Friday 4 January 2013

నా ఆలోచనలు మాత్రమే

                                     జీవితంలో బాగా స్థిరపడి మంచి ఉద్యోగంలో చేరి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లి,తండ్రి వాళ్ల పిల్లలకు చిన్నప్పటి నుంచి నూరిపోసే మాటలు ఇవి. చిన్నప్పుడు బాగా చదివి, మంచి
మార్కులు తెచ్చుకుని కష్టపడి పై చదువులు చదివి తప్పటడుగు వేయబోయిన ప్రతిసారి అమ్మ,నాన్నల
శ్రమను, మన పైన ఉన్న కొండంతటి ఆశల్ని గుర్తు తెచ్చుకుని మళ్లీ మనసుని నియంత్రించుకుని సరైన
మార్గంలో నడుస్తూ సాగిస్తున్న ఈ  జీవన ప్రయాణంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు...
                       అందవిహీనంగా ఉంటానని, చక్కని మాటలు పలుకుతున్నా నా గొంతుక మధురమైన
కోయిల పాటలా కాకుండా గార్ధభస్వరమని నా బాల్యంలో తోటి విద్యార్థులు చేసిన అవహేళన తలుచుకుని
అప్పటి నుండి ఇంకెవరితోనూ కలవకుండా, నా గొంతుక నుంచి మాట పెగల్చకుండా ఒంటరిగా ఆ పసి మనసు తల్లడిల్లితే దానిని ఎలా ఊరడించాలో తెలియక ఎందుకు నాకీ పుట్టుక అని అనిపించిన క్షణాన్ని నా మనసు
నుంచి ఎవరు చెరిపేయగలరు?? ఒక్క నా మరణం తప్ప!!! అప్పటి నా పసిమనసుకి అర్థమైన విషయం ఈ
లోకంలో బ్రతకడానికి కావాల్సిన అర్హతల్లో ముఖ్యమైనది.. అందమని!!
                     చదువులో ఎంత ముందంజ వేసినా సాటి విద్యార్థుల నుంచి వచ్చే అవహేళనలు, చీత్కారాలు..
నా హృదయాన్ని అమితంగా గాయపరిచాయి. పాతబడిన దుస్తుల్ని చూసి  అవహేళనగా  అరుస్తూ నా పేదరికాన్ని వెక్కిరించిన వాళ్ల సౌభాగ్యానికి బాధపడాలో, లేదంటే అమ్మని వెళ్లి ఎందుకు రోజు  ఇంత పాతబడిన బట్టల్ని వేసుకుంటున్నానని అడగాలో తెలీదు. అసలు మేము అలాంటి పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నామో నిజంగా తెలియకుండానే నా బాల్యం గడిచింది.
                       ఇన్ని బాధల మధ్య నాకు తెలిసింది ఒక్కటే, చదవాలి అని!! చదివితే ఉద్యోగం
వస్తుంది,మంచి పేరు వస్తుంది. నేను అందంగా లేకపోయినా, నా స్వరం బాగోకపోయినా నన్ను అందరూ
గౌరవంగా చూస్తారు అనే ఒక గుడ్డి నమ్మకంతో చదివాను. ఇప్పుడు నన్ను చూసి మొహం పైనే ఎవరూ
మాటలు అని నన్ను కించపరచకపొయినా వెనకాల ఇంకా అవహేళనలు ఉన్నాయి. కానీ అవన్నీ
మనసులో ఒక న్యూనతా భావాన్ని బలపరిచాయి.
                   ఇంక కాలేజి స్నేహాలు దాదాపు డబ్బుతో  ముడిపడి అప్పటి దాకా తెలియని ఒక రంగుల
ప్రపంచం.ఇలా కాలేజిలో మాటి మాటికి జరిగే అట్టహాసంగా జరిగే పార్టీలకు వెళ్లకుండా ఉండేది, పొగరుతో
కాదని ఆ ఒక్క పార్టీకి ఇచ్చే డబ్బుకోసం అమ్మ,నాన్న ఎంత కష్టపడతారో చెప్పి వాళ్ల జాలి మాటలు
వినడం ఇష్టంలేక ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకు తిరిగేదాన్ని. దాన్ని వాళ్లంతా
ఎవరితో కలవడానికి ఇష్టపడని ఒక వింతజీవిగా భావించి మెల్లిగా ఇలాంటి విషయాల్లో నన్ను అడగడమే
మానేశారు. జీవితం నేర్పిన మరొక పాఠం నాకు, నా స్నేహితులకు మధ్య స్నేహం మనుగడకు
కావల్సినది డబ్బు అని ...           
              అందుకే స్నేహం ఏది ఆశించదు అన్న మాట విన్న ప్రతిసారి అదొక అతిశయోక్తిగా అనిపిస్తుంది.
కొంతమంది నన్ను తక్కువచేసి మాట్లాడి వాళ్ల స్నేహితుల ముందు నన్ను చిన్నబుచ్చిన సందర్భాలు
ఎన్నో.. అందుకే ఒకరితో స్నేహానికి వందసార్లు ఆలోచిస్తాను.. వాళ్ల జీవితంలో నేను వాళ్లకి సముద్రంలో
ఒక చిన్న నీటిబొట్టే కావొచ్చు, కానీ వారి స్నేహం నా జీవితానికి చాలా ముఖ్యమైనదని నాకు మాత్రమే
తెలుసు. స్నేహానికి కూడా పరపతి కావాలనే మనుషుల మధ్య ఉన్న నాకు  నా స్నేహంకోసం చేతులు
చాచే ప్రతిఒక్కరిని  చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది. కానీ మనసులో ఒక చిన్న ఆందోళన కుడా.. నా
 నుంచి వీళ్లు నిజంగానే ఏమి ఆశించట్లేదా అని? నిజజీవితంలోనే నాకు దొరకని స్నేహం ఇక
ముఖపుస్తకంలో, జి-మెయిల్ లో ఇచ్చే స్నేహాల్లో ఉంటుందని నేను నమ్మను ఖచ్చితంగా. అటువంటి
స్నేహాలు మళ్లీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్న తర్వాత కొనసాగుతాయన్న నమ్మకం నాకు లేదు.
నా జీవితం నాకు నేర్పిన పాఠం ఎవరితోనైనా ఎంత తొందరగా దగ్గరైతే, అంత తొందరగానే విడిపోతానని..
కొంతమంది వాళ్లకు నచ్చినట్టుగా నేను మారాలని ఆశిస్తారు. నన్ను నన్నుగా ఎందుకు స్వీకరించరో
అర్థం కాదు నాతో స్నేహమే ముఖ్యమైనపుడు. మొహం పైనే నచ్చని విషయాన్ని చెప్పకుండా వారి
వెనకాల దొంగచాటుగా నవ్వడం ఎంత వరకు కరెక్టో నాకర్థం కాదు.
            నా జ్ఞాపకాల తుట్టను కదిపితే కదిలిన తేనెలాంటి మధురమైన నా జీవితానుభవాలు.. అవెంత
మధురమో నా కంటి కనుపాప నుంచి జాలువారిన అశ్రువులు చెబుతున్నాయి..
                 

11 comments:

  1. hi chinni... mi blog chadivanu. mi fighting spirit nachindi. But ippudu suddengaa ilaa vyraagyam nimpukuni maatladadam nachaledu. Nenu mee antha kashta padi undakapovachu. But similar problems konni face chesanu. From my experiences, I can say that "Education is the biggest leveller in our society". Mee friends jeevitham lo meeroka samudrapu neeti chukkani annaru. Kaani aa neeti chukkala nunde oka muthyam pudtundi ani marchipovaddu. Meeru mee mitrula jeevitaallo alaanti viluvayina Neeti chukka ani cheppadaniki naaku enta maatram sandeham ledu.Kaayalu unna chettu meedakee raallu vestaru. Kaayalu leni chettu vaipu evaru kannethi kuda chudaru. The very fact that people speak ill about you says that they are insecure due to your success. So they are trying to bring you down. Don't lose hope. Ee kotta samvatsaram lo meeru kachitamgaa marinni kotta ettulu andukuntaru.

    ReplyDelete
  2. నీ మనసు పడిన వేదనను నేనర్ధం చేసుకోగలను. కాని ఎదుటి వారిని కావాలని కించపరుస్తూ మనసుని గాయపరిచే నీచమైన మనుషులను పట్టించుకోవడం అనవసరమని మరొక్క సారి జ్ఞాపకం చేసుకో. చిన్నీ, అందం శరీరానికి కాదు మనసుకి సంబంధించినది. ఉన్నంతలోనే ఇతరులకు సాయపడే వారే నిజమైన ధనవంతులు నా దృష్టిలో. నువ్వు ఎంతో అందమైన, ధనవంతురాలివి. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలకు క్రుంగిపోకుండా వాటన్నిటిని జయించి మరొకరికి స్పూర్తిగా నిలుస్తున్న నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. "నా జీవితం నాకు నేర్పిన పాఠం ఎవరితోనైనా ఎంత తొందరగా దగ్గరైతే, అంత తొందరగానే విడిపోతానని..." ఈ మాట వాస్తవం కాదు చిన్నీ. ఇంకా యేవో చెప్పాలని ఉంది కాని మాట్లాడలేకపోతున్నా..

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. * చిన్నిగారు, నిజమేనండి. సమాజంలో రకరకాల మనస్తత్వాల వాళ్ళు ఉన్నారు.
    * అందం, చదువు, డబ్బు లేకపోయినా వెక్కిరిస్తారు.
    * అందం, చదువు, డబ్బు ఉన్నవాళ్ళను చూసినా ఈర్ష్యతో వెక్కిరిస్తారు.
    * అయితే, సమాజంలో మంచి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు.
    * ఒకే మనిషి కొన్నిసార్లు మంచిగాను, కొన్నిసార్లు చెడ్డగాను కూడా ప్రవర్తిస్తారు.
    ( పరిస్థితిని బట్టి. )
    * ఇతరుల వ్యాఖ్యానాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకే బాధ కలుగుతుంది. అలాగని ఇతరుల వ్యాఖ్యానాలను పట్టించుకోకుండా ఉండలేము , ఇలాంటప్పుడు దైవాన్ని ప్రార్ధించుకుంటే మనసుకు ఊరట లభిస్తుంది.

    ReplyDelete
  5. చిన్ని గారు, ప్రియ గారు చెప్పినట్టు మనసుని గాయపరిచే వాళ్ళని పట్టించుకోవటం అనవసరం.
    "స్నేహం ఏది ఆశించదు అన్న మాట విన్న ప్రతిసారి అదొక అతిశయోక్తిగా అనిపిస్తుంది" - నిజమైన స్నేహం నిజంగానే ఏమీ ఆశించదు చిన్ని గారు. అలాంటి స్నేహితులు ఒకరిద్దరు ఉన్నా చాలు. మిగతా వాళ్ళ గురించి పట్టించుకొని అనవసరంగా మనసుని బాధపెట్టటం ఎందుకు.

    ReplyDelete
  6. చిన్నప్పుడు అర్థం కాలేదు కాని, ఇప్పుడు నాకు పిల్లలు కలిగాక bullying ఎంత భయనకమో అర్థం అవుతుంది. చిన్న పిల్లలకు bullying, యుక్త వయసులో రాగింగ్, పెద్దయ్యాక మన వెనక నవ్వటం(దానికి ఏమయినా పేరు ఉందా), పెద్దయ్యాక ఉన్న ఒక్క ఊరట ఏమిటంటే మనకు మనం తమాయించుకోగలగటం. మీరు పడ్డ భాద అర్థం చేసుకోగలను చిన్ని గారు.

    ReplyDelete
  7. మీరు చెప్పింది నిజం, స్నేహానికి కూడా తాహతు చూస్తున్న కాలం.

    ReplyDelete
  8. చిన్నిగారు..

    పైన మిత్రులందరూ చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తూ...

    చిన్నతనంలో మిత్రుల అవహేళనలను ఎదుర్కొని గట్టిగా నిలదొక్కుకున్న మీ స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయం.

    నిజంగా వాటిని ఎదుర్కొని నిలబడటం గొప్ప విషయం. ఈ సందర్భంగా నాకో విషయం గుర్తుకు వస్తోంది..

    అప్పటిదాకా హాయిగా సాగిపోతున్న ఓ కుటుంబంలో పెను ప్రళయమే వచ్చి ఒక కుటుంబం చిన్నాభిన్నమైపోయింది... ఎందుకంటే... క్లాసురూంలో తోటి విద్యార్థులు చేస్తున్న హేళనలను తట్టుకోలేని ఓ పసి మనసు ఆత్మహత్య చేసుకుంది.

    పాప లేని లోకంలో ఇక మేమెందుకు అనుకున్న తన అమ్మా నాన్న కూడా ఆత్మహత్యకు పాల్పడి, వారిలో తండ్రి మాత్రం పోయి, తల్లి మిగిలింది. అలాంటి తల్లి పరిస్థితిని, వేదనని ఒకసారి తల్చుకుంటే అసలు మనసు మూగవోదా...

    ఇక్కడ నేను చెప్పొచ్చేదేమంటే... తోటి విద్యార్థుల హేళనలను ఆ అమ్మాయి ధైర్యంగా ఎదుర్కొని ఉంటే ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేదా...

    చిన్న వయసులోనే మీరు ఎంతో నిబ్బరంగా.. చదువే పదిమందిలో మనల్ని గౌరవంగా నిలబెడుతుందని నమ్మి ఆ దిశగా సాగిపోయారు... ఆ అనుభవాలను ఇప్పుడు మాతో ఇలా పంచుకోగలుగుతున్నారు... అదే బేలగా ఉండి ఉంటే... ఆ అమ్మాయి పరిస్థితే కదా...

    సో... మీరు రాసిన ఈ కథనం.. చాలా మందికి ఇన్స్ఫిరేషన్‌గా ఉంటుంది...

    చివరగా ఓ మాట... పైన మిత్రులు చెప్పినట్లుగా... స్వచ్ఛమైన స్నేహం ఉంటుంది చిన్నిగారు.. అలాంటి స్నేహాలు జీవితంలో ఒకటి రెండు దొరికినా చాలు.. జీవితం ఆనందమయమే... :)

    ReplyDelete
  9. చిన్ని నువ్వు జీవితంలో అనుభవించిన మానసిక క్షొభను అర్థం చేసుకోగలను. ప్రస్తుతం అందం,ఆర్థిక స్తోమతను బేరిజువేసుకొని స్నేహాలు కొనసాగుతున్న కాలంలో నిస్వార్థంతో కూడిన నిజమైన స్నేహితులు దొరకడం కష్టమే...ప్రియ గారు చక్కగ వివరించారు. పరిస్తితులకు తట్టుకుంటూ, పెనుసవాళ్ళకు జవాబిస్తూ, తోటివారికి ఉపయోగ పడుతూ, అర్థవంతంగా జీవించడమే జీవితం...నీ జీవితం.అలా కొనసాగాలని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  10. నువ్వు ఆటో ప్లే పెట్టిన సాంగ్ చాల బాగుంది చిన్ని....నాకు ఎందుకో ఆ సినిమా చాలా బాగ నచ్చింది....కాకపోతే క్లారిటిగా ప్లే కావడం లేదనుకుంటా.. and "Happy Sankranti" you and your family members.

    ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.