నా జీవితంలొ నన్ను నవ్వించిన విషయాలు, అబ్బురపరచిన సంఘటనలు, అలోచింపచేసిన సంగతులు, స్పూర్తి నింపిన వ్యక్తులు ఇలా ఎన్నెన్నో చెప్పాలని......
Monday, 14 January 2013
Friday, 4 January 2013
నా ఆలోచనలు మాత్రమే
జీవితంలో బాగా స్థిరపడి మంచి ఉద్యోగంలో చేరి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లి,తండ్రి వాళ్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి నూరిపోసే మాటలు ఇవి. చిన్నప్పుడు బాగా చదివి, మంచి
మార్కులు తెచ్చుకుని కష్టపడి పై చదువులు చదివి తప్పటడుగు వేయబోయిన ప్రతిసారి అమ్మ,నాన్నల
శ్రమను, మన పైన ఉన్న కొండంతటి ఆశల్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ మనసుని నియంత్రించుకుని సరైన
మార్గంలో నడుస్తూ సాగిస్తున్న ఈ జీవన ప్రయాణంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు...
అందవిహీనంగా ఉంటానని, చక్కని మాటలు పలుకుతున్నా నా గొంతుక మధురమైన
కోయిల పాటలా కాకుండా గార్ధభస్వరమని నా బాల్యంలో తోటి విద్యార్థులు చేసిన అవహేళన తలుచుకుని
అప్పటి నుండి ఇంకెవరితోనూ కలవకుండా, నా గొంతుక నుంచి మాట పెగల్చకుండా ఒంటరిగా ఆ పసి మనసు తల్లడిల్లితే దానిని ఎలా ఊరడించాలో తెలియక ఎందుకు నాకీ పుట్టుక అని అనిపించిన క్షణాన్ని నా మనసు
నుంచి ఎవరు చెరిపేయగలరు?? ఒక్క నా మరణం తప్ప!!! అప్పటి నా పసిమనసుకి అర్థమైన విషయం ఈ
లోకంలో బ్రతకడానికి కావాల్సిన అర్హతల్లో ముఖ్యమైనది.. అందమని!!
చదువులో ఎంత ముందంజ వేసినా సాటి విద్యార్థుల నుంచి వచ్చే అవహేళనలు, చీత్కారాలు..
నా హృదయాన్ని అమితంగా గాయపరిచాయి. పాతబడిన దుస్తుల్ని చూసి అవహేళనగా అరుస్తూ నా పేదరికాన్ని వెక్కిరించిన వాళ్ల సౌభాగ్యానికి బాధపడాలో, లేదంటే అమ్మని వెళ్లి ఎందుకు రోజు ఇంత పాతబడిన బట్టల్ని వేసుకుంటున్నానని అడగాలో తెలీదు. అసలు మేము అలాంటి పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నామో నిజంగా తెలియకుండానే నా బాల్యం గడిచింది.
ఇన్ని బాధల మధ్య నాకు తెలిసింది ఒక్కటే, చదవాలి అని!! చదివితే ఉద్యోగం
వస్తుంది,మంచి పేరు వస్తుంది. నేను అందంగా లేకపోయినా, నా స్వరం బాగోకపోయినా నన్ను అందరూ
గౌరవంగా చూస్తారు అనే ఒక గుడ్డి నమ్మకంతో చదివాను. ఇప్పుడు నన్ను చూసి మొహం పైనే ఎవరూ
మాటలు అని నన్ను కించపరచకపొయినా వెనకాల ఇంకా అవహేళనలు ఉన్నాయి. కానీ అవన్నీ
మనసులో ఒక న్యూనతా భావాన్ని బలపరిచాయి.
ఇంక కాలేజి స్నేహాలు దాదాపు డబ్బుతో ముడిపడి అప్పటి దాకా తెలియని ఒక రంగుల
ప్రపంచం.ఇలా కాలేజిలో మాటి మాటికి జరిగే అట్టహాసంగా జరిగే పార్టీలకు వెళ్లకుండా ఉండేది, పొగరుతో
కాదని ఆ ఒక్క పార్టీకి ఇచ్చే డబ్బుకోసం అమ్మ,నాన్న ఎంత కష్టపడతారో చెప్పి వాళ్ల జాలి మాటలు
వినడం ఇష్టంలేక ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. దాన్ని వాళ్లంతా
వినడం ఇష్టంలేక ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. దాన్ని వాళ్లంతా
ఎవరితో కలవడానికి ఇష్టపడని ఒక వింతజీవిగా భావించి మెల్లిగా ఇలాంటి విషయాల్లో నన్ను అడగడమే
మానేశారు. జీవితం నేర్పిన మరొక పాఠం నాకు, నా స్నేహితులకు మధ్య స్నేహం మనుగడకు
కావల్సినది డబ్బు అని ...
అందుకే స్నేహం ఏది ఆశించదు అన్న మాట విన్న ప్రతిసారి అదొక అతిశయోక్తిగా అనిపిస్తుంది.
కొంతమంది నన్ను తక్కువచేసి మాట్లాడి వాళ్ల స్నేహితుల ముందు నన్ను చిన్నబుచ్చిన సందర్భాలు
ఎన్నో.. అందుకే ఒకరితో స్నేహానికి వందసార్లు ఆలోచిస్తాను.. వాళ్ల జీవితంలో నేను వాళ్లకి సముద్రంలో
ఒక చిన్న నీటిబొట్టే కావొచ్చు, కానీ వారి స్నేహం నా జీవితానికి చాలా ముఖ్యమైనదని నాకు మాత్రమే
తెలుసు. స్నేహానికి కూడా పరపతి కావాలనే మనుషుల మధ్య ఉన్న నాకు నా స్నేహంకోసం చేతులు
చాచే ప్రతిఒక్కరిని చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది. కానీ మనసులో ఒక చిన్న ఆందోళన కుడా.. నా
నుంచి వీళ్లు నిజంగానే ఏమి ఆశించట్లేదా అని? నిజజీవితంలోనే నాకు దొరకని స్నేహం ఇక
ముఖపుస్తకంలో, జి-మెయిల్ లో ఇచ్చే స్నేహాల్లో ఉంటుందని నేను నమ్మను ఖచ్చితంగా. అటువంటి
స్నేహాలు మళ్లీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న తర్వాత కొనసాగుతాయన్న నమ్మకం నాకు లేదు.
నా జీవితం నాకు నేర్పిన పాఠం ఎవరితోనైనా ఎంత తొందరగా దగ్గరైతే, అంత తొందరగానే విడిపోతానని..
కొంతమంది వాళ్లకు నచ్చినట్టుగా నేను మారాలని ఆశిస్తారు. నన్ను నన్నుగా ఎందుకు స్వీకరించరో
అర్థం కాదు నాతో స్నేహమే ముఖ్యమైనపుడు. మొహం పైనే నచ్చని విషయాన్ని చెప్పకుండా వారి
వెనకాల దొంగచాటుగా నవ్వడం ఎంత వరకు కరెక్టో నాకర్థం కాదు.
కొంతమంది వాళ్లకు నచ్చినట్టుగా నేను మారాలని ఆశిస్తారు. నన్ను నన్నుగా ఎందుకు స్వీకరించరో
అర్థం కాదు నాతో స్నేహమే ముఖ్యమైనపుడు. మొహం పైనే నచ్చని విషయాన్ని చెప్పకుండా వారి
వెనకాల దొంగచాటుగా నవ్వడం ఎంత వరకు కరెక్టో నాకర్థం కాదు.
నా జ్ఞాపకాల తుట్టను కదిపితే కదిలిన తేనెలాంటి మధురమైన నా జీవితానుభవాలు.. అవెంత
మధురమో నా కంటి కనుపాప నుంచి జాలువారిన అశ్రువులు చెబుతున్నాయి..
Subscribe to:
Posts (Atom)

