Monday, 31 December 2012

న్యూఇయర్ ఙ్ఞాపకాలు

                     నాకు ఊహ తెలిసనప్పటినుంచి జనవరి ఒకటో తారీఖు హడావుడి దీపావళి పండగ అవగానే మొదలయ్యేది. అప్పట్లో పావలాకు హీరోలు, హీరోయిన్ల, బాల నటీ,నటులు, పూవులు, ప్రకృతి ఫోటోలుగా గ్రీటింగ్ కార్డులు దొరికేవి. ఇంట్లో అమ్మ ఇచ్చిన అర్ధరూపాయి, రూపాయి కూడబెట్టి ఈ గ్రీటింగ్ కార్డులు కొనుక్కునేవాళ్ళం. నేను రెండు,మూడు తరగతులు చదివేటప్పుడు మాత్రం అన్నయ్యవాళ్లు మమ్మల్ని తీసుకెళ్లి కొనిపెట్టేవాళ్లు రెండు,మూడు షీట్లు.ఒక్కొక్క షీటుకి తొమ్మిది కార్డులు ఉండేవి.
             అసలు అదంతా ఒక పండగలాగా ఉండేది. బడిలో పిల్లలంతా డిసెంబర్ నెల మొత్తం నువ్వు ఎలాంటి కార్డులు కొంటున్నావ్? నీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయి అని ఒకటే హడావుడి. కొంతమంది ముందుగానే వాళ్లతో ఉన్న ఫోటోలన్నీ చూపించి నీకు ఏది కావాలో అదే ఇస్తాను అని చెప్పేవాళ్లు. మళ్లీ అది ఇంకొకరు ఎంచుకోకుండా దాని వెనక పేరు వ్రాసి ఒకరి కోసం దాన్ని ముందుగానే రిజర్వు చేసేవారు :D.మేము  ఎక్కువగా బేబి శ్యామిలి  ఫోటోలు కొనేవాళ్లo. ఇక అబ్బాయిల కోసం హీరోల ఫోటోలు, టీచర్ల కోసం పూవుల ఫోటోలు కొనేవాళ్ళం. ఏ ఒక్కరికీ రెండు ఒకే ఫోటోలు రాకుండా జాగ్రత్త పడేవాళ్లం. కొంతమంది ముందుగానే గ్రీటింగ్ కార్డ్ వెనకాల పేరు వ్రాయించుకోకుండా తీసుకునేవారు. ఇంకొక సంవత్సరం ఇంకొకరికి ఇవ్వొచ్చు అనే ఆలోచనతో.:P  నచ్చినా, నచ్చకపోయినా ఎలాంటి కల్మషం లేకుండా, లేనిపోని మొహమాటాలకు పోకుండా ఒకరికొకరు మొహం పైనే చెప్పేసుకుని నచ్చింది ఇచ్చి పుచ్చుకునే వాళ్లం. స్కూలికి కొత్త డ్రెస్ వేసుకుని చాక్లెట్లు ఒక పర్సులో వేసుకుని చాలా ఉత్సాహంగా వెళ్లేవాళ్లం. ఇష్టమైన వాళ్లకేమో రెండు చాక్లెట్లు, అందరికీ ఒక్కొక్కటి.స్కూలికి ఎవరైనా రాకపోతే వాళ్ల ఇంటికి వెళ్లి మరీ గ్రీటింగ్ కార్డు ఇచ్చేవాళ్ళం.
                డిసెంబర్ 31 వ తేది రాత్రి మా ఇంట్లో అందరి భోజనాలు తొమ్మిది గంటలకల్లా అయిపోయేవి. తొమ్మిది గంటలకే ఇంటి ముందు అమ్మ ముగ్గు మొదలుపెట్టేది . అంతకు ఒక వారం ముందు రోజుల నుంచి అమ్మ ఒక పెద్ద ముగ్గు బాగా సాధన చేసి తను ముగ్గుపిండితో ముగ్గు వేస్తే వాటికి రంగులు మేము నింపేవాళ్లం. ఎవరింటి ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంటే అంత గొప్ప. రంగులు నింపిన తర్వాత మళ్లీ అమ్మ ఇంకోసారి చుట్టూ బయట outline వేసేది. అంత చలిలో అందరూ స్వెట్టర్లు వేసుకుని ఏ  రంగులు ఎక్కడ నింపాలి అని గొడవపడుతూ, మధ్యలో అమ్మ నేను చెప్పిన రంగే వేయాలి అంటే అక్క వినట్లేదు అని విసిగిస్తుంటే అమ్మ మా అల్లరి భరించలేక కోప్పడుతూ.. భలే సందడిగా ఉండేది. రాత్రి 10 అయితే చాలు!!దుప్పట్లో  దూరి సందడి సద్దుమణిగిపోయే  మా ఊరు  ఆ రోజు మాత్రం 12 అయితే కానీ రాత్రి అయినట్టు కాదనేది.
                ఇక ఇంట్లో సందడి చెప్పకర్లేదు. నాన్నగారు తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే స్నేహితుల కోసం ముందుగానే కేకు తెప్పించేవారు. అమ్మ చేత అందరికి ఫలాహారం చేయించేవారు. వాటిని అందరికి వడ్డించే బాధ్యత నాది, మా అక్కది. వచ్చే జనాలతో ఇల్లంతా హడావుడిగా ఉండేది.
                ఈ సందడిని గత తొమ్మిది సంవత్సరాలుగా నేను కోల్పోతున్నాను.అందుకే నా newyear resolution ఏంటంటే ఈ సంవత్సరం అనవసరంగా ఎప్పుడుపడితే అప్పుడు సెలవలు తీసుకుని ఇంటికి వెళ్లకుండా ఒకేసారి క్రిస్మస్ పండగ నుంచి కొత్తసంవత్సరం రోజు వరకు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.మీకు కూడా నా ఆలోచన నచ్చిందా?? అయితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఈ ఐడియా ఏ మాత్రం బెడిసికొట్టినా నన్ను మాత్రం బాధ్యురాలిని చేయకండి. :P
                  ఈ సంవత్సరంలోనే నేను ఈ బ్లాగును మొదలుపెట్టాను.మొదలుపెట్టినప్పటి నుంచి నా ఆశ, శ్వాస ఇదేగా కాలాన్ని గడిపేస్తున్నాను. నాకు అప్పటికప్పుడు వచ్చిన దుఃఖాన్ని,సంతోషాన్ని అన్నిటినీ నాతో పంచుకుంటూ నన్నింతగా ప్రోత్సహిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు. చాలామంది స్నేహితులని ఈ బ్లాగువల్ల కలుసుకున్నాను. నాకొక కొత్త ప్రపంచాన్ని చూపిన మీ అందరికీ ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.మరీ అత్యాశ అంటారా!!! అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

22 comments:

 1. Nice post :)
  HaPpY NeW yeAr Darling...!

  ReplyDelete
 2. చిన్నన్నాటి జ్ఞాపకాలను నెమరువేసుకొనేలా చేసారు.
  మనం ఒకరికి కార్డ్ వేస్తే వాళ్ళూ వెయ్యాలి లెకపోతే కోపం వచ్చేస్తుంది మరి.
  అలాగే మనం ఇవ్వల్సిన లిస్ట్లో లేనివారు మనకు కార్డ్ ఇస్తే మనమూ ఇంకోటి కొని ఇవ్వాలి అది రూలు.
  భలే భలే కదా..
  మీకు కూడా నుతన సంవత్సర శుభాకాంక్షలు ..:))

  ReplyDelete
  Replies
  1. ధాత్రిగారు.. అవన్నీ గుర్తు చేసుకుంటే మళ్లీ ఆ రోజులు వస్తే బాగుండనిపిస్తుంది:)

   Delete
 3. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చిన్ని గారు!!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

   Delete
 4. మీ పోస్ట్ పుణ్యమా అని నాకూ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయండీ...
  ఒక్క కేక్ విషయం లో తప్ప మిగిలినవన్నీ డీట్టో... ముగ్గులతో సహా...;) ;)
  "ఒరే.. నాక్ సిరంజీవి గ్రీటింగ్ కార్డ్ వెయ్యరా" అని అడిగిమరీ వేయించుకునేవాళ్ళు ఫ్రెండ్స్.. బావలకీ, పిన్ని వాళ్ళకీ తప్పకుండా పోస్ట్ లో కార్డ్స్ పంపించేవాళ్ళం, వాళ్ళూ పంపేవాళ్ళు. అమ్మ, నాన్నా టీచర్సేమో.. మా ఇల్లంతా చాలా సందడిగా ఉండేది.. ఇల్లంతా కార్డ్సే...

  ఎప్పుడు ఆగిపోయిందో తెలీదు.. అన్నీ ఆగిపోయాయి.. ;(

  మీ బ్లాగ్ ఇదే చూడటమండీ..బాగుంది. మీకూ మీ కుటుంబ సభ్యులకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజ్ కూమార్ గారు. అవునండీ అవన్నీ ఎప్పుడు ఆగిపోయాయో తెలీదు..
   :( కానీ వాటన్నిటిని చాలా మిస్స్ అవుతున్నామని మాత్రం అనిపిస్తుంది.

   Delete
 5. మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. చిట్టి,పండు గారు ధన్యవాదాలు మీ స్పందనకు:)

  ReplyDelete
 7. Nuthana samvachara subhakankshalu andi ..Chinni garu

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ గారు,
   ధన్యవాదాలు మీకు కూడా శుభాకాంక్షలు :)

   Delete
 8. మీ జ్ఞాపకాలతో మా జ్ఞాపకాలనూ మేల్కొల్పారండి :-) నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. రమేష్ గారు,
   మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.ధన్యవాదాలు మీ స్పందనకు :)

   Delete
 9. చిన్ని గారు మీ చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తూ..మమ్ముల్ని కూడా బాల్యంలోకి తిసుకెళ్ళారు..నూతన సంవత్సరంలో మీరు ఇలాంటి అందమైన అనుభవాలను అనేకం సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను..."మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం, రాబోవు కొత్త సంవత్సరం అలాంటి క్షణాలను మీకు అందించాలని ఆశిస్తూ"...మీకు, మీ కుటుంబానికి "నూతన సంవత్సర శుభాకాంక్షలు".

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారు ,
   మీ అందమైన అభినందనల అక్షరాలమాలకు ధన్యవాదాలు. మీకు కూడా ఈ సంవత్సరం మధురమైన అనుభవాలను మిగిల్చాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.

   Delete
 10. నూతన ఆంగ్ల వత్సర శుభకామనలు

  ReplyDelete
  Replies
  1. తాత గారికి, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

   Delete
 11. చిన్నిగారూ...

  మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... :)

  ReplyDelete
  Replies
  1. శోభ గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   Delete
 12. Mee post late ga chadivanu..Aynanu late ga ney chepthanu..

  Happy New year to you and your family.Have a wonderful year ahead..

  ReplyDelete
  Replies
  1. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు.

   Delete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.