Showing posts with label సరదాకి. Show all posts
Showing posts with label సరదాకి. Show all posts

Wednesday, 22 May 2013

అనగనగా యువరాణి

                   మ్మ్ ఏంటో ఈ జీవితం చడి,చప్పుడు లేకుండా చప్పగా, అప్పుడప్పుడు కొన్ని కష్టాలతో.. అప్పుడప్పుడు జీవితం అంటే ఇంతేనా అని అనిపించే విధంగా సాగుతూ నిజం చెప్పాలంటే సాగుతూఊఊఊఊఊఊఊఊఉ ఉంది. ఏం చేస్తాం మనం కూడా దానితో పాటే సాగాలిగా...ఈ సాగింపు చర్య ఏంటీ అంటారా ?? మనం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాలి మరి..
     అనగనగా ఒక పేద్ద సాఫ్ట్వేర్ కంపెనీ.. అందులోకి ఒక బుల్లి యువరాణి..ఎవరా అని బుర్ర బద్దలుకొట్టుకోకండీ(నేనే మరి)..మరేమో నేను యువరాణి కదా అందుకని నాకు మొదట్నుంచి ఆటలో అరటికాయ టైపులో అందరు చిన్న చిన్న పనులు చెప్పి నా చేతులు కందకుండా గారాభంగా చూసుకున్నారు..ఇలా యువరాణి వారు రోజు ఆటవిడుపు కోసం ఆఫీసుకు రావడం నచ్చని మంత్రివర్యులు(మెనేజరు) వారు మెల్లిగా ఈ విషయాన్ని రాజా(డెలివరి మెనేజరు) వారి చెవిలో ఊదేసారు. పాపం కొంచెం ఘాట్టిగానే ఊదారేమో చెవి కందిపోయి దానికి వెంటనే చర్య తీసుకునేలా హుకూం జారీ చేసారు..

             మరి యువరాణి వారికి ఈ విషయం తెలియగానే ఎలా స్పందిస్తారో అని రాజా వారు తటపటాయించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, యువరాణి!! మీరు ఆడి,ఆడీ పాడు చేసినది చాలు మా శీఘ్రగణనయంత్రమును..మీరు వెరక చోటికి వెళ్లి ఆడుకొనుము..(గూడార్థము మీరింకొక ఉద్యోగమును వెతుక్కొనుము అని)..వెంటనే వూహించని ఈ పరిణామమునకు యువరాణి కనులలో నుంచి జాలువారు అశ్రువులను నియంత్రించుకుని, నన్ను ఒక జట్టుతో కలిపి చూడుడి, నా ప్రతిభను చూపించెదను అని మంగమ్మ శపతమును పూనిన వెంటనే.. మిక్కిలి ఆనంద భరితుడైన రాజా వారు నన్ను ఒక గుంపులో చేర్చిరి..(ఏ గుంపు అనా మీ అనుమానం, నా లాంటి అరటికాయలందరి గుంపులో :) ) మీరు ఇప్పుడు అందరి చేతా పరీక్షంచబడి ఒకరి చేత ఎన్నుకోబడతారు..అయితే ఒక నియమము అని ఒక రహస్యమును నా చెవిలో వేసినారు..అది ఏమనగా ఒక్క 30 రోజులు మాత్రమే ఈ అవకాశముండును, మీరు ఎవరి చేతా ఎన్నుకోబడని యెడల మీరు వేరోక రాజ్యానికి తరలి వెళ్ల్లవలే అని కటినముగా చెప్పినారు..

            మిక్కిలి దుఃఖముతో యువరాణి అయిన నేను అప్పటి దాకా ఆడిన ఆటలు, చేసిన సాహస కృత్యాలు ఒకసారి నెమరు వేసుకుని అదిగినా వారందరికి అవే సమాధానాలు చెప్పి చెప్పి నాకు కలలో కూడా అవి మాత్రమే వచ్చుచుండెడివి కొన్ని దినములు.. :D ఇందులో నేను ఎదుర్కొన్న సమస్య ఏమనగా అందరూ నువ్వు ఏ సమయమునైనా నీ తిండి,నిద్ర మాని మరీ ఆడుకొనెదవా అని అడుగుచుండేవారు :( నేనసలే యువరాణిని అలా నేను ఆడలేనని కొంతమంది గుంపులో చేరలేకపోయాను. నాకున్న పరిఙ్ఞానముతో నేను ఒక గుంపులో చేరుటకు చాలా ఉత్సాహమును చూపి ఉంటిని.. ఆ విషయము కూడా మరిచిపోయి ఉంటిని,కానీ ఒక గుంపు యొక్క ప్రతినిధి వచ్చి మీరు ఆరోజు మాకు మాట ఇచ్చితిరి మా గుంపులో చేరెదమని.. ఆడిన మాట తప్పరాదు యువరాణి అని చెప్పడంతో హతాశురాలై నాకు ఇంకొక్క అవకాశం ఇచ్చిన నేను ఇంతకన్నను మంచి గుంపులో చేరెదను అని మొహమాటము లేకుండా చెప్పితిని.అయినను ఆ ప్రతినిధి నన్ను బలవంతముగా తమ గుంపులో చేర్చుకొనినారు.అప్పటివరకు నేను ఒక గాజుగదిలో ఉండేదాన్ని(private restricted area).అలాంటి నన్ను తెచ్చి ఒక గుంపులో కలిపి అందరితో పాటు రెండు కుర్చీల మధ్యలో ఇరికించి నువ్వు ఇక్కడే కుర్చోవాలి అని మొదటి ఆఙ్ఞ జారీ చేసారు..నా చేతిలో ఏమీ లేకపోవడంతో అలాగే కూర్చుని ఆ పరిసరాలకి అలవాటుపడుతూ ఉండగా నన్ను ఇంతకు ముందు గుంపు ప్రతినిధి పిలిచి నువ్వు వేరొక గుంపులో చేరితివి, అయినను ఇచ్చటనే కూర్చుని కాలక్షేపము చేయుచున్నావు. వెంటనే నువ్వు నీ గణనయంత్రమును మాకు అప్పగించి మీ గుంపుతో కలిసి కూర్చొనవలెను అని ఆఙ్ఞాపించిరి:(  అది కూడా రెండు దినములలో..దీని కొరకై మా గుంపు ప్రతినిధికి ఒక 20 లేఖలు(mails) పంపిరి.ఇక గతిలేక నేను ఆ చోటు ఖాళి చేసి నిరాశ,నిస్పృహలతో ఆ చోటుని విడిచి నా ఆటవస్తువులని అన్నిటిని సర్దుకుని కొత్త ప్రదేశానికి తరలి వచ్చితిని. కొత్త చోటు మరీ ఇబ్బందికరంగా ద్వారము మొదట్లో ఉండటం మూలంగా అటు,ఇటు తిరిగే వాళ్లు నా గణన యంత్రము వైపు ఒకసారి పరికించి వెడుతున్నారు,చాలా ఇబ్బందికరముగానున్నది. అంతేకాకుండా నాతొటి ఆడి, ముచ్చట్లు చెప్పే చెలికత్తె నాకు దూరముగానున్నది.   
               I miss my friend,place and that restricted private area :(
          వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా నిజంగా యువరాణిలా ఉండాలని అనుకుంటున్నాను..
         
                 

Friday, 1 March 2013

నేను బ్లాగుతూనే ఉంటాను


తిక్క కుదిరిందా??నాతో పెట్టుకుంటారా??

     ఏంటో ఈ మధ్య నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించేటట్టు ఆవేశంలో వ్రాసే నీ వ్రాతలు నువ్వు మాత్రమే మంచిదానివన్నట్టు ఉన్నాయి. అయినా బొమ్మకు ఒక వైపు మాత్రమే చూపి ఇంకొక వైపు చూపకపోతే బొరుసు లేదనుకుంటారు..(నా అంతు లేని ఆలోచనలు పోస్టుకు వచ్చిన ఒక మెచ్చుకోలు.)ఇది మరీ బాగుంది.. దానికి రెండోవైపు ఏముందో చూడకుండా ఉండటం మీ తప్పు.అంతే కానీ ఇలా నా బ్లాగు మీద పడి ఏడిస్తే ఏం లాభం ??
         ఈలాంటి మెచ్చుకోలు ప్రశంస విన్న తర్వాత నాకు కొన్ని అలోచనలు వచ్చాయి...వాటిలో అన్ని కాదు కొన్ని మాత్రమే.. అన్నీ వ్రాస్తే పరీక్షా హాల్లో ఇచ్చే మెయిన్ బుక్లెట్ 16 పేజీలు కూడా సరిపోవు
1. నిజంగా బ్లాగులో వ్రాసేదాంట్లో భావం ముఖ్యమా లేదా సంఘటన??
2. ఏదో ఊసుపోక కబుర్లు చెబుతూ నేను ఎవరినైనా బాధపెడుతున్నానా?
3. నా బ్లాగు వల్ల చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నానా?
4. విలువైన సమాచారం ఇవ్వనప్పుడు ఈ బ్లాగు ఎందుకు?
5. ఈ బ్లాగు వల్ల నిజంగా ఏవైనా ఉపయోగాలున్నాయా?
6. నా బ్లాగులో ఇంటిగుట్టు రట్టు చేసే పోస్టులే ఎక్కువా? 
7. అందరితోనూ ఇలా బాహాటంగా అన్ని విషయాలు చెప్పుకుంటారా?? (హవ్వా..నలుగురు చదివితే నవ్విపోదురు గాక)
8. బ్లాగు వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు ఇది ఉండటం అవసరమా??
                      ఇంత మానసిక సంఘర్షణ తర్వాత బల్గేరియా బడి పాఠంలో ఇవేవి నేర్పకుండా బ్లాగును తయారుచేసుకోవడానికి అనుమతిస్తున్న మతి ఉన్నా లేని బ్లాగర్ వారినే పూర్తిగా బాధ్యత వహించవలసిందిగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడమైనది. దానికి సంబంధించిన కేసు పూర్వాపరాలు విచారణకు గాను మళ్లీ తర్వాతి పోస్టుకు వాయిదా వేయడమైనది. :D :D
                    హమ్మా.. లేదంటే పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నా బ్లాగునే మూయించేయాలని చూస్తారా!! అంతే
మీకు తప్పదు.. ఇప్పుడైనా అర్థమైందా?? బ్లాగర్ ఉన్నంతవరకూ నా బ్లాగ్ ఉంటుంది. మీరు చదివిన, చదివి వినిపించినా, చూసి తరించినా, నన్ను ఏడిపించినా.. మీరు ఏడ్చినా :D  :D
                   నా బ్లాగు చదివి నా పైన అక్షింతలు జల్లిన మా ప్రియమైన అక్కకు, స్నేహితు"రాళ్ళు" వనజ,కావ్య,బిందు,మాధవిలకు ఈ టపా అంకితమిస్తూ.. తలనొప్పికి జండూబామ్ వాడమని ఒక చిన్న సలహా
మీ మీద జాలితో...
గమనిక:
బల్గేరియా బడిపాఠాలు ఇక్కడ http://harekrishna1.blogspot.in/
బల్గేరియా బడి విద్యార్థిగా ఆ పాఠాలు సరిగ్గా నేర్చుకోనందుకు ఆండీగారికి క్షమాపణలు చెప్పుకుంటూ ..  

Monday, 15 October 2012

అమ్మాయి మనసు..


      ఏంటో ఈరోజు నేను ఆఫీసులో ఉన్నానన్న మాటే కానీ.. ఈరోజంతా కూడలిలో ఉన్న బ్లాగులన్ని చదివి..వాటన్నిటికి స్పందించి బయటపడేసరికి సూర్యుని చుట్టూ భూమి ఒక అర ప్రదక్షిణ తిరిగి సూర్యాస్త సమయం అయ్యింది.ఏం చేస్తాం చెప్పండీ.. రేపు తొందరగా వచ్చి పని ముగించుకోవాలి.. ఈ పిల్ల టపా శీర్షిక ఒకటి పెట్టి ఇంకేదో వాగుతోందీ అనుకుంటున్నారా.. చెప్తానండీ.. ఇంక డొంకతిరుగుడు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తాను.
       అమ్మాయిలకి ఎక్కువగా కష్టపడే తత్త్వం ఉంటుంది..ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎంత కష్టపడి మా టీంలీడ్ కళ్లుగప్పి ఈ టపా ఆఫీసులో కూర్చునే వ్రాస్తున్నానో.. నా సంగతి పక్కన పెట్టి అసలు విషయం అలోచిస్తే నిజంగా పని నచ్చితే దాన్ని పూర్తి చేయకుండా వదలరు.. ఏంటీ ఏమంటున్నారు..అలాంటి నచ్చినపని అమ్మయిలకు ఎప్పుడు దొరుకుతుందా అనా..!!సెభాష్..చాలా కాలానికి ఒక మంచి ప్రశ్న మీ నోటి నుండి..వాన రావడం,ప్రాణం పోవడం ఎవరూ చెప్పలేరు...అలాంటి పనులు అమ్మయిలకు చాలా అరుదుగా కనిపిస్తాయి..కనిపించినపుడు మాత్రం వాళ్లు అవకాశం చేజారకుండా పట్టుకుని చేసేస్తారు.. నిఝ్జంగా నిజం.. నేను చేసే పని మీదా ఒట్టు.. :P :D
          మీరేదో మనసులో అనుకుంటున్నారూ ...వద్దూ...ముందే  చెప్తున్న మీకూ....!!!బద్దక జీవులు అనా!!!!!..మీరు నిజంగా ఈ విషయం ఒక అమ్మాయి చేతైనా అనిపించి చూడండి..మీరు అలా వాళ్లని ఒప్పించారో మీరు నిజంగా గొప్ప వ్యక్తి..వ్యక్తి అన్న పదం కాదు కానీ శక్తి మీరు...హ హ హ..బయటికి అనేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు.. అమ్మయిలలో ఉండే ఇంకొక గొప్ప లక్షణం తమ గురుంచి ఒక చిన్న విమర్శ కూడా తట్టుకోలేరు..చాలా సున్నింతంగా ఉంటాము మేము.. మా దగ్గర ఉన్న అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎంతటి వారైనా మాకు సపోర్టు చేస్తారు... ఇది అంత అషామాషీ అస్త్రం కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించడానికి ....మా దగ్గరున్న కన్నీటి అస్త్రమే మాకు శ్రీరామరక్ష...దీన్ని చూసిన చాలా మందికి రౌండ్లు రౌండ్లుగా ఫ్లాష్ బాక్ సీన్లు గుర్తొస్తున్నాయనుకుంటాను...మీరు మరీ అంత ఎమోషనల్ అయిపొకూడదు... కొంచెం మనసులో దైర్యం నింపుకోండి...మీరిలా డీలా పడిపొతే నా మిగతా పోస్టు ఎవరు చదువుతారూ...పెళ్లి ఆగిపోయి ఏడుస్తుంటే పెళ్లి భోజనం ఎక్కడ? అని అడిగిందంటా అనుకుంటున్నారా..సామెత నేను సొంతంగా వ్రాశాను..ఎవరూ దయచేసి దొంగలించకూడదని ప్రార్థన...హిహిహీ..అంతా మీ అభిమానం.. అదేనండి...విషయం మీరు పట్టేశారు..
            అమ్మాయిలు కొంచెం స్వార్థపరులమండి, అందుకే మేము చెప్పేది ఎదుటి వాళ్లు పూర్తిగా వినాలని అనుకుంటాము..అలా విననపుడు మా అస్త్రాన్ని ప్రయోగించి వినేలా చేస్తాము..మీరు లాజిక్ పట్టేశారనుకుంటా..నేను అస్త్రాన్ని ప్రయోగించకుండా బుద్ధిగా వింటున్నారు..ఈసారి అస్త్రం సంధించకుండా వుండాలంటే,ఇలా పూర్తిగా వినండి అమ్మాయిలు  చెప్పేది... విన్నట్టు నటిస్తాము అంటారా..మీ వేలితో మీ కన్నే  పొడుచుకుంటాము అంటె నేను మాత్రం ఏం చేయగలను.. మధ్యలో నేను ఇప్పుడు ఏం చెప్పానో తిరిగి చెప్పు లాంటి సిలబస్లో లేని ప్రశ్నలు ఎదురవుతాయి...అందుకే నా ప్రియ శిష్యులారా..జాగ్రత్తగా వినండి..తడుముకోకుండా జవాబులు చెప్పి నా శిష్యులనిపించుకోండి..ఏమిటిది గురువరిణి!మా యందు మీ ప్రేమా,ఆపేక్షా ఇంతయేనా!!!!అని విలపించకండి,ఉపాయం ఉన్నది..మీరు వినినా..వినకపోయినా.. అవును...నువ్వు చెప్పింది నిజమే సుమా.. నేనసలు అలా అలోచించనే లేదూ అని పొగిడి..పొగిడినా అనుమానం రాకుండా చూసుకోండి... అస్తు...విజయోస్తు...
శుభం కార్డు వేయట్లేదు నాయనా....మిగతా భాగం తర్వాత వివరిస్తాను.... 
     ఇప్పుడు మీరు నిఝ్జంగ ఈ టపా చదివుంటే మీకొక అనుమానం వచ్చుండాలి, ఎందుకు ఈ పోస్టులో ఇన్ని చుక్కలున్నాయి అని...... వచ్చిందా? అమ్మాయి మనసు తెలుసుకోవడం కంటే ఆ ఆకాశంలోని చుక్కలు లెక్కపెట్టడం సులభం అని నేను అంతర్లీనంగ ఇవ్వదలచుకున్న సందేశము. లేదూ మేము ప్రయత్నిస్తాము అంటె..మీకు విజయోస్తు..