Wednesday, 6 February 2013

అంతు లేని ఆలోచనలు

                రోజూవారీ యాంత్రికజీవనంలో కొన్ని చిన్న చిన్న సంతోషాలు, జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠాలు నేర్పిన సంఘటనలు.. వెరసి జీవితంలో ఈ బంధాలు, అనురాగాలు ఏవి శాశ్వతం కాదని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. అన్ని అశాశ్వతం అని తెలుసు కానీ ఒక వ్యక్తి అన్న
మాటల్ని తేలికగా తీసుకోలేము. అలా అని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే మనకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు.
కానీ మానవుని మనసు కోతి కదా.. కోతి ఒక చిన్న కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దూకినట్టు, మనసు అంతే...
అలసట అన్నది ఎరగకుండా ఆలోచనల అలల తాకిడితో నిత్యం సతమవుతూ ఉంటుంది.
                      అందుకే ధ్యానం చేయాలేమో.. కొన్ని నిముషాలైనా మనసుని ఆలోచనల నుంచి రక్షించడానికి..అందరికీ ఒక మనసు ఉంటుంది. ఎదుటి వారి మనసుని గాయపరిచేట్టు మాట్లాడుతాం కోపంలో, మళ్లీ మనసుని శాంతపరిచి ఆలోచిస్తే చేసిన తప్పు తెలుస్తుంది. కొంతమంది వెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందుతారు.పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు కదా. కానీ కొంతమంది అలా కోపంలో అరిచిన మాటల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఆ అరిచిన వ్యక్తిని జీవితంలో దగ్గరకు రానీయకపోవచ్చు. దీని వల్ల మనకెంత నష్టమో తెలుస్తుంది.
                                        *****************************************
                        అమ్మాయి అంటే అబ్బాయిల కాళ్ల దగ్గర సేవచేస్తూ పడకకి మాత్రమే అవసరమనుకుంటూ ఉంటారు కొంతమంది మహానుభావులు..తరాలు మారినా, యుగాలు మారినా ఈ వాక్యంలో ఎలాంటి మార్పు ఉండదు.భార్య,భర్త అంటే ఒక బండికి రెండు చక్రాలలాంటి వారు అని అంటారు.. మరి అలాంటప్పుడు ఒక చక్రంలో గాలి లేకుండా బండి నడపగలరా?? లేదు కదా, మరి ఒకరు అణిగి,మణిగి ఉండాలన్న ఆలోచన ఎందుకు పెట్టుకుంటారు మనసులో? నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా??ఎంత పైకి మద్దతు తెలిపినా లోపల మాత్రం అంట్లు తోముకోక నువ్వు ఆఫీసులో ఏం పీకుతావే?? అనే అభిప్రాయంలో ఉంటారు..
                       నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకు కావలసింది ఏంటంటే ప్రతి విషయానికి ఎందుకు? అనే ప్రశ్న లేకుండా చెప్పిందల్లా వినే ఒక కుక్కపిల్ల లాంటి అమ్మాయి కావాలి. వేళకు అన్ని సమకూర్చిపెట్టి తను ఎన్ని అవమానాలకు గురిచేసినా తలొంచుకుని అన్ని భరించి ఇంట్లో బానిసలాగా పడుండే ఒక అమ్మాయి అయితేనే అబ్బాయిలకు నచ్చుతుంది. అలా కాదు అని గొంతు విప్పితే దేని దేనికో ముడిపెట్టి అసలు మనకు పుట్టిన పిల్లలు నా వల్లే పుట్టారా? లేదా ఇంకెవరితోనైనా తిరిగితే పుట్టారా అనే నీచపు మాటలు మాట్లాడి ఆ అమ్మాయి ఆత్మాభిమానం పైనా, మానం పైనా అనుమానం ప్రకటించిన ఇలాంటి కుక్కలకు ఏ న్యాయస్థానంలో ఎలాంటి శిక్షవేస్తే వాడి బుద్ధి మారుతుంది??
                      ఇప్పటి పరిస్థితుల్లో ఇన్ని అవమానాలు భరించి తన జీవితాన్ని నాశనం చేసుకుని అమ్మాయి బతుకుతుంది అంటే కుటుంబగౌరవం కాపాడాలన్న తాపత్రయం అయ్యుండొచ్చు. పిల్లల్ని అనాథలుగా వదిలివెళ్లే ధైర్యంలేక అయ్యుండొచ్చు. కానీ అదే సహనాన్ని పదే పదే పరీక్షపెడితే చివరికి కొంతకాలానికి అబ్బాయిలపైన ఆసిడ్ దాడి అనే వార్త వినాల్సివస్తుంది. ఈ పురుషాహంకార సమాజంలో బతుకుతున్నందుకు తలదించుకుంటున్నాను.ఈ అభిప్రాయం కలగడానికి నా జీవితంలో ఎదురైన సంఘటనలు కారణం. తప్పులు అందరూ చేస్తారు. కానీ కొంతమంది వాటిని సరిదిద్దుకుని జీవితంలో ముందుకెళ్తారు. కొంతమందికి ఆ ధైర్యంలేక ప్రాణాన్ని వదిలేసుకుంటారు. అలా ప్రాణాలను బలి తీసుకోవాలన్నంత బాధపెట్టి వాళ్ల చావుకి కారణమైన ప్రతిఒక్కరికి దేవుడి చేతిలో అంతకంటే పెద్ద శిక్ష పడుతుందనే ఆశతో....

16 comments:

 1. మీరు పూర్తి నిరాశావాదం లో ఉండి ఈ పోస్ట్ రాసారేమో అనిపించింది చిన్ని గారు ..మీవి నిజంగా అంతులేని ఆలోచనలే ...చక్కగా రాసారు.చలం గారు స్త్రీ వాదం గురించి ఎప్పుడో చెప్పారు...కానీ ఈ మారని ధోరణి మన సమాజం లో బాగా నిక్షిప్తమైపోయింది. ఆలోచింపజేసిన టపా రాసారు.

  ReplyDelete
  Replies
  1. నవజీవన్ గారు,కొంతవరకు నిరాశవాదమే నాది, కానీ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలని అనుకుంటున్నాను.ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు.

   Delete
 2. నిరాశ సహజం, అందులో కూరుకుపోవడం అసహజం.సూర్యునికి గ్రహణం కొద్దిసేపే! మనం ఆశా జీవులం. అందరూ స్త్రీ ద్వేషులే అనుకోడం పొరపాటు, ఆలోచించమ్మాయ్!!!

  ReplyDelete
  Replies
  1. తాత గారు, అంతే ఏది శాశ్వతం కాదు, మనం కూడా..మీలాంటి వారి మాటలే నాకు ఊరడింపునిస్తాయి. ధన్యవాదాలు మీ ప్రతిస్పందనకు.

   Delete
 3. >>నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా?
  ప్రతి విషయంలో హర్షించేవాళ్ళు ఉండకపోవచ్చు, ఉన్నారేమో కూడానూ. అయినా

  >>అవసరమనుకుంటూ ఉంటారు *కొంతమంది* మహానుభావులు
  కొంతమంది అని మీరే చెప్తున్నారుగా. అందరూ చెడ్డవారూ కాదూ, మంచివారూ కాదూ. మనుషులు అంతే.

  ReplyDelete
  Replies
  1. సమాజంలోని కొంతమంది వ్యక్తులని చూసిన తర్వాత నేను ఏర్పరుచుకున్న కొన్ని అభిప్రాయాలు, ఇలా కూడా ఉన్నారు అని చెప్పాను నాగార్జున గారు. ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 4. చిన్ని గారు మీ జీవితంలో జరిగిన సంఘటనలు మిమ్మల్ని ఎంతగ బాధిస్తే మీరు ఇలా స్పందిస్తారో మీ పోస్టును బట్టి అర్థం అవుతుంది....మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాం న్యాయమైనదే, అర్థం చేసుకోవలసిందే, మీలాంటి అభిప్రాయంతో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు .మీ ఈ పోస్ట్ చదువుతుంతే వారం రోజుల క్రితం నా దృష్టికి వచ్చిన ఒక సంఘటన ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక ఆమె (ఆమె బాగ చదువుకుని, కులాంతర వివాహం చేసుకుంది) ఆమె నాతో మాట్లాడుతూ ఒక మాట అంది అదేంటంటే "అన్నా నాకు ఈ పాప పుట్టింది, ఈ పాప అదృష్టమో దురదృష్టమో తేలియదు కాని నా భర్త పోలికలతో పుట్టింది, లేకపోతే నా భర్త ఈ పాప ఎవరికి పుట్టిందో అని నన్ను అనుమానించి, ఇబ్బందులకు గురిచేసేవాడు" అని కన్నిరు పెట్టుకుంది...అమేను భర్త తనను ఎన్ని ఇబ్బందులకు, అవమాలాకు గురిచేస్తుంటే ఇలా అనగలిగిందో పై వాఖ్యం బట్టి అర్థం చేసుకొవచ్చు....నిజానికి చాల మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్తితినే ఎదుర్కొంటున్నారు... గత్యంతరం లేక కొందరు, ఏం చేయలేని నిస్సహయ పరిస్తితిలో కొందరు, ఇంకొందరేమో మీరు చెప్పినట్లు కుటుంబగౌరవాని కాపాడాలని, పిల్లల్ని అనాధల్ని చేయకూడదని అనేక అవమాలను ఎదుర్కొంటు, కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.....వీలందరి సమస్యకు పరష్కారం అంత సులబంగా దొరకదేమో?....కాని ఇలా పురుషుడు ఎందుకు మృగంలా ప్రవర్తిస్తున్నాడు,వాడు ఇలా మారడానికి కారణాలు ఎంటనేది మూలాలని వేతికితే పరిష్కారం దొరకవచ్చేమో అని నేను అనుకుంటున్నాను......ఇక మీరు అన్నట్లు "నిజానికి ప్రతి విషయంలో అమ్మాయిల గెలుపుని హర్షించే పురుషులు ఉంటారా??"...నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకు కావలసింది ఏంటంటే ప్రతి విషయానికి ఎందుకు? అనే ప్రశ్న లేకుండా చెప్పిందల్లా వినే ఒక కుక్కపిల్ల లాంటి అమ్మాయి కావాలి. వేళకు అన్ని సమకూర్చిపెట్టి తను ఎన్ని అవమానాలకు గురిచేసినా తలొంచుకుని అన్ని భరించి ఇంట్లో బానిసలాగా పడుండే ఒక అమ్మాయి అయితేనే అబ్బాయిలకు నచ్చుతుంది." అని ప్రశ్నించారు....అమ్మాయిల ప్రతి గెలుపుని హర్షించే పురుషులు ఉన్నారు, కాని వాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా ఉంది. అంతే కాని ఎవరు లేరు అని మాత్రం అనుకొవదానికి వీలు లెదు, కాకపోతే వాళ్ళు మనకు తెలిసిన వాల్లలో ఉండకపోవచ్చు, లెకపోతే మనసు తారస పడకపోవచ్చు, అంతే కాని అసలు అలాంటి వాళ్ళు లేరని అనలేము...స్త్రిని గౌరవించే సమూహాలతో, సంస్థలతో మీ ప్రశ్నలకు సమాదానం దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను, అటువైపు మీ ప్రాయణం సాగాలని అశిస్తూ, పురుషాదిక్య సమాజాన్ని కుకటి వేళ్ళతో పెకిలించే రోజు రావాలని, కోరుకుంటున్నాను

  ReplyDelete
  Replies
  1. డేవిడ్ గారు, మాతృత్వం అనేది అమ్మాయిలకు దేవుడు వరంగా ప్రసాదించాడని ఇప్పటిదాకా అనుకునేదాన్ని. కానీ అదే అమ్మాయిల పాలిట ఇప్పుడు శాపంగా పరిణమిస్తోందని మీరు చెప్పిన ఉదాహరణ బట్టి అర్థమవుతోంది. జీవితం అంటే అన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవడమే కదా!! మీ వ్యాఖ్యకు, మీ ఓదార్పు మాటలకు ధన్యవాదాలు.

   Delete
 5. చిన్ని గారు మానసికంగా బాగా అలసిపోయి వున్నారు.చాలా సమయాల్లో మంచి అనిపించుకోవడానికి అవతలి వారిని మెప్పించడానికి ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాం. అలంటి వారిలో మార్పు కోరుకోవడం కంటే మీరే విధంగా ఉండాలో అలా వుండండి. మీకు తృప్తిగా వుంటుంది. ఎవరూ మీతో ఏపనీ బలవతంగా చేయించలేరన్ని విషయాన్నీ గుర్తుపెట్టుకోండి.

  ReplyDelete
  Replies
  1. జ్యోతిర్మయి గారు, నిజంగా మీ మాట నాకు చాలా ఓదార్పుగా అనిపించింది. ఈ మానసిక అలసట తీరే రోజు కోసం ఆశగా ఎదురుచుస్తున్నాను.ధన్యవాదాలు. ఈ మాట నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను.

   Delete
 6. చిన్ని గారు, ఎవరో కొంతమంది అలా చేశారని అందరూ అలాంటివారే అనుకోవటం పొరపాటు. అలా అని అందరూ మంచివారు అని అనట్లేదు. అయినా మిమ్మల్ని ఎంతగానో బాధించిన సంఘటనల వల్లనే ఈ టపా రాశారని అర్ధం చేసుకోగలను.

  ReplyDelete
  Replies
  1. శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు స్పందించినందుకు..పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని ఎక్కడో చదివాను.కానీ పోరాటం ఎలా మొదలుపెట్టాలో తెలియక దేవుడి సాయం కోసం చూస్తున్నాను. ఈ క్షణం శాశ్వతం కాదు అని మనసుకి నచ్చజెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాను.

   Delete
 7. "ఈ పురుషాహంకార సమాజంలో బతుకుతున్నందుకు తలదించుకుంటున్నాను"

  చిన్నిగారు... ఈ ఒక్క వాక్యం చాలు మీ ఆవేదనను అర్థం చేసుకునేందుకు. మీరన్నట్లు కుటుంబ పరువు అనో, పిల్లల కోసమనో బయటికి రాలేక మౌనంగా బ్రతికేస్తున్నవాళ్లు మన సమాజంలో కోకొల్లలు. కానీ ఎంత కాలం ఇలా..?

  ఒక నిస్సహాయతలో దేవుడిపై భారం వేసి ముందుకెళ్లటమే పరిష్కారమా...?! తల్చుకుంటే బాధగా ఉంది.. అయినా ఏం చేయగలమన్న నిట్టూర్పు మరోవైపు... :(

  ReplyDelete
  Replies
  1. శోభ గారు,దేవుడి పైన భారం వేయడం ఒక్కటే..పరిష్కారం ఇంకోటి లేదు, అంతకు మించిన భరోసా మనకు లేదు కదా..ధన్యవాదాలు:)

   Delete
 8. ఒకప్పుడు పురుషాహంకారం ఒకటే ఉండేది. ఇప్పుడు రెండూ ఉన్నాయి. ఎవరినని నిందించగలం ?

  ReplyDelete
 9. ఒకప్పుడు పురుషాహంకారం ఒకటే ఉండేది. ఇప్పుడు రెండూ ఉన్నాయి. ఎవరినని నిందించగలం ?

  ReplyDelete

మీరిచ్చే ఒక చిన్న ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య నాకెంతో విలువైనది.మీరిచ్చే సూచనలు,సలహాలు ఈ బ్లాగును మరింత మెరుగ్గా తయారుచేయడానికి ఉపయోగపడతాయి. అర్థరహితమైన కామెంట్లకు చోటు లేదు.