Tuesday 25 September 2012

కోల్పోతున్న అనుభూతులు

         ఈరోజేందుకు ఇంత హుషారుగా ఉన్నావ్? ఏంటి ఏదైనా విశేషమా?
         పొద్దున్నే సంతోషంగా గడిపేశాను, అందుకే ఈ హుషారు,ఉత్సాహం.
         ఓహ్ అంతేనా.. నేను ఇంకా ఏదో అనుకున్నానులే..
         నువ్వు ఏమనుకున్నావ్ ? మొదట నువ్వు చెప్పు నా  హుషారుకి కారణం ఏమిటో.. ఆ తర్వాత నేను చెప్తాను..
        ఉహూ..అలా ఏమి కాదు .. నువ్వు ముందు చెప్పు..
         నా హుషారుని కళ్ళతోనే గమనించింది నువ్వే కాబట్టి నువ్వే చెప్పు.. నాకు కూడా కుతూహలంగా వుంది నా గురుంచి నీ ఆలోచనలేమిటో అని ....
      చివరికి నీ మాటల గారడితో నా చేతే చెప్పిస్తున్నావన్న మాట.. అలాగే ఇంక నువ్వు ఇంత చెప్పిన తర్వాత నేను కాదనేదేముంది.. నేనే చెప్తాను..కాని చెప్పిన తర్వాత నన్ను ఏమి అనకూడదు..అనుకోకూడదు.
      అయినా నా మనసులో మాటలను నేను చెప్పక ముందే ఊహించి చెప్తున్న నీకు నేను నీ గురుంచి ఏమనుకున్నా తెల్సిపోతుందిలే.. బాధపడకు..
       నీకు ప్రమోషన్ వచ్చిందని నీ మేనేజర్ నీకు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పాడు.
       ఓసి నా పిచ్చిమొహమా! ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్టు నువ్వు మన ఆఫీసు చరిత్రలో కన్నావా?విన్నావా? పని చెప్పడానికే కాని,ఇలాంటి శుభవార్తలు ఫోన్లలో చెప్పే ఆచారం ఇంకా మన దాకా రాలేదు. వస్తే మొదట నీకే  చేసి చెప్తారు :).  
          ఇంతకు మించి నేను ఇంకా చెప్పానంటే నువ్వు ఇప్పుడు నాకొక పేద్ద క్లాసు తీసుకుంటావు కాని.. నువ్వు అనుభవించిన హుషారుకి కారణాలేంటో చెప్పు తొందరగా.. అవతల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి.
          హ.. నీ తొందర నాకు అర్థమైంది. అయితే దీన్ని మళ్లీ మనం తీరికగా మాట్లాడుకుందాం. ఇలా హడావుడిగా అయితే వద్దు.
          నీకు హడావుడి ఉండకూడదు అంటే మనం ఈరోజు సెలవు పెట్టి హాయిగా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోవాలి.
          సరేలే  నువ్వు తీరికగా ఉన్నపుడు నువ్వు  నన్ను పిలువు.. అలా బయటికి వెళ్లి మాట్లాడుకుందాం.
             అయినా నువ్వు భలే మాటకారివి, విషయం చెప్పకుండా దాటేస్తున్నావు .నీకు ఏది ఎక్కువ ఉషారుని ఇచ్చిందో తెలుసుకోలేకపోయాను. నీ మాటల కోసం తీరికగా వున్నప్పుడు వస్తాను.
                  *************************************************************
           అలా ఏదైనా రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందామా?
           రెస్టారెంట్లో వద్దు. అలా నడుస్తూ మాట్లాడుకుందాం.నేను ఈరోజు చాలా ఆనందంగా గడిపాను. నేను చాలా రోజుల తర్వాత కొత్త అనుభూతికిలోనయ్యాను . ఉదయాన్నే ఒక చక్కని కాఫీని ఆస్వాదిస్తూ చుట్టూ ఉన్న పక్షుల కిలకిలారావాలు వింటూ, అప్పుడే పైకి వస్తున్న అరుణ వర్ణంలో ఉన్న సూర్యున్ని చూస్తూ ఇన్ని రోజుల నుంచి ఈ అనుభూతిని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నాను.
            ఎప్పుడూ లేనిది.. ఇవాళ గుడికి వెళ్లాలని అనిపించింది. ఉదయాన్నే సూర్యుని కిరణాలు గుడిలో ఉన్న మూలవిరాట్టు ఫై పడి మరింత శోభాయమానంగ ఉంది. గుడిలో పూజారి గారి లయబద్ధమైన మంత్రోచ్చారణ, గుడిలో నుండి వస్తున్న పాటలు. నిజంగా ఇవన్నీ నా చుట్టూనే ఉండి ఇన్ని రోజులు ఇంత మంచి అనుభూతుల్ని మిస్ అయినందుకు బాధపడ్డాను.
         ఉదయాన్నే కావడంవల్ల రహదారులన్నీ అంత రద్దీగాలేవు. రోజూ గంటపైనే పట్టే ఆఫీసు ప్రయాణం ఒక అరగంటలోనే అయిపొయింది. నేను తొందరగా రావడంవాళ్ళ కొంచెం కంగారుతగ్గి పని సాఫీగా జరిగిపోయింది..
        నీ అనుభవం విన్నతర్వాత మనం రోజు మన చుట్టూ జరిగే వాటిని కూడా వదిలేసి ఏదో అందని దానికోసం యాంత్రికంగా పరిగెడుతున్నామని అనిపిస్తుంది.మంచి అనుభూతిని పంచుకున్నావ్.
          ఒక కప్పు కాఫీ, సూర్యోదయం, చల్లని సాయంత్రాల్లో చల్ల గాలికి ఇంట్లో వాళ్లతో కబుర్లు చెపుతూ కాలాన్ని కూడా మర్చిపోయే సందర్భాలు...ఇవన్ని మనం రోజు కొని ఆనందిస్తున్న సినిమా టికెట్లలోనో, షాపింగ్ మాల్లలో వేలుపోసి కొంటున్న వస్తువుల్లోనో ఉందంటావా?!!! 
          హూ.. మనం మన దగ్గర ఉన్న సంతోషాన్ని వదిలేసి లేని దాని కోసం పాకులాడుతున్నాం. చివరికి మనం పోగుట్టుకున్నది తెలుసుకునేసరికి దాన్ని తిరిగి పొందలేము... 
     
          

4 comments:

  1. show me ur profile friend and add some gadges

    ReplyDelete
  2. i think u r the fresher one for blogging just add follower gadge bcz i dont knw how to add ur blog in my list for forther visiting

    ReplyDelete
  3. మనం మన దగ్గర ఉన్న సంతోషాన్ని వదిలేసి లేని దాని కోసం పాకులాడుతున్నాం. చివరికి మనం పోగుట్టుకున్నది తెలుసుకునేసరికి దాన్ని తిరిగి పొందలేము... ee matalu chala chala bagunnai chinni

    ReplyDelete
  4. శ్రీ గారు, నా బ్లాగుకు స్వాగతం.ధన్యవాదాలు.

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.