Wednesday 8 May 2013

సరదాగా---My Exam experience

                  జీవితం సాఫీగా,ఒకేరకమైన దినచర్యతో సాగిపోతుంటే ఏదో కోల్పోయామన్న భావం కలుగుతుంటుంది. అలా నేను కూడా రొటీన్ గా ఫీల్ అయ్యి మనం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి బదులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే మన జీవితానికి ఇక ఏ ఢోకా ఉండదనుకుని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు ఏదో పిఓ ఉద్యోగాలకు ఒక పరీక్ష పెడుతున్నారని చివరాఖరి వారంలో తెలుసుకుని నేను తీరిగ్గా చివరి తేదికి ముందు దానికి అప్ప్లై చేశాను.
          అసలే మనం ఏం చేసినా దరిద్ర దేవత వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. సో నేను ఆన్ లైన్లో అప్ప్లై చేయగానే నాకు ఆ సైట్లో సమస్యుందని ఒక సందేశం నా కంప్యూటర్ పైన కనబడింది. అయినా మనకు ఇంక హాల్ టికెట్టు ఎలాగు రాదనుకుని ఊపిరి పీల్చుకున్నాను.. కొద్ది రోజుల తర్వాత నా బ్యాంకు అక్కౌంటులో డబ్బులు జమ కాకపోవడంతో ఏదో తేడా జరిగందనుకుని ఇంక ఆ విషయం అంతటితో మర్చిపోయాను.
           ఒక శనివారం మధ్యాహ్నం పని పాటా లేకుండా తీరిగ్గా ఏం చేయాలో తెలియక మా గది పైకప్పు వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా మొబైల్ వైబ్రేట్ అయితే ఏదో మెస్సేజ్ వస్తే ఏదో పిచ్చి మెస్సేజ్ అని డిలీట్ చేయబోయి..ఎందుకో చూస్తే ఏముంది?!ఎస్.బి.ఐ వారి నుంచి హాల్ టిక్కెట్టు పంపించామని సందేశం. రెండు వారాల ముందు ఈ విషయం తెలిసినందుకు నవ్వాలో,ఏడ్వాలో అర్థమవక ఆ నిముషంలో నవ్వుకుని పుస్తకాలు దుమ్ము దులిపి చదవడం ప్రారంభించాను.
           ఇక పరీక్షకు చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఒకటే కలలు.. పరీక్ష సెంటరుకి ఆలస్యంగా వెళ్లానని.
ఎందుకంటే ఉదయం ఎనిమిదింటికి అని ఒక భయం..రోజు బారెడు పొద్దెక్కినా కళ్లు తెరవని నాకు ఆ భయంతో రోజు అలాంటి కలలే వచ్చేవి..:( ఎందుకైనా మంచిదని మా అమ్మకు ముందే చెప్పి పెట్టాను, ఎలా అయినా లేపమని..పరీక్ష ముందురోజు రాత్రి ఎంతసేపటికి నిద్రపట్టదు,ఒక లాంటి ఆతృత ఎగ్జాం ఎలా వ్రాస్తానా అని.. అయినా ఏమి ప్రిపేర్ అవ్వకుండా వ్రాసే నాకే ఇలా ఉంటే ఇంకా దాని కోసం రాత్రి,పగలు కష్టపడే వాళ్ల గురించి తలుచుకుని నా హంగామాకు తెగ నవ్వుకున్నాను.ఉదయం నాలుగింటికే లేచి ఒకసారి అన్ని మననం చేసుకుని తయారయ్యి చూస్తే ఎంతసేపటికి నేను ఎక్కవలసిన బస్సు రావట్లేదు :( మా స్టాపులోనే ఒక 25 మంది ఎక్కారు. అయినా ఈ సాఫ్టువేరుల పైన జనాలాకి ఎంత నమ్మకముందో అప్పుడు అర్థమైంది. నిలబడడానికి చోటు లేదు..అలా చచ్చి చెడి ఎగ్జాం సెంటరుకి చేరుకున్నాను..
               నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా కాదు, రెండు వారాల ముందు చదివితే ఇలాగే ఉంటుందని నాకు నేనే ధైర్యం చెప్పుకుని వెళ్లాను. పరీక్ష సెంటరు దగ్గర అందరూ తెగ పుస్తాకాలు చదువుతున్నారు, నాకు అప్పుడే పరీక్ష పేపర్ ఏమైనా లీక్ అయ్యిందేమోనని అనిపించింది. నేను కూడా నా పక్క అమ్మాయి పేపర్లోకి తీక్షణంగా చూసాను, ఆ అమ్మాయి సరే అని నా వైపు ఒక జాలి చూపు విసిరి నాకే ఆ కాగితం ఇచ్చి చదివేసి ఇచ్చేయ్ అంది.  నా నంబరు ఉన్న గదికి వెళ్లి చూస్తే ఒక నంబరు తప్పుగా వేసి బోర్డు పైన అందరిని హడలగొట్టారు.
                              పరీక్షకి వెళ్లి చూస్తే అప్పటికప్పుడు చదివిన వాటిలోంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. అయినా ప్రశ్నాపత్రం ఇంత సులభంగా వస్తే మనకు ఇంత పోటిలో వస్తుందా అనే అనుమానం ఇప్పుడు...17 లక్షల మంది పోటిపడితే అందులో ఒక 4500 మందిని మాత్రమే తీసుకుంటారు, అయినా కానీ మనిషి ఆశజీవి అని అనడానికి నేనే ఒక ఉదాహరణ:)లేకపోతే ఈ లోకంలో మన మనుగడ కష్టమవుతుందెమో ఇలాంటి ఆలోచనతత్త్వం లేకపోతే కొన్ని  సమయాల్లో:) కానీ ఇంకా బాగా వ్రాసుండాలి అని అనిపించింది. ఏం చేస్తాం ఆ బుద్ధి ముందుండాలి కదా!!! 

2 comments:

  1. బాగుంది చిన్ని మీ సరదా ఎగ్జాం ఎక్స్ పిరియన్స్....ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ వుంటాయి..తక్కువ పోస్టులకు ఏంతో మంది పోటి పడుతున్నా మనకు రాకపోతుందా అనే చిన్న ఆశతో పోటి పరిక్షలతో కుస్తి పడుతూనే వుంటాం. ఏంతైనా ఆశా జీవులం కదా....

    ReplyDelete
  2. ధన్యవాదాలు డేవిడ్ గారు మీ వ్యాఖ్యకు. అంతే కదండీ.. ఆశాజీవులం:)

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.