Wednesday, 3 October 2012

నేను చూసిన సినిమా

ముందుగా మా ఆఫీసు సెలవు పట్టిక చూసుకోకపోవడం వల్ల అనుకోకుండా ఊరికి వెళ్లకుండా హైదరాబాదులో ఉండాల్సివచ్చింది.ఎలాగూ మనం ఎంత ఆనందించాలన్న ఉన్న ఒకే సౌకర్యం సినిమానే కాబట్టి. సినిమాకి తప్పక వెళ్లాల్సొచింది.
     మొన్ననే శేఖర్ కమ్ముల మీద నమ్మకంతో చూసిన "life is beautiful" సినిమాకి అమృతాంజన్లు ఒక డజను ఖర్చు అయినా..మళ్లీ ఎందుకో సినిమాలు చూడకూడదు అనుకుంటూనే సినిమా టిక్కెట్లు బుక్ చేశాను. ఇంతకి నేను చూసిన సినిమా ఏంటంటే రెబల్.. ఏంటి అలా బ్రౌజర్ మూసేస్తున్నారు..మిమ్మల్నే..కొంచెం చదవండీ నా గోడు..మీకు టిక్కెట్ల ఖర్చులేకుండానే కథ చెప్పేస్తాను..అదే మరి నా మంచితనం :) :)..
     సినిమాకి బయల్దేరే ముందు నుంచి వర్షం పడుతూనే ఉంది. సినిమాకి వెళ్దామా?వద్దా? అనుకుంటూ ఉండగానే వర్షం ఆగింది. హమ్మయ్య..ఇక బయల్దేరోచ్చు అని బయల్దేరి సగం దూరం వెళ్లే సరికి మళ్లీ మొదలైంది.. ఇక వర్షంలో వెళ్లలేక స్నేహితులమంతా వర్షం ఆగేలోపు ఒక చిన్న చర్చ పెట్టాము..
    ఈ సినిమాలో కామెడీ ఉంటుందా? ఇంతకి కథ మొత్తం మాస్ తరహాలో ఉంటుందేమో? డ్యాన్స్ లేకుండా లారెన్స్ సినిమా ఉంటుందా? అని నేను అడగ్గానే నా మీద మాటలతో యుద్దానికి దిగారు.. అయినా నువ్వేంటి..ప్రభాస్ నీకు కామెడి యాక్టర్ లాగా కనిపిస్తున్నాడా? ప్రభాస్ సీరియస్ గా ఫైట్లు చేస్తాడే తప్ప..కామెడి చేయడు అని మా ఫ్రెండ్ జోస్యం చెప్పింది.. లారెన్స్ నీకు డాన్స్ లేకుండా సినిమా తీయడమా? అది దాదాపు అసంభవం అని మా ఫ్రెండ్ అరిచిన అరుపుకి పాపం వర్షం కూడా ఆగిపోయింది.:)
      సినిమా థియేటర్లోకి వెళ్లేసరికి ఇంకా సినిమా మొదలవలేదు. హమ్మయ్య అని కూర్చున్న తర్వాత ఆట మొదలైన 15 నిమిషాలకి అసలు సినిమాని జీర్ణించుకోలేని సందర్భంలొ ఎవరివో కాలి మేజోళ్లు ఉతకనట్టున్నారు..అబ్బబ్బ..ఆ సువాసనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. దరిద్రం మనల్ని ఈరోజు వదలదని సినిమా చూడటం మొదలుపెట్టాను. ఈ సినిమాలో తమన్నాని చూసి కొంచెం పోల్చుకోలేకపోయాను..బాగా సన్నబడింది..లారెన్స్ గారు కొంచెం వైవిధ్యాన్ని ప్రదర్శించాలని హీరో గారి కోసం పెట్టే "introduction song" తనకి పెట్టి తన చేత స్టెప్పులు వేయించారు. బ్రహ్మానందం, కోవై సరళ గారి హాస్యం ఎవరికైనా హాస్యం అనిపిస్తే గట్టిగా నవ్వుకోండి. తర్వాత వాళ్లు ఉండరు సినిమాలో.హీరో గారి పరిచయం  హైదారబాదులొ మొదలైనా అతను వెతికే రౌడీ దగ్గరి PA గారి కూతురు bangkokలో ఉందని తెలిసి హీరో అక్కడికి వచ్చి తనకి కావల్సిన విషయం తెలుసుకుంటాడు. ఇక్కడితో విరామం. హమ్మయ్య... ఈ దుర్గంధం నుంచి బయటకెళ్లి ఏమైనా తెచ్చుకుందామని వెళ్లి వాటిని తినలేమని గ్రహించి తిరిగి వచ్చే సరికి ఇంకొక కొత్త కథనాయిక కనిపించింది. నాకు ఇంకొక కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అక్కడ మన హీరో గారి  తల్లిదండ్రులు,ప్రియురాలు చనిపోతారు. సినిమా చివరికి హీరో గారు పగ తీర్చుకుని విజయం సాధిస్తారు. నాకు ఈ సినిమాలో ఒక డైలాగు నచ్చింది.
     హీరో అలీతో నాకు పాటలు రావు.. కాని నా దగ్గర అన్ని సంగీత దర్శుకుల CDలు అన్ని ఉన్నాయి అని అంటాడు. సంగీత దర్శకత్వం వహించిన లారెన్స్ తన మీద వేసుకున్న సెటెయిర్ అని నేను అనుకున్నాను.
     ఇందులో రెండు ఫైట్లు మాత్రం అలరిస్తాయి. ప్రభాస్ ఫాన్స్ ఎన్ని సార్లైనా ఈ సినిమా చూడగలరు..కానివారు కొంచెం అలొచించి వెళ్లండి..  
PS: ఈ టపాలోని మాటలు కేవలం నా అభిప్రాయం మాత్రమే.                                   
    

Thursday, 27 September 2012

అమ్మ జ్ఞాపకాలు

                         నేను సరిగ్గా 23 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకొచ్చాను.  నేను పుట్టినపుడు మా తాతగారు మళ్లీ ఆడపిల్లేనా? అని మా అమ్మను కసురుకుని నన్ను నెల రోజుల వరకు చూడలేదు అని మా అమ్మ ఇప్పటికి చెప్తుంటుంది. అప్పటి మేమున్న పరిస్థితుల్లో ఆడపిల్లంటే పోషణభారం అని అనుకుని ఉంటారు. అప్పటి కాలానికి ఇంకా అమ్మాయిలు చదివి ఉద్యోగాలు చేసేంత లేదు సమాజ పరిస్థితి.అందులోనూ అమ్మాయిలకు కట్నకానుకలిచ్చి పెళ్లి చేయాలి అని సమాజం ఆలోచించేది.అందుకు తాతగారు మినహాయింపు కాదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మా ఇంటి రేషన్ కార్డులో రెండపేరు అబ్బాయిపేరు రాయించారు నేను పుట్టకముందే అబ్బాయే పుడతాడు అనుకుని. నేను ఈ విషయంలో ఇప్పటికి  మా అమ్మవాళ్ళతో గొడవచేస్తుంటాను.
                   నేను పుట్టే సమయానికి మేము దిగువమధ్యతరగతి వాళ్ళం. మా అమ్మవాళ్లు  ప్రసవం అయిన నెలరోజులకే ఇంటిపనులన్నీ చేసుకునవాళ్ళంట. మా అమ్మగారికి 3 సంవత్సరాల వయసులోనే మా
అమ్మమ్మగారు చనిపోయారు.మా అమ్మని జాగ్రత్తగా చూసుకునే మా మామయ్య నేను పుట్టిన 2 సంవత్సరాలకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను 5వతరగతి చదువుతున్నపుడు ఒకసారి మా ఊరికివచ్చారు. వచ్చినా తన విషయాలేవీ మాకు చెప్పలేదు. మా అమ్మ గారికి వున్న ఒక్క అక్క bonemarrow cancer తో చనిపోయింది. మా అమ్మ కుటుంబం తరపు మాకు ఎలాంటి ఆదరణలేదు. ఈ విషయాల్లో మా అమ్మగారు చాలా బాధపడుతుంటారు ఇప్పటికి.
                   మా అమ్మ ఆ కాలంలోనే SSLC చదివింది.తర్వాత మమ్మల్ని కూడా అంత బాగా చదివించింది.ఒక్క విషయం మాత్రం మాకు పదే పదే చెప్పేద ఎవరుఉన్న,లేకపోయి మనకు జీవితాంతం తోడుగాఉండి ఇంత అన్నంపెట్టేది చదువేనని,అది జీవితాంతం గుర్తుపెట్టుకున్నాను.నేను చిన్నప్పుడు అంటే 3-4సంవత్సరాలవయసులో చుట్టాల ఇంటికి వెళ్ళినపుడు  నాకు తెలిసిన పద్యాలన్నీ చెప్తుంటే అందరూ పదేపదే బాగా చెప్పిందని మెచ్చుకున్నారుట.దాంతో నాకు బాగా దిష్టితగిలి 3 రోజులు జ్వరం వచ్చేసిందట. ఆ కాలంలో  పిల్లలు  ఏం చెప్పినా అద్భుతంగా ఉండేది. కానీ, ఇప్పుడో బడికిపోకముందే ఇంగ్లీష్మాట్లాడాలి,ఇంగ్లీష్లోనే ఏడవాలి,నవ్వాలి. ఇంకా చెప్పాలంటే 2వ సంవత్సరం నుంచే బడికి తోలి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేంత వరకు తోముతారు.
               ఇంకొక జ్ఞాపకం..పరీక్ష రోజున మేము వ్రాసిన సమాధానాలన్నీ ఇంటికి వచ్చి మా అమ్మకు అప్పజెప్పాలి. అమ్మకు అన్నిటికి సమాధానాలు ఎలా గుర్తుంటాయో అని తెగ ఆశ్చర్యపడేదాన్ని.కానీ మేము అప్పజెప్పే విధానాన్ని బట్టి మేము సరిగ్గా వ్రాశామో లేదో కనిపెట్టేసేది. : ) : ) ఇలా అడుగుతుందని వ్రాయని సమాధానాలు చూసి నేర్చుకునేవాళ్ళం. ఇవి తర్వాత వ్రాసే పరీక్షలకు ఉపయోగపడేవి. ఇప్పటికి కూడా నేను తప్పు వ్రాసిన సమాధానాలను వెంటనే refer చేసి నన్ను నేను update చేసుకుంటూ ఉంటాను.చిన్నపుడు నేను చదివిన సుమతీ,వేమన శతక పద్యాలు నాకు చాలా ఇష్టం. ఈ కాలం పిల్లలకి అవి ఏంటో కూడా తెలిసే అవకాశం లేదు. అందరూ  మేము వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరో, నానమ్మ ఊరో వెళ్ళామని చెప్తే నాకు కూడా అలా గడపాలని అనిపిస్తుండేది. కాని అంత అదృష్టం లేదు మాకు. ఇంట్లోనే మా అమ్మతోనే ఉండే వాళ్ళం. మా అమ్మ మమ్మల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దింది కాబట్టి ఇలా ఈరోజు ఉన్నతంగా బతుకుతున్నాం. ఇంకా ఎంత చెప్పినా అమ్మ గురించి తక్కువ అవుతుంది.