దగ్గర ఒక నాలుగు రోజులు ఉండేసరికి ఇంటి పైన చాలా బెంగగా ఉంది. నేను హాస్టల్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇప్పటికి ఇంటికి వెళ్లి వస్తే చాలా బెంగ. చదువుకునే సమయంలో అయితే మన స్నేహితులు, మనం చదవాల్సిన పాఠాలు అని బోలెడు పనులు ఉంటాయి కాబట్టి బాధపడటానికి అంత  తీరిక ఉండదు. మరి ఇప్పుడో అలా కాదు, బోలెడంత సమయం కదా.. అందులోనూ చదువుకునే రోజుల్లో అయితే ఎంత బెంగ ఉన్నా దాని  ప్రభావం చదువు పైన పడకుండా జాగ్రత్త పడేవాళ్లం.              
                పిచ్చుక గూళ్ల లాంటి ఒక గదిలో ముగ్గురం ఉంటాం. వీలయితే మా కళ్లు టి.వి కి, లేదంటే మా లాప్టాప్ స్క్రీన్లకు అప్పగిస్తాం.మొదట్లో ఇలా ఉండాలని తెలియక నేనే చాలా కబుర్లు చెప్పెసేదాన్ని.. కానీ మా రూములో ఉన్న మిగతా ఇద్దరికీ అది నచ్చలేదు.ఇక అప్పట్నుంచి నేను కూడా పెద్దగా మాట్లాడటం మానేసాను.అయినా మనసుకి నచ్చాలి మాట్లాడాలంటే.. ఏదో మొహమాటానికి పెదవుల పైన వికారపు నవ్వు నవ్వుతూ ఎంతసేపని నన్ను నేను కష్టపెట్టుకోవటం అని మాట్లాడటమే తగ్గించేసాను. ఆఫీసు నుంచి రూముకి రాగానే వీలయితే టి.వి చూడాలి, లేదంటే లాప్టాప్. ఇంతకు మించి ఒక్క పని ఉండదు. ఆశ్చర్యమేమంటే నేను ఇంటికి లాప్టాప్ తీసుకెళ్ళినా ఒకసారి తెరవడానికి కూడా సమయం దొరకలేదు, అంత తీరిక కుడా లేదు.  
                   ఉన్న నాలుగు రోజుల్లో మొదటిరోజు ప్రయాణపు బడలికతో విశ్రాంతి తీసుకుంటే, తరువాతి రోజు మా అమ్మ కజ్జికాయలు చేసే ప్రోగ్రామ్ పెట్టేసింది. ఆ పనితో ఆ రోజు గడిచిపోయింది.తరువాతి రోజు బూజులు దులపాలి పండగ కదా అని ఆ పనికి పూనుకుంది. మరీ అమ్మ ఒక్కత్తే కష్టపడుతుంటే మనం చూస్తూ ఉండలేము కాబట్టి ఆరోజు అలా గడిచింది. చివరి రోజు అంటా పండగ హడావుడి. ఆరోజు మళ్లీ బబ్బట్లు చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాం.ఇలా నాలుగురోజులు తీరిక లేకుండా సెలవులు గడిచిపోయాయి.
               ప్రతిసారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా ఉంటుంది. కానీ తిరిగివచ్చే రోజు ఏదో తెలియని బెంగ,బాధ మనసులో ఇంకా ఎన్ని రోజులు ఇలా అమ్మా,నాన్నలకు దూరంగా ఉండటం అని.ఉద్యోగం రాక మునుపు ఇంటి మీద బెంగ అన్నా కూడా ఇంట్లోవాళ్లు ఏమి కాదులేమ్మా!! బాగా చదువుకో అని చెప్పి కర్తవ్యo గుర్తుచేసేవారు. మ్మ్..ఇప్పుడు అంత బెంగగా అనిపిస్తే పంచుకోవడానికి దగ్గరి స్నేహితులు లేరు. ఇంట్లో వాళ్లని మాటిమాటికి ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పెట్టాడానికి మనసు రాదు. ఇక నా గోడు ఎవరైనా వింటారు అంటే అది నా దిండు మాత్రమే..
                  ఇక్కడ ఐదు రోజులు పని చేసి, రెండు రోజులు పని లేకుండా హాస్టల్లో ఏమి చేయాలో తోచక.. అసలెందుకు రా ఈ ఒంటరి ప్రాణానికి ఈ సెలవులు అని విసుగొస్తుంది,పోని  రెండురోజులు సెలవులున్నాయి కదా ఇంటికెల్దామా అంటే 12 గంటల సుదీర్ఘ ప్రయాణం. అంత దూరం ప్రతి వారం ప్రయాణం చేయలేను. నాకైతే నిజం చెప్పాలంటే ఏ డిగ్రీయో ఇంటిపట్టునే ఉండి చదివి, ఎలాగోలా కష్టపడి ఒక టీచరు ఉద్యోగం సంపాదించేసి సంతోషంగా రోజు ఇంటి నుంచే వెళ్తే ఎంత బావుండేదో అని అప్పుడప్పుడు పగటికలలు కంటూ ఉంటాను. అయినా ఇప్పుడు వేలకు వేలు సంపాదించి బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన నిజంగా సంతోషంగా ఉన్నట్టా?? అసలు రోజు అమ్మ చేతి కమ్మని వంట తింటూ.. ఇంటి నుంచే ఉదయం పదింటికి బయలుదేరి సాయంత్రం ఆరింటికల్లా మళ్లీ ఇల్లు చేరుకునే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు నా దృష్టిలో గొప్ప అదృష్టవంతులు. నేను ఎవర్నైనా చూసి ఈర్ష్య పడుతాను అంటే అసలు హాస్టల్ మొహమే మేము ఎరుగము అని కొంతమంది చెప్పినప్పుడు..ఈ ఇంటి మీద బెంగ ఎప్పటికి తగ్గుతుందో నాకర్థమవట్లేదు.ఈరోజే మళ్లీ సెలవు ఎప్పుడు పెట్టి ఇంటికి వెళ్లాలా అని ప్లాను వేసుకున్నాను. :)
                                       

5 comments:

 1. మన అనుభవాలన్నీ అక్షరసత్యాలే . అయితే అది అనుభవమైతే గాని గ్రహించలేరు .ఒకటి పొందిన తర్వాత , ఇంకొకటి కావాలనిపించే మనస్తత్వం చిన్నపిల్లలో చూస్తుంటాము . నిజానికి మన పెద్దవాళ్ళలో కూడా ఉన్నదన్నది నిత్య సత్యం . కాకుంటే మనల్ని , చిన్నపిల్లల్ని ప్రశ్నించినట్లు ప్రశ్నించేవారెవరూ ఉండక పోవటంతో , మనకు తెలుసుకోవటానికి కొంచెం టైం పడ్తుంది . గతించిన రోజులెప్పుడూ ( చాలా వరకు ) మధురస్మృతులను అందిస్తుంటాయి .

  ReplyDelete
  Replies
  1. శర్మ గారు, ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు:)

   Delete
 2. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినుల అనుభవాల రెండో కోణాన్ని గురించి బాగా చెప్పావమ్మా!

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.