Wednesday, 22 May 2013

అనగనగా యువరాణి

                   మ్మ్ ఏంటో ఈ జీవితం చడి,చప్పుడు లేకుండా చప్పగా, అప్పుడప్పుడు కొన్ని కష్టాలతో.. అప్పుడప్పుడు జీవితం అంటే ఇంతేనా అని అనిపించే విధంగా సాగుతూ నిజం చెప్పాలంటే సాగుతూఊఊఊఊఊఊఊఊఉ ఉంది. ఏం చేస్తాం మనం కూడా దానితో పాటే సాగాలిగా...ఈ సాగింపు చర్య ఏంటీ అంటారా ?? మనం అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాలి మరి..
     అనగనగా ఒక పేద్ద సాఫ్ట్వేర్ కంపెనీ.. అందులోకి ఒక బుల్లి యువరాణి..ఎవరా అని బుర్ర బద్దలుకొట్టుకోకండీ(నేనే మరి)..మరేమో నేను యువరాణి కదా అందుకని నాకు మొదట్నుంచి ఆటలో అరటికాయ టైపులో అందరు చిన్న చిన్న పనులు చెప్పి నా చేతులు కందకుండా గారాభంగా చూసుకున్నారు..ఇలా యువరాణి వారు రోజు ఆటవిడుపు కోసం ఆఫీసుకు రావడం నచ్చని మంత్రివర్యులు(మెనేజరు) వారు మెల్లిగా ఈ విషయాన్ని రాజా(డెలివరి మెనేజరు) వారి చెవిలో ఊదేసారు. పాపం కొంచెం ఘాట్టిగానే ఊదారేమో చెవి కందిపోయి దానికి వెంటనే చర్య తీసుకునేలా హుకూం జారీ చేసారు..

             మరి యువరాణి వారికి ఈ విషయం తెలియగానే ఎలా స్పందిస్తారో అని రాజా వారు తటపటాయించి ఒక సమావేశం ఏర్పాటు చేసి, యువరాణి!! మీరు ఆడి,ఆడీ పాడు చేసినది చాలు మా శీఘ్రగణనయంత్రమును..మీరు వెరక చోటికి వెళ్లి ఆడుకొనుము..(గూడార్థము మీరింకొక ఉద్యోగమును వెతుక్కొనుము అని)..వెంటనే వూహించని ఈ పరిణామమునకు యువరాణి కనులలో నుంచి జాలువారు అశ్రువులను నియంత్రించుకుని, నన్ను ఒక జట్టుతో కలిపి చూడుడి, నా ప్రతిభను చూపించెదను అని మంగమ్మ శపతమును పూనిన వెంటనే.. మిక్కిలి ఆనంద భరితుడైన రాజా వారు నన్ను ఒక గుంపులో చేర్చిరి..(ఏ గుంపు అనా మీ అనుమానం, నా లాంటి అరటికాయలందరి గుంపులో :) ) మీరు ఇప్పుడు అందరి చేతా పరీక్షంచబడి ఒకరి చేత ఎన్నుకోబడతారు..అయితే ఒక నియమము అని ఒక రహస్యమును నా చెవిలో వేసినారు..అది ఏమనగా ఒక్క 30 రోజులు మాత్రమే ఈ అవకాశముండును, మీరు ఎవరి చేతా ఎన్నుకోబడని యెడల మీరు వేరోక రాజ్యానికి తరలి వెళ్ల్లవలే అని కటినముగా చెప్పినారు..

            మిక్కిలి దుఃఖముతో యువరాణి అయిన నేను అప్పటి దాకా ఆడిన ఆటలు, చేసిన సాహస కృత్యాలు ఒకసారి నెమరు వేసుకుని అదిగినా వారందరికి అవే సమాధానాలు చెప్పి చెప్పి నాకు కలలో కూడా అవి మాత్రమే వచ్చుచుండెడివి కొన్ని దినములు.. :D ఇందులో నేను ఎదుర్కొన్న సమస్య ఏమనగా అందరూ నువ్వు ఏ సమయమునైనా నీ తిండి,నిద్ర మాని మరీ ఆడుకొనెదవా అని అడుగుచుండేవారు :( నేనసలే యువరాణిని అలా నేను ఆడలేనని కొంతమంది గుంపులో చేరలేకపోయాను. నాకున్న పరిఙ్ఞానముతో నేను ఒక గుంపులో చేరుటకు చాలా ఉత్సాహమును చూపి ఉంటిని.. ఆ విషయము కూడా మరిచిపోయి ఉంటిని,కానీ ఒక గుంపు యొక్క ప్రతినిధి వచ్చి మీరు ఆరోజు మాకు మాట ఇచ్చితిరి మా గుంపులో చేరెదమని.. ఆడిన మాట తప్పరాదు యువరాణి అని చెప్పడంతో హతాశురాలై నాకు ఇంకొక్క అవకాశం ఇచ్చిన నేను ఇంతకన్నను మంచి గుంపులో చేరెదను అని మొహమాటము లేకుండా చెప్పితిని.అయినను ఆ ప్రతినిధి నన్ను బలవంతముగా తమ గుంపులో చేర్చుకొనినారు.అప్పటివరకు నేను ఒక గాజుగదిలో ఉండేదాన్ని(private restricted area).అలాంటి నన్ను తెచ్చి ఒక గుంపులో కలిపి అందరితో పాటు రెండు కుర్చీల మధ్యలో ఇరికించి నువ్వు ఇక్కడే కుర్చోవాలి అని మొదటి ఆఙ్ఞ జారీ చేసారు..నా చేతిలో ఏమీ లేకపోవడంతో అలాగే కూర్చుని ఆ పరిసరాలకి అలవాటుపడుతూ ఉండగా నన్ను ఇంతకు ముందు గుంపు ప్రతినిధి పిలిచి నువ్వు వేరొక గుంపులో చేరితివి, అయినను ఇచ్చటనే కూర్చుని కాలక్షేపము చేయుచున్నావు. వెంటనే నువ్వు నీ గణనయంత్రమును మాకు అప్పగించి మీ గుంపుతో కలిసి కూర్చొనవలెను అని ఆఙ్ఞాపించిరి:(  అది కూడా రెండు దినములలో..దీని కొరకై మా గుంపు ప్రతినిధికి ఒక 20 లేఖలు(mails) పంపిరి.ఇక గతిలేక నేను ఆ చోటు ఖాళి చేసి నిరాశ,నిస్పృహలతో ఆ చోటుని విడిచి నా ఆటవస్తువులని అన్నిటిని సర్దుకుని కొత్త ప్రదేశానికి తరలి వచ్చితిని. కొత్త చోటు మరీ ఇబ్బందికరంగా ద్వారము మొదట్లో ఉండటం మూలంగా అటు,ఇటు తిరిగే వాళ్లు నా గణన యంత్రము వైపు ఒకసారి పరికించి వెడుతున్నారు,చాలా ఇబ్బందికరముగానున్నది. అంతేకాకుండా నాతొటి ఆడి, ముచ్చట్లు చెప్పే చెలికత్తె నాకు దూరముగానున్నది.   
               I miss my friend,place and that restricted private area :(
          వచ్చే జన్మలోనైనా ఇలా కాకుండా నిజంగా యువరాణిలా ఉండాలని అనుకుంటున్నాను..
         
                 

4 comments:

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.